
నాదల్ కు డబుల్స్ గోల్డ్
రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్లో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ స్వర్ణాన్ని సాధించాడు. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్ పోరులో నాదల్-మార్క్ లోపెజ్ జోడి 6-2, 3-6, 6-4 తేడాతో ఫ్లోరిన్ మెర్జియా-హోరియా టెకూ(రొమేనియా)పై గెలిచి పసిడిని కైవసం చేసుకుంది. తొలి సెట్ను అవలీలగా గెలిచి మంచి ఊపుమీద కనిపించిన నాదల్ ద్వయం.. ఆ తరువాత రెండో సెట్ను చేజార్చుకుంది. అయితే నిర్ణయాత్మక మూడో సెట్లో నాదల్ జంట తిరిగి పుంజుకుని రొమేనియా జోడిని చిత్తుచేసింది. ఈ సెట్ల్ అత్యంత నిలకడగా ఆడిన ఈ స్పెయిన్ జంట అనవసర తప్పిదాలకు ఎక్కువ ఆస్కారం ఇవ్వకుండా స్వర్ణాన్ని తమ ఖాతాలో వేసుకుంది.
మరోవైపు పురుషుల సింగిల్స్ మ్యాచ్ లో కూడా నాదల్ సెమీస్ కు చేరి పతకానికి చేరువగా వచ్చాడు. క్వార్టర్ ఫైనల్ పోరులో నాదల్ 2-6, 6-4, 6-2 తేడాతో థామస్ బెల్లుక్కి(బ్రెజిల్)పై విజయం సాధించి సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఈ మ్యాచ్ లో తొలి సెట్ ను చేజార్చుకుని వెనుకబడిన నాదల్ పూర్వపు ఫామ్ను అందిపుచ్చుకుని వరుస రెండు సెట్లను కైవసం చేసుకున్నాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో నాదల్ సింగిల్స్, డబుల్స్లో స్వర్ణ పతకాలను సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఘనతను సాధించిన నాల్గో ఆటగాడిగా నిలిచాడు.
2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో తొలిసారి చాంపియన్‌గా నిలిచిన నాదల్.. 2012 లండన్ ఒలింపిక్స్‌కు మాత్రం గాయంతో దూరమయ్యాడు. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ నుంచి మధ్యలో వైదొలిగిన నాదల్.. ఆ తరువాత జరిగిన వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ లో కూడా పాల్గొనలేదు. గత కొంతకాలంగా మణికట్టు గాయం బాధిస్తుండటంతో ఈ రెండు ప్రధాన టోర్నీలకు దూరమయ్యాడు. గత లండన్ ఒలింపిక్స్ లో గాయం కారణంగా పాల్గొనలేకపోయిన నాదల్..రియోలో మాత్రం అంచనాలను అందుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు.