rahi sarnobath
-
Rahi Sarnobat: రాహీ పసిడి గురి
ఒసిజెక్ (క్రొయేషియా): ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్‌కు తొలి పసిడి పతకం లభించింది. సోమవారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో రాహీ సర్నోబత్ బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన 30 ఏళ్ల రాహీ ఎనిమిది మంది పాల్గొన్న ఫైనల్లో 39 పాయింట్లు స్కోరు చేసింది. లామోలి మథిల్డె (ఫ్రాన్స్–31 పాయింట్లు) రజతం, వితాలినా (రష్యా–28 పాయింట్లు) కాంస్యం సాధించారు. ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో భారత్‌కే చెందిన మరో షూటర్ మనూ భాకర్ 11 పాయింట్లు స్కోరు చేసి ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. 49 మంది షూటర్లు పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో రాహీ 591 పాయింట్లు... మనూ 588 పాయింట్లు స్కోరు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు. మరోవైపు మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో భారత షూటర్ తేజస్విని సావంత్ క్వాలిఫయింగ్‌లో పదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత పొందలేకపోయింది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో ఇప్పటి వరకు భారత్ స్వర్ణం, రజతం, రెండు కాంస్యాలతో కలిపి మొత్తం నాలుగు పతకాలు గెల్చుకుంది. -
భారత మహిళల పిస్టల్ జట్టుకు కాంస్యం
ఒసిజెక్ (క్రొయేషియా): ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్‌కు రెండో కాంస్య పతకం లభించింది. శుక్రవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో మనూ భాకర్, రాహీ సర్నోబత్, యశస్విని సింగ్‌లతో కూడిన భారత బృందం మూడో స్థానంలో నిలిచింది. కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో మనూ, రాహీ, యశస్విని త్రయం 16–12 పాయింట్ల తేడాతో వెరోనికా, మిరియమ్ జాకో, సారా రాహెల్‌లతో కూడిన హంగేరి జట్టును ఓడించింది. అంతకుముందు జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ కాంస్య పతక పోరులో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, దీపక్ కుమార్, దివ్యాంశ్ సింగ్ పన్వర్‌లతో కూడిన భారత జట్టు 14–16తో మిలెంకో, స్టెఫనోవిచ్, లాజార్‌లతో కూడిన సెర్బియా జట్టు చేతిలో ఓడిపోయింది. పురుషుల స్కీట్ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ గుర్జత్ ఖంగురా క్వాలిఫయింగ్‌లో 115 పాయింట్లు స్కోరు చేసి 56వ స్థానంలో నిలిచాడు. శనివారం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్స్ జరగనున్నాయి. ఈ రెండు విభాగాల్లో భారత్‌కు పతకాలు వచ్చే అవకాశముంది. గురువారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ సౌరభ్ కాంస్య పతకం గెలిచిన సంగతి తెలిసిందే. మనూ, రాహీ, యశస్విని -
‘టీమ్’ ఈవెంట్లలో మరో 2 పతకాలు
న్యూఢిల్లీ: ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో ఏడో రోజు గురువారం భారత్‌కు మరో రెండు పతకాలు లభించాయి. మహిళల 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో చింకీ యాదవ్, రాహీ సర్నోబత్, మనూ భాకర్‌లతో కూడిన భారత జట్టు 17–7తో వార్జోనొస్కా, జులిటా బోరెక్, అగ్నీస్కా కొరెజ్వోలతో కూడిన పోలండ్ జట్టుపై గెలిచింది. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ టీమ్ విభాగంలో అంజుమ్ మౌద్గిల్, శ్రేయ సక్సేనా, గాయత్రి నిత్యానందమ్లతో కూడిన భారత జట్టు ఫైనల్లో 43–47తో అనెటా స్టాన్కివిచ్, అలెక్సాండ్రా, నటాలియా కొచనస్కాలతో కూడిన పోలండ్ చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. ప్రస్తుతం భారత్ 10 స్వర్ణాలు, 6 రజతాలు, 5 కాంస్యాలు సహా మొత్తం 21 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ‘మావాడితో కలిసి ఆడం’ ప్రత్యర్థి ఆటగాళ్లపైనో, వారి నిబంధనల ఉల్లంఘనపైనో మరో జట్టు ఆటగాళ్లు ఫిర్యాదులు చేయడం, పరిష్కారానికి నిర్వహకులు జోక్యం చేసుకోవడం చాలా టోర్నీలలో సహజంగా కనిపించే విషయం. అయితే అందుకు భిన్నంగా తమ జట్టు సహచరుడిపైనే మరొకరు ఫిర్యాదు చేసి అతనితో కలిసి బరిలోకి దిగేందుకు నిరాకరించడం విశేషం. మరికొద్ది నిమిషాల్లో పోటీ అనగా... హంగేరీ షూటర్లు ఇస్తవాన్ పెని, జవన్ పెక్లర్ తమ తోటి షూటర్ పీటర్ సిడీ నిబంధనలకు విరుద్ధంగా ‘బైపాడ్’ అతికిచ్చి ఉన్న రైఫిల్‌తో పోటీలో పాల్గొంటున్నాడని ఆరోపిస్తూ తాము ఫైనల్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. దీనిపై స్పందించిన ఐఎస్ఎస్ఎఫ్ అధికారులు మాత్రం అతను నిబంధనలను అతిక్రమించలేదని స్పష్టం చేశారు. అంతే కాకుండా రూల్స్ విషయంలో తమకు హంగేరీ ప్లేయర్లు చెప్పాల్సిన అవసరం కూడా లేదంటూ ఘాటుగా స్పందించారు. అయితే నిబంధనలకంటే ఆటగాళ్ల మధ్య ఉన్న వ్యక్తిగత విభేదాలే దీనికి కారణమని తెలుస్తోంది. సిడీ 2000నుంచి వరుసగా 5 ఒలింపిక్స్‌లో పాల్గొనగా, ఇస్తవాన్ పెని ప్రస్తుతం వరల్డ్ నంబర్‌వన్‌గా ఉన్నా డు. తాజా వివాదంతో భారత్‌తో ఫైనల్లో పోటీ పడేందుకు అమెరికా అర్హత సాధించగా...ఫైనల్‌ను నేటికి వాయిదా వేశారు. -
పిస్టల్‌లో క్లీన్‌స్వీప్
న్యూఢిల్లీ: సొంతగడ్డపై ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. టోర్నీ ఆరో రోజు బుధవారం భారత్‌కు నాలుగు పతకాలు లభించాయి. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్లు అందుబాటులో ఉన్న మూడు పతకాలను నెగ్గి క్లీన్‌స్వీప్ చేశారు. ఈ ఫైనల్లో చింకీ యాదవ్‌కు స్వర్ణం దక్కగా... రాహీ సర్నోబత్ రజతం, మనూ భాకర్ కాంస్య పతకం కైవసం చేసుకున్నారు. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో మనూ 28 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. చింకీ యాదవ్, రాహీ 32 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచారు. దాంతో విజేతను నిర్ణయించేందుకు షూట్ ఆఫ్ నిర్వహిం చగా... చింకీ యాదవ్ 4 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణాన్ని ఖాయం చేసుకుంది. 3 పాయింట్లు స్కోరు చేసిన రాహీకి రజతం దక్కింది. ప్రపంచకప్ షూటింగ్ టోర్నీ చరిత్రలో ఒకే ఈవెంట్లో ముగ్గురు భారత షూటర్లు క్లీన్‌స్వీప్ చేయడం ఇదే ప్రథమం. ఇప్పటికే ఈ ముగ్గురు భారత మహిళా షూటర్లు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. ప్రతాప్ సింగ్ ఘనత మరోవైపు పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ విభాగంలో భారత యువ షూటర్ ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ స్వర్ణ పతకాన్ని సాధించి సంచలనం సృష్టించాడు. ప్రపంచకప్ షూటింగ్ టోర్నీ రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో భారత్ తరఫున పసిడి పతకం గెలిచిన పిన్న వయస్కుడిగా ప్రతాప్ సింగ్ ఘనత వహించాడు. 20 ఏళ్ల ప్రతాప్ సింగ్ 462.5 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. ప్రపంచ నంబర్‌వన్ ఇస్తవన్ పెనీ (హంగేరి–461.6 పాయింట్లు) రజతంతో సరిపెట్టుకోగా... స్టీఫెన్ ఒల్సెన్ (డెన్మార్క్–450.9 పాయింట్లు) కాంస్యం గెలిచాడు. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ క్వాలిఫయింగ్‌లో భారత షూటర్లు తేజస్విని సావంత్ 12వ స్థానంలో, అంజుమ్ మౌద్గిల్ 16వ స్థానంలో, సునిధి చౌహాన్ 17వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత పొందలేకపోయారు. ఆరో రోజు పోటీలు ముగిశాక భారత్ 9 స్వర్ణాలు, 5 రజతాలు, 5 కాంస్యాలతో కలిపి మొత్తం 19 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. -
సౌరభ్, రాహీ డబుల్ ధమాకా
మ్యూనిక్ (జర్మనీ): భారత షూటర్లు మళ్లీ బంగారు గురితో భళా అనిపించారు. అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో రెండో రోజు భారత్‌కు సౌరభ్ చౌధరీ, రాహీ సర్నోబత్ రెండు స్వర్ణాలను అందించారు. ఈ క్రమంలో సౌరభ్ చౌధరీ రెండు కొత్త ప్రపంచ రికార్డులు నెలకొల్పగా... రాహీ ఒలింపిక్ బెర్త్‌ను అందించింది. ఇప్పటివరకు భారత షూటర్లు ఆరు విభాగాల్లో ఒలింపిక్ బెర్త్‌లను సాధించడం విశేషం. సోమవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో సౌరభ్ చౌధరీ 246.3 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణం దక్కించుకున్నాడు. దాంతో 245 పాయింట్లతో తన పేరిటే ఉన్న సీనియర్ ప్రపంచ రికార్డును... 245.5 పాయింట్లతో ఉన్న జూనియర్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. భారత్‌కే చెందిన షాజర్ రిజ్వీ 177.6 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. క్వాలిఫయింగ్‌లో సౌరభ్ 586 పాయింట్లు, షాజర్ రిజ్వీ 583 పాయింట్లు సాధించి వరుసగా రెండు, ఐదు స్థానాల్లో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు. మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో ఆసియా క్రీడల చాంపియన్ రాహీ సర్నోబత్ 37 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. భారత్‌కే చెందిన మను భాకర్ 21 పాయింట్లతో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. క్వాలిఫయింగ్‌లో రాహీ 586 పాయింట్లు, మను 585 పాయింట్లు సాధించి నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచి ఫైనల్‌కు చేరారు. -
భరతమాత బంగారుబిడ్డ... ఆమె!
పదహారేళ్లకు పిస్టల్ పట్టుకుంది. పదిహేడేళ్లకు కామన్వెల్త్లో బంగారు పతకం అందుకుంది. తర్వాత వరుసగా ఐదు బంగారు పతకాలకు ‘తలవంచింది’. ఇప్పుడు ఆరో బంగారు పతకం ఆమె కోసం దిగి వచ్చింది. భరతమాత బంగారుబిడ్డ... రాహీ జీవన్ సర్నోబాత్ ఆమె! 2018, ఆగస్టు 22, బుధవారం. రాహి జీవితంలో మరొక మైలు రాయి! ఓ పాతికేళ్ల తర్వాత ఆమె కనుక ఆటోబయోగ్రఫీ రాసుకుంటే అందులో... అత్యంత ప్రధానమైన సంఘటనల్లో ఇదొకటి అవుతుంది. ఇండోనేసియాలో జరుగుతున్న 18వ ఏషియన్ గేమ్స్‌లో రాహి రికార్డు సాధించిన రోజది. ఈ రికార్డు రాహికి మాత్రమే మైలురాయి కాదు, ఇండియాకి కూడా. నిజమే... ఏషియన్ గేమ్స్‌లో షూటింగ్ విభాగంలో బంగారు పతకం అందుకున్న తొలి భారతీయ మహిళ రాహీ జీవన్ సర్నోబాత్. అంతకు ముందు రోజే పది మీటర్ల పురుషుల షూటింగ్ విభాగంలో సౌరభ్ చౌదురి స్వర్ణాన్ని అందుకున్నాడు. అది ఏషియన్ గేమ్స్ షూటింగ్ విభాగంలో ఇండియాకి అందిన తొలి స్వర్ణం. రాహి రెండవ స్వర్ణం సాధించిన ఇండియన్‌గా నిలిచారు. ఏషియన్ గేమ్స్ నిర్వహణలో మహిళల షూటింగ్ పోటీలు మగవాళ్ల షూటింగ్ పోటీలకంటే ముందు జరిగి ఉంటే ఆ రికార్డు కూడా రాహి ఖాతాలోనే పడేది. రాహి సొంతూరు మహారాష్ట్రలోని కొల్హాపూర్. సాధారణ కుటుంబం. తండ్రి జీవన్ సర్నోబాత్. ‘‘ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా కూతురిని స్పోర్ట్స్ స్టార్ చేయడం తలకు మించిన పని అనే చెప్పాలి. రాహి ఏది కోరితే అది చేయడమే వాళ్ల నాన్నకిష్టం. అందుకే ఎంత ఖర్చయినా వెనుకాడలేదు. రాహికి చిన్నప్పుడు షూటర్ కావాలనే కోరిక ఉండేది కాదు. ఉషారాజె హైస్కూల్లో స్కూల్ ఫైనల్‌కి వచ్చేటప్పటికి తేజస్విని సావంత్ రైఫిల్ షూటింగ్లో మెడల్ అందుకుంది. ఆమె కూడా మహారాష్ట్ర అమ్మాయే. తేజస్విని మెడల్ అందుకోవడం చూసినప్పటి నుంచి తనకు కూడా షూటర్ కావాలనే కోరిక కలిగింది’’ అని గుర్తు చేసుకుంటారు రాహి తల్లి ప్రభా సర్నోబాత్. పదేళ్ల కిందటే స్వర్ణం ఈ ఏషియాడ్‌లో భారత్‌కు స్వర్ణాన్ని సాధించడంతో ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షించింది రాహి. కానీ షూటర్‌గా ఆమె విజయ పరంపర 2008లోనే మొదలైంది. ‘2008 కామన్వెల్త్’ యూత్ గేమ్స్ 25 మీటర్ల విభాగంలో తొలి స్వర్ణాన్ని సాధించింది. అప్పటికి ఆమె ప్రాక్టీస్ ప్రారంభించి ఒక్క ఏడాది మాత్రమే. తేజస్విని సావంత్ 2006 కామన్వెల్త్ గేమ్స్, 50 మీటర్ల రైఫిల్ షూటింగ్ విభాగంలో విజయం సాధించడాన్ని చూసిన తర్వాత తానూ షూటింగ్ నేర్చుకుంటానని ప్రాక్టీస్ మొదలుపెట్టింది. అలా పదహారేళ్ల వయసులో పిస్టల్ పట్టుకుంది రాహి. ఆ తర్వాత రెండేళ్లకే తొలి విజయాన్ని సాధించింది. ఇక్కడ రాహికి కలిసొచ్చిన మరో అంశం ఏమిటంటే... ఆ ఏడాది కామన్వెల్త్ ఆటల పోటీలు పుణేలో రాహి ప్రాక్టీస్ చేసిన శివ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోనే జరగడం. మొదట్లో సాధారణమైన కోచింగ్‌తోనే విజయాలు సాధించింది రాహి. తర్వాత ప్రత్యేకమైన మెళకువల నేర్చుకోవాలనుకుంది. ‘‘ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం చేసే పొరపాట్లేంటో మనకు తెలియదు. స్పెషలిస్ట్ కోచ్ పర్యవేక్షణలో ప్రాక్టీస్ చేస్తే మన పొరపాట్లను వాళ్లు నిశితంగా గమనించగలుగుతారు, సున్నితమైన మెళకువలతో ఆ పొరపాట్లను కరెక్ట్ చేయగలుగుతారు’’ అంటారు రాహి. కాలం విధించిన విరామం ఏడేళ్ల పాటు దాదాపుగా ఏటా విజయ శిఖరాలను చేరుకుంటూ పతకాలతో తిరిగొచ్చిన రాహి కెరీర్లో 2015 చీకటిని నింపింది. వెన్నునొప్పి, మోచేతికి గాయంతో విలవిల్లాడిపోయింది. బలవంతాన పిస్టల్ పట్టుకున్నప్పటికీ, పిస్టల్ పట్టుకున్న చెయ్యి పైకి లేవడం లేదు. ఆ చేతిని రెండో చేతి ఆసరాతో లేపాల్సి వస్తోంది. ఇక జీవితంలో పిస్టల్ పట్టుకోగలనా లేదా అని బెంబేలెత్తిపోతున్న సమయంలో ఆమె కోచ్ అనతోలి పిద్యుబ్ని కాలం చేశారు. అప్పుడామె డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. ఏడాదికి పైగా విశ్రాంతి, ఫిజియోథెరపీతోనే గడిచిపోయింది. రియో ఒలింపిక్స్ (2016)లో ఆడలేని పరిస్థితి. ‘‘అవి నేను తీవ్రమైన కుంగుబాటుకు లోనైన రోజులు. 2015 ఏడాది చివర్లో గాయమైంది. కోలుకుని ఒలింపిక్స్‌కు వెళ్లగలననే ఆశాభావం ఉండేది. ప్రాక్టీస్ చేసే కొద్దీ గాయం మరింత తీవ్రం కావడంతో నేను చేసిన తప్పేంటో తెలిసింది. దాంతో పూర్తిగా ఏడాదిపాటు విరామం తీసుకోక తప్పలేదు’’ అన్నదామె. పడి లేచిన కెరటం ఒలింపిక్స్‌లో షూట్ చేయలేకపోయినందుకు ఎంతగా వ్యాకులతకు లోనయినప్పటికీ.. తనను తాను తిరిగి చైతన్యవంతం చేసుకునే ప్రయత్నంలో విఫలంకాలేదు రాహి. మళ్లీ ఫామ్‌లోకి వచ్చి తీరాలనే పట్టుదల మాత్రమే ఆమెను తిరిగి శక్తిమంతం చేసింది. మోచేతి ఎముక విరిగినప్పటికీ షూటింగ్లో పాల్గొనగలగడం కేవలం ఆమె మొండి పట్టుదలతోనే సాధ్యమైందంటారు తల్లిదండ్రులు. ఆరోగ్యం కుదుట పడుతుండగానే ప్రాక్టీస్ మీద దృష్టి పెట్టింది రాహి. ‘‘గత ఏడాది జూలైలో ముంఖ్‌బయార్ దోర్జ్సురెన్తో ట్రయల్ ట్రైనింగ్ క్యాంప్‌లో పాల్గొన్నాను. పాతికేళ్ల కెరీర్లో ఆమె అనుభవం నాకు ఉపకరిస్తుందనిపించింది. ఆమె దగ్గరే కోచింగ్ తీసుకోవాలని అప్పుడే అనుకున్నాను. ఆమె నన్ను మానసికంగా బలపడేలా చేశారు’’ అని చెప్తుంది రాహి. ఇప్పుడీ తాజా విజయం అందుకున్న సందర్భంలో కూడా ‘‘ఈ బంగారు పతకం కొన్ని నెలల కఠోరశ్రమ అనంతరం సాధ్యమైంది. ఈ సందర్భంగా కోచ్ ముంఖ్‌బయార్ దోర్జ్సురెన్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియచేయాలి. ఈ విజయం కోసం నాతోపాటు ఆమె కూడా అంతే శ్రమించారు’’ అంది రాహి సర్నోబాత్. సానుకూల ఆలోచనతోనే గెలుపు! 2010లో స్వర్ణం చేజారి సిల్వర్ మెడల్ అందుకున్న సందర్భంగా... విజయాన్ని చేరుకోలేకపోయినందుకు డీలా పడకుండా, ఈ ప్రయాణంలో మరికొన్ని విజయాలను సాధించి తీరగలననే ఆశావహ దృక్పథంతో రాహి మాట్లాడిన తీరు ఆకట్టుకుంది. ‘‘మూడేళ్ల కిందట పిస్టల్ పట్టుకున్నాను. షూటింగ్లో నా ప్రయాణం చక్కగా, సున్నితంగా సాగుతోంది. నా ముందున్నది నాకంటే ఎన్నో ఏళ్లు ఎక్కువ సాధన చేసిన వాళ్లే’ అని చిరునవ్వుతో చెప్పింది రాహి. అప్పటికామెకు పందొమ్మిదేళ్లు మాత్రమే. భావోద్వేగాలే బలహీనత గోల్డ్‌మెడల్ విజేతగా తన పేరు వినిపించిన వెంటనే ఆమె పట్టలేని ఆనందంతో కోచ్‌ను గాఢంగా ఆలింగనం చేసుకుని తన కృతజ్ఞత తెలియచేసింది రాహి. గోల్డ్‌మెడల్ అందుకున్న వెంటనే ఆమె జాతీయ పతాకాన్ని తన భుజాల మీద కప్పుకుని భక్తిగా వినమ్రతను చాటుకుంది. రాహి భావోద్వేగాలను అణుచుకోలేరనేది విమర్శకుల ఆరోపణ. గాయమైనప్పుడు డిప్రెషన్లోకి జారిపోవడానికి కారణం కూడా ఆమెలోని ఈ బలహీనతలేనంటారు. క్రీడాకారుల్లో మానసిక స్థైర్యం దృఢంగా ఉండాలనేది వారి సూచన. అయితే ఇదే సమయంలో తిరిగి కోలుకోవడానికి ఆమె పడిన శ్రమకు ప్రశంసలూ అదే స్థాయిలో అందుతున్నాయి. ఆమె మంచి షూటర్ మంగోలియన్ జర్మన్‌కు చెందిన కోచ్ ముంఖ్‌బయార్ దోర్జ్‌సురెన్... రాహి క్రీడాజీవితాన్ని తిరిగి ట్రాక్‌లో పెట్టిన కోచ్. ఆమె ఒలింపిక్స్‌లో రెండుసార్లు మెడల్ అందుకున్న క్రీడాకారిణి. ఆమె రాహిని షూటింగ్లో మెళకువలు నేర్పడానికంటే ముందు మానసిక స్థైర్యం ఇస్తూ ఆమెను పోటీకి సిద్ధం చేసింది. ‘రాహి స్వతహాగా మంచి షూటర్. కెరీర్ పరంగా కూడా హైలెవెల్ షూటర్. ఆమెకి చిన్నపాటి సూచనలే అవసరమయ్యాయి. ప్రాక్టీస్‌లో కొన్ని టెక్నిక్స్‌ను మార్చాను. వాటినామె చాలా సులువుగానే పట్టేసింది. నేను ఎక్కువగా దృష్టి పెట్టింది రాహిని మానసికంగా సిద్ధం చేయడానికే’ అంటారు ముంఖ్‌బయార్ దోర్జ్‌సురెన్. రాహికి పుస్తకాలు చదవడం ఇష్టం. ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న రాహి.. తీరిక దొరికితే క్రీడాకారుల జీవిత చరిత్రలను చదువుతుంటుంది. క్రమం తప్పకుండా యోగా చేయడం ఆమె డైలీ రొటీన్. ఇక ఇష్టమైన వ్యాపకాలు షాపింగ్ చేయడం, కొత్త ప్రదేశాల్లో పర్యటించడం. ఇష్టమైన ఆహారం వడాపావ్, పల్లీ చిక్కీ, పిజ్జా, చాక్లెట్. డిప్రెషన్‌కు గురైనప్పుడు మితి మీరి చాక్లెట్లకు అలవాటైంది. ఈ విజయం ఇచ్చిన ఆనందంతో ఫుడ్ హ్యాబిట్స్‌ను కంట్రోల్ పెడుతుందేమో చూడాలి. ఈ విజయం రాబోయే 2020 ఒలింపిక్స్ విజయానికి సోపానం అంటోంది రాహి కోచ్ ముంఖ్‌బయార్ దోర్జ్‌సురెన్. పదేళ్లలో ఎనిమిది అవార్డులు 2008 – కామన్వెల్త్ యూత్‌లో గోల్డ్‌మెడల్ (అది రాహికి తొలి మెడల్ మాత్రమే కాదు,ఇండియాకి షూటింగ్ విభాగంలో తొలి గోల్డ్ మెడల్ కూడా) 2010 – ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో రెండు బంగారు పతకాలు 2011– వరల్డ్ కప్‌లో కాంస్య పతకం 2013– ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్‌లో గోల్డ్‌మెడల్ (ఈ మెడల్ అందుకున్న తొలి భారతీయ పిస్టల్ షూటర్) 2014 – గ్లాస్గో కామన్వెల్త్లో గోల్డ్‌మెడల్ 2014 – సౌత్ కొరియా ఆసియా క్రీడల్లో టీమ్ విభాగంలో కాంస్యం 2015 – రాహి పేరును అర్జున అవార్డుకు సిఫార్సు చేయడం జరిగింది. 2018 – ఆసియా క్రీడల్లో బంగారు పథకం. – వాకా మంజులారెడ్డి -
బుల్లేట్ దిగింది
ఆసియా క్రీడల్లో భారత బుల్లెట్ మరోసారి లక్ష్యంలోకి దిగింది. ఈసారీ స్వర్ణాన్ని కొల్లగొట్టింది. అభిమానులందరినీ సంబరంలో ముంచెత్తింది. మంగళవారం 16 ఏళ్ల సౌరభ్ చౌధరీ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో ఆఖరి రెండు షాట్లలో స్వర్ణాన్ని సొంతం చేసుకోగా... బుధవారం 27 ఏళ్ల రాహీ సర్నోబాత్ 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో రెండు ‘షూట్ ఆఫ్’లలో పసిడి పతకాన్ని ఖాయం చేసుకుంది. 2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించాక ఫామ్ కోల్పోవడం... 2016లో మోచేతి గాయంతో ఏడాదిపాటు ఆటకు దూరం కావడం... ఇటీవల 16 ఏళ్ల మనూ భాకర్ పతకాల పంట పండిస్తుండటం... ఈ నేపథ్యంలో తీవ్ర ఒత్తిడిలో బరిలోకి దిగిన రాహీ ఒకే ఒక్క ప్రదర్శనతో చరిత్రకెక్కింది. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ మహిళా షూటర్‌గా ఘనత వహించింది. మరోవైపు వుషు క్రీడాంశంలో నలుగురు భారత క్రీడాకారులు సెమీస్‌లో ఓడిపోవడంతో నాలుగు కాంస్యాలు లభించాయి. ఓవరాల్‌గా పోటీల నాలుగో రోజు భారత్‌కు స్వర్ణం, నాలుగు కాంస్యాలతో కలిపి ఐదు పతకాలు వచ్చాయి. పతకాల పట్టికలో ప్రస్తుతం భారత్ 4 స్వర్ణాలు, 3 రజతాలు, 8 కాంస్యాలతో కలిపి 15 పతకాలతో ఏడో స్థానంలో ఉంది. పాలెంబాంగ్: చివరి షాట్ వరకు ఉత్కంఠ రేపిన ఫైనల్లో భారత షూటర్ రాహీ సర్నోబాత్ పైచేయి సాధించింది. తన కెరీర్లోనే గొప్ప విజయాన్ని నమోదు చేసింది. ఆసియా క్రీడల్లో భాగంగా బుధవారం జరిగిన మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన రాహీ సర్నోబాత్ విజేతగా నిలిచి భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించింది. ఈ క్రమంలో ఆసియా క్రీడల చరిత్రలో పసిడి పతకం నెగ్గిన తొలి భారతీయ మహిళా షూటర్‌గా, ఓవరాల్‌గా ఆరో షూటర్‌గా గుర్తింపు పొందింది. షూట్ ఆఫ్‌లో సూపర్... మొత్తం ఎనిమిది మంది పాల్గొన్న ఫైనల్లో ఐదు షాట్లతో కూడిన 10 సిరీస్‌లు ముగిశాక రాహీ, నఫాస్వన్ యాంగ్‌పైబూన్ (థాయ్‌లాండ్) 34 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచారు. దాంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూట్ ఆఫ్’ అవకాశం ఇచ్చారు. ఇందులో ఇద్దరూ నాలుగేసి పాయింట్లు చేయడం... స్కోరు సమం కావడంతో... మరో ‘షూట్ ఆఫ్’ అనివార్యమైంది. ఈసారి రాహీ 3 పాయింట్లు స్కోరు చేయగా... నఫాస్వన్ 2 పాయింట్లే సాధించడంతో భారత షూటర్‌కు స్వర్ణం లభించింది. నఫాస్వన్ ఖాతాలో రజతం చేరింది. 29 పాయింట్లతో కిమ్ మిన్‌జుంగ్ (దక్షిణ కొరియా) కాంస్య పతకాన్ని దక్కించుకుంది. ఫైనల్లో పోటీపడిన భారత యువ సంచలనం, 16 ఏళ్ల మనూ భాకర్‌కు నిరాశ ఎదురైంది. ఆమె 16 పాయింట్లు స్కోరు చేసి ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. 32 మంది షూటర్లు పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో మనూ 593 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని పొందగా... రాహీ సర్నోబాత్ 580 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. టాప్–8లో నిలిచిన వారు ఫైనల్‌కు అర్హత సాధించారు. 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ విభాగంలో భారత షూటర్లు అంజుమ్, గాయత్రి ఫైనల్‌కు అర్హత పొందలేకపోయారు. స్వర్ణం నెగ్గిన రాహీకి రూ. 50 లక్షల నగదు పురస్కారాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో పసిడి పతకం నెగ్గిన తర్వాత రాహీకి రాష్ట్ర ప్రభుత్వం పుణేలో డిప్యూటీ కలెక్టర్‌గా ఉద్యోగం ఇచ్చింది. షూటింగే నా జీవితం. పది నెలల క్రితం వ్యక్తిగత కోచ్‌గా వచ్చిన ముంక్బాయెర్ డార్జ్సురేన్ నా టెక్నిక్‌లో కొన్ని మార్పులు చేసింది. ఆ మార్పులు ఫలితాన్ని ఇచ్చాయి. ఖాళీగా ఉంటే పుస్తకాలు చదువుతాను. నా తదుపరి లక్ష్యం ప్రపంచ చాంపియన్‌షిప్. వచ్చే నెలలో కొరియాలోని చాంగ్‌వన్‌లో ఈ మెగా ఈవెంట్ మొదలవుతుంది. 2013లో ఇదే వేదికపై ప్రపంచకప్‌లో స్వర్ణం గెలిచాను. ఈసారీ ఆ వేదిక నాకు కలిసొస్తుందని ఆశిస్తున్నాను. –రాహీ సర్నోబాత్ నలుగురికీ కాంస్యాలే... వుషు క్రీడాంశంలో భారత్‌కు నాలుగు కాంస్యాలు లభించాయి. ఈ క్రీడల చరిత్రలో భారత్‌కిదే అత్యుత్తమ ప్రదర్శన. పురుషుల ‘సాండా’ ఈవెంట్లో బరిలోకి దిగిన నరేందర్ గ్రెవాల్ (65 కేజీలు)... సంతోష్ కుమార్ (56 కేజీలు)... సూర్యభాను ప్రతాప్ సింగ్ (60 కేజీలు)... మహిళల ‘సాండా’ ఈవెంట్లో రోషిబినా దేవి (60 కేజీలు) సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలు సాధించారు. సెమీఫైనల్స్‌లో నరేందర్ 0–2తో ఫరూద్ జఫారీ (ఇరాన్) చేతిలో, సంతోష్ 0–2తో ట్రువోంగ్ గియాంగ్ (వియత్నాం) చేతిలో, సూర్యభాను 0–2తో ఇర్ఫాన్ (ఇరాన్) చేతిలో, రోషిబినా 0–1తో కాయ్ యింగ్యింగ్ (చైనా) చేతిలో ఓటమి చవిచూశారు. -
రాహీ పతకం త్రుటిలో చేజారింది
చాంగ్‌వొన్ (దక్షిణ కొరియా): ప్రపంచకప్ షూటింగ్లో రెండో రోజూ భారత షూటర్లకు నిరాశే ఎదురైంది. రాహీ సర్నోబాత్ పతకం గెలిచే అవకాశాన్ని త్రుటిలో కోల్పోయింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో ఆమె నాలుగో స్థానంలో నిలిచింది. క్వాలిఫయింగ్‌లో 600 పాయింట్లకుగాను రికార్డు స్థాయిలో 588 పాయింట్లు సాధించిన ఆమె... 8 మంది పోటీపడిన ఫైనల్లో మాత్రం నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. మిగతా భారత షూటర్లలో హీనా సిద్ధు 37వ, అనురాజ్ సింగ్ 41వ స్థానంలో నిలిచారు. 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రవికుమార్–అపూర్వీ చండీలా జోడీ ఐదో స్థానం పొందింది. ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయిన దీపక్ కుమార్–మెహులీ ఘోష్ జంట ఎనిమిదో స్థానంలో నిలిచింది. మహిళల ట్రాప్ ఈవెంట్లో షగున్ చౌదరి 26వ, శ్రేయసి సింగ్ 33వ స్థానాల్లో నిలిచారు. -
షూటింగ్ లో భారత్ కు మరో స్వర్ణం
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ షూటర్లు మెరుస్తున్నారు. 2014 కామన్వెల్త్ గేమ్స్ లో భాగంగా గ్లాస్గో లో శనివారం రాత్రి జరిగిన మహిళల షూటింగ్లో భారత్ మరో రెండు పతకాలను కైవసం చేసుంది. 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో రాహీ సర్నోబాత్ కు స్వర్ణం దక్కగా, అనిషా సయ్యద్ కు రజత పతకం లభించింది. అంతకుముందు జరిగిన మహిళల పది మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత్ కు రెండు పతకాలు వరించాయి. అపూర్వి చండేలా, అయోనికా పాల్ వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచి పసిడి, రజత పతకాలు సొంతం చేసుకున్నారు. అపూర్వి చండేలా 206.7 పాయింట్లు, అయోనికా పాల్ 204.9 పాయింట్లు సాధించి ఇతరులకు అందనంత దూరంలో నిలిచారు. పురుషుల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్ షూటర్ ప్రకాశ్ నంజప్ప రజత పతకం సాధించగా, శుక్రవారం జరిగిన పోటీల్లో భారత షూటర్లు అభినవ్ బింద్రా స్వర్ణం, మలైకా గోయెల్ రజతం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత షూటర్లు ఇప్పటివరకు ఏడు పతకాలను కైవసం చేసుకున్నారు. ఇప్పటివరకూ భారత్ 15 పతకాలను చేజిక్కించుకుని పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఇందులో ఐదు బంగారు పతకాలు, ఏడు రజత పతకాలు, మూడు కాంస్య పతకాలు ఉన్నాయి.