సింధుకు మరో అవార్డు
ముంబై: రియో ఒలింపిక్స్ రజత పతక విజేత, తెలుగు తేజం పీవీ సింధు ఖాతాలో మరో అవార్డు చేరింది. మారుతీ సుజుకి ‘స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును సింధు గెలుచుకుంది. స్పోర్ట్స్ ఇలస్ట్రేటెడ్ ఇండియా మేగజైన్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి ఈ అవార్డుల కార్యక్రమం జరిగింది. సింధుతో పాటు భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ‘కోచ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును అందుకున్నారు. తన శిష్యురాలు సింధు చేతుల మీదుగా గోపీచంద్ అవార్డును స్వీకరించడం విశేషం. ఈ కార్యక్రమంలో పలువురు క్రీడా ప్రముఖులు సందడి చేశారు.
బ్యాడ్మింటన్ డబుల్స్ కోచ్, ప్లేయర్ గుత్తా జ్వాల, ఫుట్‌బాల్ దిగ్గజం బైచుంగ్ భూటియా, బాక్సర్ ఆమిర్ ఖాన్, క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫ్లయింగ్ సిఖ్ మిల్కా సింగ్ ‘లివింగ్ లెజెండ్’ అవార్డును పొందారు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో రాణించిన భారత టెస్టు క్రికెటర్ లోకేశ్ రాహుల్ ‘గేమ్ చేంజర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును అందుకోగా... బీజింగ్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, షూటర్ అభినవ్ బింద్రా ‘లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్’ పురస్కారాన్ని గెలుచుకున్నారు. వీరితో పాటు రియో పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన దేవేంద్ర జజారియా, మరియప్పన్ తంగవేలు, వరుణ్, దీపా మలిక్‌లు కూడా అవార్డులను అందుకున్నారు. జూనియర్ పురుషుల హాకీ జట్టు ‘టీమ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును గెలుచుకుంది.