సిరీస్ మధ్యలో మార్పులెందుకు?
రాహుల్ ద్రవిడ్ ప్రశ్న
న్యూఢిల్లీ: ఇంగ్లండ్ పర్యటన పూర్తిగా ముగియక ముందే సహాయక సిబ్బందిని మార్చడంపై భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వన్డే సిరీస్ ముగిసిన తర్వాత మార్పులు చేయాల్సిందని ఆయన అభిప్రాయ పడ్డారు. ‘ప్రొఫెషనల్ క్రీడలో మార్పులు సహజం. దానిని ఎవరూ తప్పుపట్టరు. అయితే కొత్త సహాయక బృందం ఈ సిరీస్ వరకేనా, తర్వాత కూడా కొనసాగుతుందా అనేదానిపై స్పష్టత లేదు.
సాధారణంగా సహాయక సిబ్బందితో కూడా ఆటగాళ్లకు అనుబంధం ఏర్పడిపోతుంది. కొన్ని సందర్భాల్లో క్రికెటర్ల విజయం, వైఫల్యంపై కూడా వారి ప్రభావం ఉంటుంది. కాబట్టి సిరీస్ మధ్యలో మార్చితే అనవసరపు సందిగ్ధత ఏర్పడుతుంది’ అని ద్రవిడ్ వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిని రవిశాస్త్రి చక్కదిద్దగలడని విశ్వాసం వ్యక్తం చేసిన ద్రవిడ్...‘కొత్త వాతావరణం’లో ఇమడగలడా లేదా అనేది ఫ్లెచర్ స్వయంగా తేల్చుకోవాలని సూచించారు.