
'సింధు తప్పకుండా గెలుస్తుంది'
హైదరాబాద్: రియో ఒలింపిక్స్ లో తమ కుమార్తె పతకం సాధిస్తుందని బ్యాడ్మింటర్ స్టార్ పీవీ సింధు తల్లిదండ్రులు పీవీ రమణ, విజయ విశ్వాసం వ్యక్తం చేశారు. గురువారం జరిగే సెమీఫైనల్లో సింధు విజయం సాధించాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. 'కచ్చితంగా సింధు గెలవాలని కోరుకుంటున్నాం. ఆమెతో మాట్లాడాను. ఆటపైనే దృష్టి పెట్టమని చెప్పాను. సెమీఫైనల్లో ఆమె విజయం సాధిస్తుందని నమ్మకంతో ఉన్నాం. పతకంతో తిరిగొస్తుందన్న విశ్వాసంతో ఉన్నామ'ని రమణ అన్నారు.
తమ కుమార్తె సెమీస్ చేరడం సంతోషంగా ఉందని సింధు తల్లి విజయ అన్నారు. తాను ఆడిన మొదటి ఒలింపిక్స్ లోనే సింధు సెమీఫైనల్ చేరడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. రేపు జరగనున్న సెమీఫైనల్లో జపాన్ క్రీడాకారిణి నజోమి ఒకుహరాతో తలపడనుంది. అయితే ఒకుహరా కేడా మంచి ప్లేయర్ అని, ఆమెతో మ్యాచ్ అంత ఈజీ కాదని రమణ పేర్కొన్నారు. రేపు ఎవరు బాగా ఆడతారనే దానిపై విజయావకాశాలు ఆధారపడివుంటాయని చెప్పారు.