సింధుకు ఎస్‌జేఎఫ్‌ఐ అవార్డు
హైదరాబాద్: రియో ఒలింపిక్స్ రజత పతక విజేత, తెలుగమ్మాయి పీవీ సింధు ఖాతాలో మరో అవార్డు చేరింది. భారత స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ సమాఖ్య (ఎస్‌జేఎఫ్‌ఐ) వార్షిక అవార్డుల్లో భాగంగా అందించే ‘స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారానికి సింధు ఎంపికైంది. ఆదివారం జరిగిన ఎస్‌జేఎఫ్‌ఐ వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
మరోవైపు గత డిసెంబర్ లక్నోలో జరిగిన జూనియర్ హాకీ వరల్డ్ కప్‌ను నెగ్గిన భారత హాకీ జట్టు ‘బెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును గెలుచుకుంది. గతేడాది జూలై నుంచి ఇప్పటివరకు క్రీడాకారుల ప్రదర్శనను పరిగణనలోకి తీసుకొని అవార్డులను ప్రకటించినట్లు ఎస్‌జేఎఫ్‌ఐ పేర్కొంది. ఈ అవార్డులను సెప్టెంబర్‌లో అందజేయనున్నారు.