దుబాయ్: స్వర్ణ పతకమే లక్ష్యంగా ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ 11వ ర్యాంకర్ సింధు 21–15, 22–20తో ప్రపంచ 17వ ర్యాంకర్ వెన్ చి సు (చైనీస్ తైపీ)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. 46 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో సింధు 11–14తో వెనుకబడింది. ఈ దశలో సింధు ఒక్కసారిగా చెలరేగి వరుసగా తొమ్మిది పాయింట్లు గెలిచి 20–14తో ఆధిక్యంలోకి వెళ్లింది.
ఆ తర్వాత ఒక పాయింట్ కోల్పోయిన సింధు వెంటనే మరో పాయింట్ నెగ్గి గేమ్ దక్కించుకుంది. రెండో గేమ్ హోరాహోరీగా సాగినా కీలకదశలో సింధు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో తొమ్మిదో ర్యాంకర్ హాన్ యువె (చైనా)తో సింధు ఆడుతుంది.
పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో కిడాంబి శ్రీకాంత్ 21–13, 21–8తో అద్నాన్ ఇబ్రహీం (బహ్రెయిన్)పై, ప్రణయ్ 21–14, 21–9తో ఫోన్ ప్యాయె నైంగ్ (మయన్మార్)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరారు. లక్ష్య సేన్ 7–21, 21–23తో లో కీన్ యెవ్ (సింగపూర్) చేతిలో ఓటమి చవిచూశాడు.
సిక్కి–రోహన్ జోడీ విజయం
మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ (భారత్) జోడీ 21–12, 21–16తో చాన్ పెంగ్ సూన్–చె యి సీ (మలేసియా) జంటను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) ద్వయం 17–21, 21–17, 21–18తో లానీ ట్రియ మాయసరి–రిబ్కా సుగియార్తో (ఇండోనేసియా) జోడీపై నెగ్గింది.
పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 21–14, 21–17తో టాన్ కియాన్ మెంగ్–టాన్ వీ కియాంగ్ (మలేసియా) జోడీపై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది.
Comments
Please login to add a commentAdd a comment