జొకోవిచ్ జల్సా... | Rafael Nadal and Novak Djokovic ease into French Open last 16 | Sakshi
Sakshi News home page

జొకోవిచ్ జల్సా...

Published Sun, May 31 2015 12:18 AM | Last Updated on Sun, Sep 3 2017 2:57 AM

జొకోవిచ్ జల్సా...

జొకోవిచ్ జల్సా...

అలవోక విజయంతో క్వార్టర్ ఫైనల్లోకి
నాదల్, ముర్రే జోరు   
సిలిచ్, ఫెరర్ ముందంజ   
ఫ్రెంచ్ ఓపెన్

 
పారిస్ : ఈ సీజన్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ జోరు మీదున్నాడు. తొలి రెండు రౌండ్‌ల మాదిరిగానే... మూడో రౌండ్‌లోనూ ఈ టాప్ సీడ్ ప్లేయర్‌కు ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాలేదు. ఫలితంగా వరుసగా మూడో విజయంతో ఈ సెర్బియా స్టార్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్‌లో జొకోవిచ్ 6-4, 6-4, 6-4తో ఆస్ట్రేలియా రైజింగ్ స్టార్, 19 ఏళ్ల థనాసి కొకినాకిస్‌ను ఓడించాడు. గంటా 49 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయకపోవడం విశేషం.

నాలుగు ఏస్‌లు సంధించిన అతను ప్రతి సెట్‌లో ఒక్కోసారి కొకినాకిస్ సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. ఈ సీజన్‌లో జొకోవిచ్‌కిది వరుసగా 30వ విజయం కావడం విశేషం. గత ఫిబ్రవరిలో దుబాయ్ ఓపెన్ ఫైనల్లో ఫెడరర్ చేతిలో ఓడిపోయాక జొకోవిచ్ వరుసగా ఇండియన్ వెల్స్, మియామి, మోంటెకార్లో, రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీల్లో విజేతగా నిలిచాడు. ఇప్పటికే ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ టైటిల్స్ సాధించిన ఈ సెర్బియా యోధుడు ఫ్రెంచ్ ఓపెన్ కూడా సాధిస్తే కెరీర్ గ్రాండ్‌స్లామ్ ఘనతను పూర్తి చేసుకుంటాడు.

మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), మూడో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్), ఏడో సీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెయిన్), తొమ్మిదో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. ఆరో సీడ్ నాదల్ 6-1, 6-3, 6-2తో ఆండ్రీ కుజ్‌నెత్సోవ్ (రష్యా)ను చిత్తు చేయగా... ముర్రే 6-4, 6-2, 6-3తో నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా)పై గెలిచాడు. ఫెరర్ 6-3, 1-6, 5-7, 6-0, 6-1తో సిమోన్ బొలెలీ (ఇటలీ)పై చెమటోడ్చి నెగ్గగా... సిలిచ్ 6-3, 6-2, 6-4తో మాయెర్ (అర్జెంటీనా)ను ఓడించాడు.

ఇతర మ్యాచ్‌ల్లో 20వ సీడ్ రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్) 4-6, 7-6 (7/4), 7-5, 6-4తో 15వ సీడ్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)పై, జెరెమి చార్డీ (ఫ్రాన్స్) 6-3, 6-4, 6-2తో 17వ సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం)పై, జాక్ సాక్ (అమెరికా) 6-2, 6-1, 6-4తో కోరిచ్ (క్రొయేషియా)పై విజయం సాధించారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో గాస్కేతో జొకోవిచ్; జాక్ సాక్‌తో నాదల్; చార్డీతో ముర్రే; సిలిచ్‌తో ఫెరర్ తలపడతారు.

 పెట్కోవిచ్‌కు షాక్
 మహిళల సింగిల్స్ విభాగంలో పదో సీడ్ పెట్కోవిచ్ (జర్మనీ) మూడో రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టగా... నాలుగో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మూడో రౌండ్‌లో 17వ సీడ్ సారా ఎరాని (ఇటలీ) 6-3, 6-3తో పెట్కోవిచ్‌ను ఓడించింది. క్విటోవా 6-3, 6-2తో ఇరీనా బెగూ (రుమేనియా)పై నెగ్గింది. వింబుల్డన్ టోర్నీలో కాకుండా మరో గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్విటోవా 2012 తర్వాత తొలిసారి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరడం విశేషం. ఇతర మ్యాచ్‌ల్లో బాక్‌సిన్జ్‌కీ (స్విట్జర్లాండ్) 6-4, 6-2తో 16వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా)పై సంచలన విజయం సాధించగా... స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా) 6-4, 6-1తో పిరన్‌కోవా (బల్గేరియా)పై గెలిచింది. అన్‌సీడెడ్ క్రీడాకారిణులు ఆండ్రియ మితూ (రుమేనియా), జూలియా జార్జెస్ (జర్మనీ), ఉట్వాంక్ (బెల్జియం) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు.

 పేస్-హింగిస్ జంట ఓటమి
 మిక్స్‌డ్ డబుల్స్‌లో లియాండర్ పేస్ (భారత్)-హింగిస్ (స్విట్జర్లాండ్) జంట రెండో రౌండ్‌లో ఓడింది. పేస్-హింగిస్ ద్వయం 7-6 (8/6), 3-6, 6-10తో సెబ్రోత్నిక్ (స్లొవేనియా)-టెకావ్ (రుమేనియా) జంట చేతిలో పరాజయం పాలైంది.
 
 మధ్యాహ్నం గం. 2.30 నుంచి నియో ప్రైమ్‌లో ప్రత్యక్ష ప్రసారం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement