మళ్లీ తొలి రౌండ్‌లోనే...
► వరుసగా మూడో ‘సూపర్’ టోర్నీలోనూ శ్రీకాంత్‌కు నిరాశ
► ప్రణయ్, జయరామ్ కూడా ఇంటిముఖం
► సింధు శుభారంభం
సింగపూర్ సిటీ: రియో ఒలింపిక్స్‌కు అర్హత గడువు సమీపిస్తున్నకొద్దీ భారత పురుషుల సింగిల్స్ ఆటగాళ్ల ప్రదర్శన ఆందోళన కలిగిస్తోంది. వరుసగా మూడో సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లోనూ భారత క్రీడాకారులు తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టారు. సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో భారత అగ్రశ్రేణి ఆటగాళ్లు మొదటి రౌండ్‌ను దాటలేకపోయారు. భారత నంబర్‌వన్, ప్రపంచ 14వ ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్‌తోపాటు ప్రపంచ 22వ ర్యాంకర్ ప్రణయ్, ప్రపంచ 24వ ర్యాంకర్ అజయ్ జయరామ్ కూడా తొలి రౌండ్‌లోనే ఓడిపోయారు. ఇండియా ఓపెన్, మలేసియా ఓపెన్ టోర్నీల్లోనూ భారత సింగిల్స్ ఆటగాళ్లందరూ మొదటి రౌండ్‌లోనే నిష్ర్కమించడం గమనార్హం.
మహిళల సింగిల్స్‌లో ప్రపంచ పదో ర్యాంకర్ పీవీ సింధు శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో సింధు 9-21, 21-17, 21-11తో బుసానన్ (థాయ్‌లాండ్)ను ఓడించింది. మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి-ప్రణవ్ చోప్రా జంట 21-15, 21-17తో ఇర్ఫాన్-వెని అంగ్రైని (ఇండోనేసియా) ద్వయంపై గెలిచింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో ప్రణవ్ చోప్రా-అక్షయ్ దేవాల్కర్ జంట 21-17, 16-21, 22-20తో లియు చెంగ్-లూ కాయ్ (చైనా) జోడీని ఓడించింది.
మరోవైపు పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ 28వ ర్యాంకర్ సు జెన్ హావో (చైనీస్ తైపీ)తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ 21-11, 18-21, 18-21తో ఓటమి చవిచూశాడు. గతంలో సు జెన్ హావో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన శ్రీకాంత్ ఈసారి మాత్రం ఓడిపోయాడు. గంటా 17 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ హైదరాబాద్ ప్లేయర్ కీలకదశల్లో తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రణయ్ 21-18, 18-21, 19-21తో ప్రపంచ నంబర్‌వన్ చెన్ లాంగ్ (చైనా) చేతిలో పోరాడి ఓడిపోగా... ప్రపంచ 14వ ర్యాంకర్ మార్క్ జ్విబ్లెర్ (జర్మనీ) 21-17, 21-16తో జయరామ్‌ను ఓడించాడు.
మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప ద్వయం 18-21, 16-21తో గో ఆ రా-యో హే వన్ (దక్షిణ కొరియా) జంట చేతిలో... సిక్కి రెడ్డి (భారత్)-పియా జెబాదియా (ఇండోనేసియా) జోడీ 7-21, 6-21తో షిజుకా-మామి నైతో (జపాన్) ద్వయం చేతిలో ఓడిపోయాయి.