
చాంగ్‌వొన్ (దక్షిణ కొరియా): ప్రపంచకప్ షూటింగ్‌లో రెండో రోజూ భారత షూటర్లకు నిరాశే ఎదురైంది. రాహీ సర్నోబాత్ పతకం గెలిచే అవకాశాన్ని త్రుటిలో కోల్పోయింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో ఆమె నాలుగో స్థానంలో నిలిచింది. క్వాలిఫయింగ్‌లో 600 పాయింట్లకుగాను రికార్డు స్థాయిలో 588 పాయింట్లు సాధించిన ఆమె... 8 మంది పోటీపడిన ఫైనల్లో మాత్రం నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. మిగతా భారత షూటర్లలో హీనా సిద్ధు 37వ, అనురాజ్ సింగ్ 41వ స్థానంలో నిలిచారు.
10 మీటర్ల ఎయిర్‌రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో రవికుమార్–అపూర్వీ చండీలా జోడీ ఐదో స్థానం పొందింది. ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయిన దీపక్ కుమార్–మెహులీ ఘోష్ జంట ఎనిమిదో స్థానంలో నిలిచింది. మహిళల ట్రాప్ ఈవెంట్‌లో షగున్ చౌదరి 26వ, శ్రేయసి సింగ్ 33వ స్థానాల్లో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment