మాడ్రిడ్ ‘మాస్టర్’ నాదల్
కెరీర్‌లో 30వ మాస్టర్స్ సిరీస్ టైటిల్ నెగ్గిన స్పెయిన్ స్టార్
మాడ్రిడ్ (స్పెయిన్): ఈ సీజన్‌లో క్లే కోర్టులపై ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ తన ఖాతాలో మూడో టైటిల్‌ను జమ చేసుకున్నాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన మాడ్రిడ్ మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్‌లో నాదల్ విజేతగా నిలిచాడు.
2 గంటల 17 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో నాలుగో సీడ్ నాదల్ 7–6 (10/8), 6–4తో ఎనిమిదో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)పై విజయం సాధించాడు. ఈ గెలుపుతో నాదల్ అత్యధికంగా 30 మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుడిగా నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. ఈ జాబితాలో ఫెడరర్ (26 టైటిల్స్), అగస్సీ (17 టైటిల్స్), ఆండీ ముర్రే (14 టైటిల్స్), పీట్ సంప్రాస్ (11 టైటిల్స్) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
మాడ్రిడ్ ఓపెన్ చరిత్రలో చాంపియన్‌గా నిలువడం నాదల్‌కిది ఐదోసారి. టైటిల్ నెగ్గిన నాదల్‌కు 10,43,680 యూరోల ప్రైజ్‌మనీ (రూ. 7 కోట్ల 34 లక్షలు)తోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ప్రస్తుత క్లే కోర్టు సీజన్‌లో నాదల్ ఆడిన 15 మ్యాచ్‌ల్లోనూ గెలుపొందాడు. తాను ఆడిన 32 సెట్‌లలో కేవలం రెండింటిని మాత్రమే ప్రత్యర్థులకు కోల్పోయాడు. ఈ టోర్నీకి ముందు నాదల్ మోంటెకార్లో, బార్సిలోనా ఓపెన్ టైటిల్స్ సాధించాడు.