లెక్క సరిచేసిన భారత్
ముంబై: మొదటి ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఓడిన భారత జట్టు.. రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి లెక్క సరిచేసింది. గురువారం ముంబైలో ఇంగ్లండ్ ఎలెవన్‌తో తలపడ్డ భారత 'ఎ' కుర్రాళ్లు సత్తా చాటారు. ఇంగ్లండ్ విసిరిన 282 పరుగుల లక్ష్యాన్ని కేవలం 39.4 ఓవర్లలో చేదించి తిరుగులేని విజయాన్ని నమోదు చేశారు. కెప్టెన్ రహానేతో పాటు.. సురేష్ రైనా, కొత్త కుర్రాడు రిషబ్ పంత్ రాణించారు.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టు ఆటగాళ్లలో బెయిర్‌స్టో(64 పరుగులు), హెల్స్(51)తో పాటు స్టోక్స్(38 పరుగులు), రషీద్(39 పరుగులు) రాణించారు. భారత బౌలర్లలో పర్వేజ్ రసూల్‌కు 3 వికెట్లు దక్కగా.. సాంగ్వన్, దిండా, నదిమ్‌లు రెండేసి వికెట్లతో చెలరేగారు. దీంతో ఇంగ్లండ్ 48.5 ఓవర్లలో 282 పరుగులకు ఆలౌట్ అయింది.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత ఎ జట్టు.. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కున్నారు. రహానే 91 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. జాక్సన్(56 బంతుల్లో 59 పరుగులు), రిషబ్ పంత్(36 బంతుల్లో 59 పరుగులు), రైనా(45 పరుగులు) రాణించారు. దీంతో మరో పది ఓవర్లు మిగిలి ఉండగానే భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో.. రంజీ ట్రోఫీలో భీకర ప్రదర్శనతో భారత టి20 టీమ్‌లోకి ఎంపికైన పంత్ తనదైన శైలిలో దూకుడు ప్రదర్శించాడు.