చాంపియన్షిప్ లో తెలుగు తేజాల ముందంజ
జకర్తా : ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో తెలుగు తేజాలు ముందంజ వేశారు. మూడో రౌండ్ లోకి పీవీ సింధూ, రెండో రెండో లోకి కిడాంబి శ్రీకాంత్ ప్రవేశించారు. లైని జార్స్ ఫెల్డ్పై 11-21, 21-17, 21-16 తేడాతో సింధూ విజయాన్ని సాధించింది. తొలి సెట్ కోల్పోయిన ఈ భారత స్టార్ షట్లర్ ఆ తర్వాత పుంజుకుంది. గాయాల నుంచి కోలుకుని పునరాగమనం చేసిన సింధూ పదకొండో సీడ్ గా బరిలోకి దిగిన విషయం విదితమే. 50 నిమిషాల పాటు జరిగిన పోరులో లైని జార్స్ ఫెల్డ్పై గెలిచి మూడో రౌండ్లోకి ప్రవేశించింది. మూడో రౌండ్లో ఒలింపిక్ చాంపియన్, మూడో సీడ్ క్రీడాకారిణి లీ ఝరయ్తో తలపడనుంది.
పురుషుల సింగిల్స్లో మూడో సీడ్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. ఆస్ట్రేలియాకి చెందిన మైఖెల్ ఫారిమన్ పై 21-10, 21-13 తేడాతో ఘన విజయాన్ని సాధించాడు. రెండు గేముల్లోనూ తన ఆధిక్యాన్ని ప్రదర్శించి కేవలం 24 నిమిషాల్లోనే ప్రత్యర్ధి ఆటకట్టించాడు. చైనీస్ తైపేయి ఆటగాడు హ్సు జెన్ హోతో తలపడనున్నాడు. గతేడాది జరిగిన డెన్మార్క్ ఓపెన్లో వీరిద్దరి మధ్య జరిగిన ఏకైన మ్యాచ్ లో గెలుపొందడం శ్రీకాంత్ కు కలిసొచ్చే అంశం.