పీవీ సింధు
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సైతం సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. కొద్దిసేపటి క్రితమే పురుషుల సింగిల్స్ విభాగంలో కిదాంబి శ్రీకాంత్ సెమీ ఫైనల్‌కు ప్రవేశించిన విషయం తెలిసిందే. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో ఒలంపిక్ విజేత కరోలినా మారిన్(స్సెయిన్)పై సింధు 22-20, 21-19తో వరుస సెట్లలో విజయం సాధించింది. తొలి గేమ్ నుంచే దూకుడుగా ఆడుతూ వచ్చిన సింధు విరామ సమయానికి ఆధిక్యంలో నిలిచింది. అయితే ఆ తర్వాత పుంజుకున్న మారిన్ వరుసగా స్కోరు సమం చేస్తూ వచ్చింది. కాగా ఈ క్రమంలో జోరు పెంచిన సింధు 22-20తో తొలి గేమ్‌ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత రెండో గేమ్‌లోనూ సింధు తొలి నుంచే ఆధిక్యం సాధిస్తూ వచ్చింది. ఆ క్రమంలోనే విరామానికి 11-6తో మరోసారి ఆధిక్యంలో నిలిచింది. తర్వాతి నుంచి దూకుడు పెంచిన మారిన్ అద్భుతంగా చెలరేగి స్కోరు సమం చేసే ప్రయత్నం చేసింది. కానీ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండానే సింధు 21-19తో రెండో గేమ్‌ను కైవసం చేసుకొని సెమీస్‌లోకి అడుగుపెట్టింది. సెమీస్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో సింధు తలపడనుంది. ఈ ఇద్దరు ఇప్పటి వరకు 11 సార్లు తలపడగా.. సింధు కేవలం మూడు సార్లు మాత్రమే నెగ్గింది.
ఇక శ్రీకాంత్ 21-18, 21-14 తేడాతో బ్రైస్ లీవర్‌డెజ్(ఫ్రెంచ్)పై గెలిచి సెమీ ఫైనల్ బెర్తును ఖాయం చేసుకున్నాడు. ఏకపక్షంగా సాగిన పోరులో శ్రీకాంత్ ఆద్యంతం ఆకట్టుకున్నాడు. తొలి గేమ్‌ను కష్టపడి గెలిచిన శ్రీకాంత్.. రెండో గేమ్‌ను సునాయాసంగా చేజిక్కించుకున్నాడు. శ్రీకాంత్ సెమీస్‌లో జపాన్ ఆటగాడు కెంటా మోమోటాతో తొలిసారి తలపడనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment