గువాహటి: ఊహించినట్టే ఈ ఏడాదీ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ టైటిల్ కోసం భారత స్టార్స్ పీవీ సింధు, సైనా నెహ్వాల్ అమీతుమీ తేల్చుకోనున్నారు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో పీవీ సింధు (ఆంధ్రప్రదేశ్) 21–10, 22–20తో అష్మిత చాలిహ (అస్సాం)పై... డిఫెండింగ్ చాంపియన్ సైనా నెహ్వాల్ (పీఎస్‌పీబీ) 21–15, 21–14తో వైష్ణవి భాలే (మహారాష్ట్ర)పై గెలుపొందారు. క్రితంసారి జాతీయ చాంపియన్‌షిప్ ఫైనల్లో సింధుపై సైనా నెగ్గి మూడోసారి ఈ టైటిల్‌ను గెలిచింది. గతంలో సైనా 2006, 2007లలో కూడా ఈ టైటిల్‌ను సాధించింది. సింధు 2011, 2013లలో జాతీయ చాంపియన్‌గా నిలిచింది. ‘నా విషయానికొస్తే సైనాతో ఫైనల్ మరో మ్యాచ్ లాంటిదే. ఈ మ్యాచ్ ఆల్ ఇంగ్లండ్ సన్నాహాలకు ఉపయోగపడదు. నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తా’ అని సింధు వ్యాఖ్యానించింది.
పురుషుల సింగిల్స్ విభాగంలో లక్ష్య సేన్ (ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా), సౌరభ్ వర్మ (పీఎస్‌పీబీ) టైటిల్ కోసం తలపడతారు. సెమీఫైనల్స్‌లో లక్ష్య సేన్ 21–15, 21–16తో జాతీయ మాజీ చాంపియన్ పారుపల్లి కశ్యప్ (పీఎస్‌పీబీ)పై, సౌరభ్ వర్మ 21–14, 21–17తో కౌశల్ (మహారాష్ట్ర)పై విజయం సాధించారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో తెలుగు అమ్మాయి కె. మనీష (ఆర్‌బీఐ)–మనూ అత్రి (పీఎస్‌పీబీ) ద్వయం ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీస్‌లో మనీషా–మనూ అత్రి జోడీ 21–18, 21–17తో శ్లోక్ రామచంద్రన్–మిథుల (ఎయిరిండియా) జంటను ఓడించింది. మహిళల డబుల్స్ సెమీఫైనల్స్‌లో జక్కంపూడి మేఘన–పూర్వీషా రామ్ (ఆర్‌బీఐ) 21–13, 21–16తో కుహూ గార్గ్ (ఉత్తరాఖండ్)–అనుష్కా పారిఖ్ (గుజరాత్)లపై... శిఖా గౌతమ్ (ఎయిరిండియా)–అశ్విని భట్ (కర్ణాటక) 21–19, 24–22తో అపర్ణ బాలన్ (పీఎస్‌పీబీ)–శ్రుతి (కేరళ)లపై విజయం సాధించారు.
సింధుతో సైనా అమీతుమీ
Published Sat, Feb 16 2019 1:06 AM | Last Updated on Sat, Feb 16 2019 1:06 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment