భరతమాత బంగారుబిడ్డ... ఆమె! | Rahi Sarnobat wins gold in shooting | Sakshi
Sakshi News home page

గురిచూసి గోల్డ్‌ కొట్టింది

Published Mon, Aug 27 2018 12:39 AM | Last Updated on Mon, Aug 27 2018 10:47 AM

Rahi Sarnobat wins gold in shooting - Sakshi

పదహారేళ్లకు పిస్టల్‌ పట్టుకుంది. పదిహేడేళ్లకు కామన్వెల్త్‌లో బంగారు పతకం అందుకుంది. తర్వాత వరుసగా ఐదు బంగారు పతకాలకు ‘తలవంచింది’. ఇప్పుడు ఆరో బంగారు పతకం ఆమె కోసం దిగి వచ్చింది. భరతమాత బంగారుబిడ్డ... రాహీ జీవన్‌ సర్నోబాత్‌ ఆమె!

2018, ఆగస్టు 22, బుధవారం. రాహి జీవితంలో మరొక మైలు రాయి! ఓ పాతికేళ్ల తర్వాత ఆమె కనుక ఆటోబయోగ్రఫీ రాసుకుంటే అందులో... అత్యంత ప్రధానమైన సంఘటనల్లో ఇదొకటి అవుతుంది. ఇండోనేసియాలో జరుగుతున్న 18వ ఏషియన్‌ గేమ్స్‌లో రాహి రికార్డు సాధించిన రోజది. ఈ రికార్డు రాహికి మాత్రమే మైలురాయి కాదు, ఇండియాకి కూడా.

నిజమే... ఏషియన్‌ గేమ్స్‌లో షూటింగ్‌ విభాగంలో బంగారు పతకం అందుకున్న తొలి భారతీయ మహిళ రాహీ జీవన్‌ సర్నోబాత్‌. అంతకు ముందు రోజే పది మీటర్ల పురుషుల షూటింగ్‌ విభాగంలో సౌరభ్‌ చౌదురి స్వర్ణాన్ని అందుకున్నాడు. అది ఏషియన్‌ గేమ్స్‌ షూటింగ్‌ విభాగంలో ఇండియాకి అందిన తొలి స్వర్ణం. రాహి రెండవ స్వర్ణం సాధించిన ఇండియన్‌గా నిలిచారు. ఏషియన్‌ గేమ్స్‌ నిర్వహణలో మహిళల షూటింగ్‌ పోటీలు మగవాళ్ల షూటింగ్‌ పోటీలకంటే ముందు జరిగి ఉంటే ఆ రికార్డు కూడా రాహి ఖాతాలోనే పడేది.

రాహి సొంతూరు మహారాష్ట్రలోని కొల్హాపూర్‌. సాధారణ కుటుంబం. తండ్రి జీవన్‌ సర్నోబాత్‌. ‘‘ఇన్సూరెన్స్‌ ఏజెంట్‌గా కూతురిని స్పోర్ట్స్‌ స్టార్‌ చేయడం తలకు మించిన పని అనే చెప్పాలి. రాహి ఏది కోరితే అది చేయడమే వాళ్ల నాన్నకిష్టం. అందుకే ఎంత ఖర్చయినా వెనుకాడలేదు. రాహికి చిన్నప్పుడు షూటర్‌ కావాలనే కోరిక ఉండేది కాదు. ఉషారాజె హైస్కూల్‌లో స్కూల్‌ ఫైనల్‌కి వచ్చేటప్పటికి తేజస్విని సావంత్‌ రైఫిల్‌ షూటింగ్‌లో మెడల్‌ అందుకుంది. ఆమె కూడా మహారాష్ట్ర అమ్మాయే. తేజస్విని మెడల్‌ అందుకోవడం చూసినప్పటి నుంచి తనకు కూడా షూటర్‌ కావాలనే కోరిక కలిగింది’’ అని గుర్తు చేసుకుంటారు రాహి తల్లి ప్రభా సర్నోబాత్‌.

పదేళ్ల కిందటే స్వర్ణం
ఈ ఏషియాడ్‌లో భారత్‌కు స్వర్ణాన్ని సాధించడంతో ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షించింది రాహి. కానీ షూటర్‌గా ఆమె విజయ పరంపర 2008లోనే మొదలైంది. ‘2008 కామన్వెల్త్‌’ యూత్‌ గేమ్స్‌ 25 మీటర్ల విభాగంలో తొలి స్వర్ణాన్ని సాధించింది. అప్పటికి ఆమె ప్రాక్టీస్‌ ప్రారంభించి ఒక్క ఏడాది మాత్రమే. తేజస్విని సావంత్‌ 2006 కామన్వెల్త్‌ గేమ్స్, 50 మీటర్ల రైఫిల్‌ షూటింగ్‌ విభాగంలో విజయం సాధించడాన్ని చూసిన తర్వాత తానూ షూటింగ్‌ నేర్చుకుంటానని ప్రాక్టీస్‌ మొదలుపెట్టింది.

అలా పదహారేళ్ల వయసులో పిస్టల్‌ పట్టుకుంది రాహి. ఆ తర్వాత రెండేళ్లకే తొలి విజయాన్ని సాధించింది. ఇక్కడ రాహికి కలిసొచ్చిన మరో అంశం ఏమిటంటే... ఆ ఏడాది కామన్వెల్త్‌ ఆటల పోటీలు పుణేలో రాహి ప్రాక్టీస్‌ చేసిన శివ ఛత్రపతి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లోనే జరగడం. మొదట్లో సాధారణమైన కోచింగ్‌తోనే విజయాలు సాధించింది రాహి. తర్వాత ప్రత్యేకమైన మెళకువల నేర్చుకోవాలనుకుంది. ‘‘ప్రాక్టీస్‌ చేసేటప్పుడు మనం చేసే పొరపాట్లేంటో మనకు తెలియదు. స్పెషలిస్ట్‌ కోచ్‌ పర్యవేక్షణలో ప్రాక్టీస్‌ చేస్తే మన పొరపాట్లను వాళ్లు నిశితంగా గమనించగలుగుతారు, సున్నితమైన మెళకువలతో ఆ పొరపాట్లను కరెక్ట్‌ చేయగలుగుతారు’’ అంటారు రాహి.

కాలం విధించిన విరామం
ఏడేళ్ల పాటు దాదాపుగా ఏటా విజయ శిఖరాలను చేరుకుంటూ పతకాలతో తిరిగొచ్చిన రాహి కెరీర్‌లో 2015 చీకటిని నింపింది. వెన్నునొప్పి, మోచేతికి గాయంతో విలవిల్లాడిపోయింది. బలవంతాన పిస్టల్‌ పట్టుకున్నప్పటికీ, పిస్టల్‌ పట్టుకున్న చెయ్యి పైకి లేవడం లేదు. ఆ చేతిని రెండో చేతి ఆసరాతో లేపాల్సి వస్తోంది. ఇక జీవితంలో పిస్టల్‌ పట్టుకోగలనా లేదా అని బెంబేలెత్తిపోతున్న సమయంలో ఆమె కోచ్‌ అనతోలి పిద్యుబ్ని కాలం చేశారు. అప్పుడామె డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది.

ఏడాదికి పైగా విశ్రాంతి, ఫిజియోథెరపీతోనే గడిచిపోయింది. రియో ఒలింపిక్స్‌ (2016)లో ఆడలేని పరిస్థితి. ‘‘అవి నేను తీవ్రమైన కుంగుబాటుకు లోనైన రోజులు. 2015 ఏడాది చివర్లో గాయమైంది. కోలుకుని ఒలింపిక్స్‌కు వెళ్లగలననే ఆశాభావం ఉండేది. ప్రాక్టీస్‌ చేసే కొద్దీ గాయం మరింత తీవ్రం కావడంతో నేను చేసిన తప్పేంటో తెలిసింది. దాంతో పూర్తిగా ఏడాదిపాటు విరామం తీసుకోక తప్పలేదు’’ అన్నదామె.

పడి లేచిన కెరటం
ఒలింపిక్స్‌లో షూట్‌ చేయలేకపోయినందుకు ఎంతగా వ్యాకులతకు లోనయినప్పటికీ.. తనను తాను తిరిగి చైతన్యవంతం చేసుకునే ప్రయత్నంలో విఫలంకాలేదు రాహి. మళ్లీ ఫామ్‌లోకి వచ్చి తీరాలనే పట్టుదల మాత్రమే ఆమెను తిరిగి శక్తిమంతం చేసింది. మోచేతి ఎముక విరిగినప్పటికీ షూటింగ్‌లో పాల్గొనగలగడం కేవలం ఆమె మొండి పట్టుదలతోనే సాధ్యమైందంటారు తల్లిదండ్రులు. ఆరోగ్యం కుదుట పడుతుండగానే ప్రాక్టీస్‌ మీద దృష్టి పెట్టింది రాహి.

‘‘గత ఏడాది జూలైలో ముంఖ్‌బయార్‌ దోర్జ్‌సురెన్‌తో ట్రయల్‌ ట్రైనింగ్‌ క్యాంప్‌లో పాల్గొన్నాను. పాతికేళ్ల కెరీర్‌లో ఆమె అనుభవం నాకు ఉపకరిస్తుందనిపించింది. ఆమె దగ్గరే కోచింగ్‌ తీసుకోవాలని అప్పుడే అనుకున్నాను. ఆమె నన్ను మానసికంగా బలపడేలా చేశారు’’ అని చెప్తుంది రాహి. ఇప్పుడీ తాజా విజయం అందుకున్న సందర్భంలో కూడా ‘‘ఈ బంగారు పతకం కొన్ని నెలల కఠోరశ్రమ అనంతరం సాధ్యమైంది. ఈ సందర్భంగా కోచ్‌ ముంఖ్‌బయార్‌ దోర్జ్‌సురెన్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియచేయాలి. ఈ విజయం కోసం నాతోపాటు ఆమె కూడా అంతే శ్రమించారు’’ అంది రాహి సర్నోబాత్‌.

సానుకూల ఆలోచనతోనే గెలుపు!
2010లో స్వర్ణం చేజారి సిల్వర్‌ మెడల్‌ అందుకున్న సందర్భంగా... విజయాన్ని చేరుకోలేకపోయినందుకు డీలా పడకుండా, ఈ ప్రయాణంలో మరికొన్ని విజయాలను సాధించి తీరగలననే ఆశావహ దృక్పథంతో రాహి మాట్లాడిన తీరు ఆకట్టుకుంది. ‘‘మూడేళ్ల కిందట పిస్టల్‌ పట్టుకున్నాను. షూటింగ్‌లో నా ప్రయాణం చక్కగా, సున్నితంగా సాగుతోంది. నా ముందున్నది నాకంటే ఎన్నో ఏళ్లు ఎక్కువ సాధన చేసిన వాళ్లే’ అని చిరునవ్వుతో చెప్పింది రాహి. అప్పటికామెకు పందొమ్మిదేళ్లు మాత్రమే.

భావోద్వేగాలే బలహీనత
గోల్డ్‌మెడల్‌ విజేతగా తన పేరు వినిపించిన వెంటనే ఆమె పట్టలేని ఆనందంతో కోచ్‌ను గాఢంగా ఆలింగనం చేసుకుని తన కృతజ్ఞత తెలియచేసింది రాహి. గోల్డ్‌మెడల్‌ అందుకున్న వెంటనే ఆమె జాతీయ పతాకాన్ని తన భుజాల మీద కప్పుకుని భక్తిగా వినమ్రతను చాటుకుంది. రాహి భావోద్వేగాలను అణుచుకోలేరనేది విమర్శకుల ఆరోపణ. గాయమైనప్పుడు డిప్రెషన్‌లోకి జారిపోవడానికి కారణం కూడా ఆమెలోని ఈ బలహీనతలేనంటారు. క్రీడాకారుల్లో మానసిక స్థైర్యం దృఢంగా ఉండాలనేది వారి సూచన. అయితే ఇదే సమయంలో తిరిగి కోలుకోవడానికి ఆమె పడిన శ్రమకు ప్రశంసలూ అదే స్థాయిలో అందుతున్నాయి.

ఆమె మంచి షూటర్‌
మంగోలియన్‌ జర్మన్‌కు చెందిన కోచ్‌ ముంఖ్‌బయార్‌ దోర్జ్‌సురెన్‌... రాహి క్రీడాజీవితాన్ని తిరిగి ట్రాక్‌లో పెట్టిన కోచ్‌. ఆమె ఒలింపిక్స్‌లో రెండుసార్లు మెడల్‌ అందుకున్న క్రీడాకారిణి. ఆమె రాహిని షూటింగ్‌లో మెళకువలు నేర్పడానికంటే ముందు మానసిక స్థైర్యం ఇస్తూ ఆమెను పోటీకి సిద్ధం చేసింది. ‘రాహి స్వతహాగా మంచి షూటర్‌. కెరీర్‌ పరంగా కూడా హైలెవెల్‌ షూటర్‌. ఆమెకి చిన్నపాటి సూచనలే అవసరమయ్యాయి. ప్రాక్టీస్‌లో కొన్ని టెక్నిక్స్‌ను మార్చాను. వాటినామె చాలా సులువుగానే పట్టేసింది. నేను ఎక్కువగా దృష్టి పెట్టింది రాహిని మానసికంగా సిద్ధం చేయడానికే’ అంటారు ముంఖ్‌బయార్‌ దోర్జ్‌సురెన్‌.


రాహికి పుస్తకాలు చదవడం ఇష్టం. ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న రాహి.. తీరిక దొరికితే క్రీడాకారుల జీవిత చరిత్రలను చదువుతుంటుంది. క్రమం తప్పకుండా యోగా చేయడం ఆమె డైలీ రొటీన్‌. ఇక ఇష్టమైన వ్యాపకాలు షాపింగ్‌ చేయడం, కొత్త ప్రదేశాల్లో పర్యటించడం. ఇష్టమైన ఆహారం వడాపావ్, పల్లీ చిక్కీ, పిజ్జా, చాక్లెట్‌. డిప్రెషన్‌కు గురైనప్పుడు మితి మీరి చాక్లెట్లకు అలవాటైంది. ఈ విజయం ఇచ్చిన ఆనందంతో ఫుడ్‌ హ్యాబిట్స్‌ను కంట్రోల్‌ పెడుతుందేమో చూడాలి. ఈ విజయం రాబోయే 2020 ఒలింపిక్స్‌ విజయానికి సోపానం అంటోంది రాహి కోచ్‌ ముంఖ్‌బయార్‌ దోర్జ్‌సురెన్‌.


పదేళ్లలో ఎనిమిది అవార్డులు
2008 – కామన్వెల్త్‌ యూత్‌లో గోల్డ్‌మెడల్‌ (అది రాహికి తొలి మెడల్‌ మాత్రమే కాదు,ఇండియాకి షూటింగ్‌ విభాగంలో తొలి గోల్డ్‌ మెడల్‌ కూడా)
2010 – ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌లో రెండు బంగారు పతకాలు
2011– వరల్డ్‌ కప్‌లో కాంస్య పతకం
2013– ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్‌ కప్‌లో గోల్డ్‌మెడల్‌ (ఈ మెడల్‌ అందుకున్న తొలి భారతీయ పిస్టల్‌ షూటర్‌)
2014 – గ్లాస్గో కామన్వెల్త్‌లో గోల్డ్‌మెడల్‌
2014 – సౌత్‌ కొరియా ఆసియా క్రీడల్లో టీమ్‌ విభాగంలో కాంస్యం
2015 – రాహి పేరును అర్జున అవార్డుకు సిఫార్సు చేయడం జరిగింది.
2018 – ఆసియా క్రీడల్లో బంగారు పథకం.


– వాకా మంజులారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement