మన సింధు 'రత్నం'
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించి భారత జెండాను వినువీధుల్లో ఎగరేసిన తెలుగమ్మాయి పీవీ సింధు కీర్తి కిరీటంలో మరో కిలికితురాయి చేరింది. కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న అవార్డును సింధు సోమవారం అందుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన జాతీయ క్రీడా అవార్డుల ప్రదానోత్సవంలో సింధు, సాక్షి మాలిక్లు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతులు మీదుగా అవార్డులు స్వీకరించారు. ఈ ఇద్దరితో పాటు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన షూటర్ జితూరాయ్, మహిళా జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ కూడా ఖేల్‌రత్న అవార్డులను అందుకున్నారు. వీరికి పురస్కారంతో పాటు రూ. 7.5 లక్షల చెక్ ను అందజేశారు.
దేశం నుంచి తొలిసారి ఒలింపిక్ రజతం సాధించిన మహిళగా సింధు ఘనత సాధించగా... తొలి మహిళా రెజ్లర్‌గా కాంస్యం దక్కించుకున్న సాక్షి ఆకట్టుకుంది. అలాగే కాంస్య పతకాన్ని తృటిలో కోల్పోయిన దీపా కర్మాకర్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి మహిళా జిమ్నాస్ట్‌గా పేరు తెచ్చుకుంది. ఇక గత రెండేళ్లుగా ఆరు అంతర్జాతీయ పతకాలను జితూ రాయ్ సొంతం చేసుకున్నాడు. దీంతో ఈ నలుగుర్ని ఖేల్ రత్న అవార్డు వరించింది.
మరోవైపు ఆరుగురు కోచ్లకు ద్రోణాచార్య అవార్డులను, 15 మందికి అర్జున అవార్డులను ప్రదానం చేశారు. నాగపురి రమేశ్ (అథ్లెటిక్స్), సాగర్ మాల్ దయాళ్ (బాక్సింగ్), రాజ్‌కుమార్ శర్మ (క్రికెట్), విశ్వేశ్వర్ నంది (జిమ్నాస్టిక్స్), ఎస్. ప్రదీప్ కుమార్ (స్విమింగ్), మహావీర్ సింగ్ (రెజ్లింగ్)లకు ద్రోణాచార్య పురస్కారం దక్కింది.
మరోవైపు అర్జున అవార్డుకు ఎంపికైనవినేశ్ ఫోగట్ (రెజ్లింగ్) వీల్ చైర్లోనే అవార్డుల ప్రదానోత్సవానికి హాజరైంది. రియో ఒలింపిక్స్లో మహిళల ఫ్రీస్టయిల్ 48 కేజీల విభాగంలో వినేశ్ ఫోగట్ క్వార్టర్ ఫైనల్లో గాయంతో మధ్యలోనే వైదొలిగిన సంగతి తెలిసిందే. సన్ యానన్ (చైనా)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో వినేశ్ కాలు తిరగబడి విలవిల్లాడింది. ఇంకా ఆమె గాయం పూర్తిగా నయం కాకపోవడంతో వీల్ చైర్లోనే అర్జున అవార్డును అందుకుంది.