
సాక్షి, బెంగళూరు: భారత బ్యాడ్మింటన్ స్టార్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి పీవీ సింధు ‘ఏరో ఇండియా’ వైమానిక ప్రదర్శనలో సందడి చేసింది. తేజస్‌కు కో పైలెట్‌గా గగన విహారం చేసింది. ఇక్కడి యలహంక ఎయిర్‌బేస్ స్టేషన్‌లో ఈ వైమానిక ప్రదర్శన జరుగుతోంది. ఇందులో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) తయారు చేసిన తేలికపాటి యుద్ధ విమానం ‘తేజస్’ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కాక్‌పిట్‌లో కెప్టెన్ సిద్ధార్థ్ సింగ్‌తో కలిసి సింధు కో పైలెట్‌గా విమానాన్ని నడిపింది.
ఇలా తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో కో పైలెట్‌గా విహరించిన తొలి మహిళగా ఆమె ఘనతకెక్కింది. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తేజస్‌లో విహరించడం ఎంతో గర్వంగా ఉందని చెప్పింది. వైమానిక రంగంలో మహిళలు సాధించిన ఘనతలు అమోఘమని కొనియాడింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఈ యుద్ధ విమానం ఇటీవలే వాయుసేనలో చేరింది. గురువారం ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ కూడా తేజస్‌ను నడిపి చూశారు.