అపూర్వ విజయం | R Ashwin grabbed five wickets as India beat South Africa by 337 runs in Delhi to take the series | Sakshi
Sakshi News home page

అపూర్వ విజయం

Published Tue, Dec 8 2015 2:23 AM | Last Updated on Sun, Sep 3 2017 1:38 PM

అపూర్వ విజయం

అపూర్వ విజయం

ఢిల్లీ టెస్టులో భారత ఘన విజయం ఈ సిరీస్‌లో తలెత్తిన ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఎన్నో విమర్శలకు కూడా ఈ టెస్టు విజయం జవాబు. కేవలం పిచ్‌ల కారణంగానే భారత జట్టు సిరీస్ గెలిచిందనే అపవాదును ఢిల్లీ టెస్టులో విజయం ద్వారా కోహ్లి సేన తుడిచి పెట్టింది. బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో దక్షిణాఫ్రికా విసిరిన అనేక సవాళ్లను అధిగమించిన టీమిండియా... ఈ విజయం ద్వారా ‘క్లీన్ ఇమేజ్’ను సొంతం చేసుకోవడంతో పాటు ‘ఫ్రీడమ్ ట్రోఫీ’ని సగర్వంగా దక్కించుకుంది.
 
సాక్షి క్రీడావిభాగం: ఢిల్లీ టెస్టు ఆరంభానికి ముందు రోజు భారత కెప్టెన్‌లో, డెరైక్టర్‌లో తీవ్ర అసహనం ఉంది. విదేశీ మీడియా సంగతి పక్కన బెడితే... భారత మీడియా కూడా పది ప్రశ్నల్లో ఆరు పిచ్‌ల స్వభావం గురించే అడిగింది. దీంతో ఒక దశలో పరోక్షంగా ఐసీసీని కూడా విమర్శించేలా కోహ్లిలో అసహనం పెరిగింది. నిజానికి భారత క్రికెటర్ల ప్రదర్శన గురించి ఎక్కడా చర్చ జరగలేదు.

ఢిల్లీ టెస్టుకు ముందు ఎవరూ భారత బ్యాట్స్‌మెన్ గురించి మాట్లాడలేదు. వీటన్నింటికీ ఒకే ఒక్క మ్యాచ్ ద్వారా సమాధానం చెప్పినట్లయింది. అందుకే మ్యాచ్ ముగిశాక విరాట్ తనదైన శైలిలో మీడియాపై సెటైర్లు వేశాడు.
 
ఊహించని పిచ్
భారత్‌లో ఎప్పుడు టెస్టు మ్యాచ్ ఆడినా చివరి రెండు రోజులూ స్పిన్నర్లు తీవ్రంగా ప్రభావం చూపుతారు. అది ఇక్కడి పిచ్‌ల సహజ స్వభావం. ఢిల్లీ కూడా దీనికి అతీతం కాదు. కానీ అదేంటో ఈసారి స్వభావ విరుద్ధంగా ఢిల్లీ పిచ్ బౌలర్లను ఏడిపించింది. తొలి రెండు రోజులూ వికెట్లు పడకుండా... తర్వాతి మూడు రోజులు వికెట్లు పడే సంప్రదాయానికి పూర్తి విరుద్ధంగా ఆట సాగింది.

నాగ్‌పూర్ పిచ్ విషయంలో ఐసీసీ నుంచి నోటీసు అందుకున్న బీసీసీఐకి కూడా ఇది పెద్ద ఊరట. ఈ మ్యాచ్‌కు పెద్ద మలుపు రెండో రోజు ఆట. ఆ రోజు టీ  తర్వాత దక్షిణాఫ్రికా తొమ్మిది వికెట్లు కోల్పోయి 121 పరుగులకే ఆలౌట్ కావడంతో ఈ మ్యాచ్ మీద భారత్‌కు పట్టు దొరికింది.
 
ఎవరి బాధ్యత వాళ్లు...
ఈ మ్యాచ్‌లో ఒకరిద్దరు మినహా భారత ఆటగాళ్లంతా తమ పాత్రను సమర్థంగా పోషించారు. మురళీ విజయ్ నిరాశపరిచినా... ధావన్ ఫర్వాలేదనిపించాడు. ఇక రహానే రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ జట్టుకు వెన్నెముకలా నిలబడ్డాడు. కోహ్లి కూడా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఆకట్టుకున్నాడు. భారత బౌలర్లు కూడా సమష్టిగా రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో జడేజా ఐదు వికెట్లు తీస్తే... అశ్విన్, ఉమేశ్ రెండేసి వికెట్లతో ఆకట్టుకున్నారు.
 
కాస్త ఆలస్యం చేశారేమో!
ఈ సిరీస్‌లో దక్షిణాఫ్రికా 200 మార్కు చేరడానికే ఆపసోపాలు పడుతూ సాగింది. అలాంటి స్థితిలో 481 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ నిర్దేశించింది. దీనికోసం నాలుగో రోజు లంచ్ విరామం వరకూ ఆడారు. దీంతో దక్షిణాఫ్రికాను ఆలౌట్ చేయడానికి కేవలం ఐదు సెషన్లే అందుబాటులోకి వచ్చాయి. అయితే చివరి రెండు రోజులు స్పిన్నర్లు తీవ్ర ప్రభావం చూపుతారనేది అంచనా.

కానీ పిచ్ నుంచి బౌలర్లకు ఎలాంటి సహకారం లభించలేదు. ఒకవేళ లక్ష్యం 300-350 ఉండి ఉంటే దక్షిణాఫ్రికా మరో విధంగా ఆడేది. సిరీస్‌లో కనీసం ఒక్క మ్యాచ్ అయినా గెలవాలనే పట్టుదల చూపించేది. ఎప్పుడైతే 481 పరుగులు కనిపించాయో... అప్పుడే ఇక ‘డ్రా’ తప్ప మరో మార్గం లేదని అర్థమై... పూర్తిగా డిఫెన్స్ ఆడారు. దీంతో భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం కాస్త ఆలస్యమైందేమో అనిపించింది.

హైడ్రామాలా ముగింపు
ఆఖరి రోజు టీ విరామం వరకు కూడా భారత్ గెలుస్తుందనే ఆశ అభిమానుల్లో లేదు. డివిలియర్స్ ఆడుతున్న తీరు చూస్తే ఇక మ్యాచ్ ‘డ్రా’ కావడం ఖాయమనే భావనలోనే అందరూ ఉన్నారు. కానీ అనూహ్యంగా టీ విరామం తర్వాత పరిస్థితి మారింది. ఉమేశ్ యాదవ్ సంచలన బౌలింగ్‌కు, అశ్విన్ నిలకడ తోడు కావడంతో కేవలం 5.1 ఓవర్లలోనే ఐదు వికెట్లు పడ్డాయి. ఇది ఒకరకంగా దక్షిణాఫ్రికాకు షాక్‌లాంటిదే.
 
సొంతగడ్డపై తొలి సిరీస్
భారత కెప్టెన్ కోహ్లికి సొంతగడ్డపై ఇదే తొలి సిరీస్ విజయం. కాబట్టి ఇది తనకు చాలా ప్రత్యేకం. ముఖ్యంగా తన సొంత నగరం ఢిల్లీలో ‘ఫ్రీడమ్ ట్రోఫీ’ని అందుకోవడం తన జీవితంలో మరచిపోలేని జ్ఞాపకంగా మిగులుతుంది. ఈ టెస్టుకు ముందు కోహ్లిలో అసహనానికి కారణం కూడా అదే. తన సారథ్యంలో వచ్చిన విజయాలకు ఆట పరంగా గుర్తింపు రావడం లేదనే ఆక్రోశం కూడా కనిపించింది. ఇక ఇప్పుడవన్నీ చరిత్ర.
 
ఈ సిరీస్ ద్వారా భవిష్యత్‌లో టెస్టుల్లోనూ భారత్‌కు ఢోకా లేదనే సందేశం కోహ్లి అండ్ కో ఇచ్చారు. ఉపఖండం బయట ఎలా ఉన్నా... స్వదేశంలో మన ప్రాభవం కాపాడగలరనే నమ్మకాన్ని ఇచ్చారు.
 
రెండో ర్యాంకుకు భారత్
దుబాయ్: దక్షిణాఫ్రికాపై సాధించిన సిరీస్‌విజయంతో అంతర్జాతీయ టెస్టు చాంపియన్‌షిప్ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు ఏకంగా రెండో స్థానానికి ఎగబాకింది. ఇప్పటిదాకా 100 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్న కోహ్లి సేన 3-0 విజయంతో ఒక్కసారిగా 10 పాయింట్లు అదనంగా దక్కించుకుని ఆసీస్, పాక్ జట్లను వెనక్కితోసింది. దక్షిణాఫ్రికా (114) ఇప్పటికీ టాప్‌లోనే ఉన్నా కేవలం నాలుగు పాయింట్లు మాత్రమే భారత్‌కన్నా ముందుంది.
 
ఈ విజయం ‘చెన్నై’కి అంకితం
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాపై 3-0తో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు తమ ఘనవిజయాన్ని చెన్నై వరద బాధితులకు అంకితమిస్తున్నట్టు ప్రకటించింది. ఇటీవలి వరదలకు అక్కడ వందలాది మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ‘మేం సాధించిన ఈ విజయాన్ని చెన్నై వరదల్లో తీవ్రంగా నష్టపోయినవారికి అంకితమిస్తున్నాం.

గత కొన్ని వారాలుగా అక్కడ చాలా బాధాకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. మా జట్టులోని అశ్విన్, విజయ్ కుటుంబసభ్యులు కూడా వరదల్లో చిక్కుకున్న వారే. ఇలాంటి స్థితిలోనూ వారు మెరుగైన ప్రదర్శన చేశారు. ఈ సిరీస్ విజయం చెన్నై ప్రజల్లో కాస్త సంతోషాన్ని నింపుతుందని ఆశిస్తున్నాను’ అని కోహ్లి తెలిపారు.
 
పరుగులపరంగా (337) భారత్‌కు ఇదే అతి పెద్ద విజయం

బాపూ నాదకర్ణి (21) తర్వాత వరుసగా అత్యధిక మెయిడిన్లు వేసిన (17) బౌలర్ జడేజా
 
అశ్విన్ కెరీర్‌లో ఇది ఐదో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు. భారత్ తరఫున ఇదే అత్యధికం.  సచిన్ 74 సిరీస్‌లలో, సెహ్వాగ్ 38 సిరీస్‌లలో దీనిని సాధిస్తే అశ్విన్ 12 సిరీస్‌లలో ఈ ఘనత దక్కించుకున్నాడు.
 
కనీసం 200 పరుగులు ఎదుర్కొన్నప్పుడు అతి నెమ్మదైన భాగస్వామ్యం ఆమ్లా, డివిలియర్స్‌లదే (42.1 ఓవర్లలో 27 పరుగులు). వ్యక్తిగతంగా కూడా ఆమ్లా అత్యల్ప స్టైక్‌రేట్ (10.24) కొత్త రికార్డు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement