చివరి టీ20కు వర్షం అంతరాయం
కోల్ కతా: దక్షిణాఫ్రికా-టీమిండియాల మధ్య జరుగనున్న మూడో ట్వంటీ 20 మ్యాచ్ కు వరుణుడు అడ్డంకిగా మారాడు. మూడు ట్వంటీ20 సిరీస్ లో భాగంగా గురువారం ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య చివరి ట్వంటీ 20 మ్యాచ్ జరుగనుంది. కాగా ఈరోజు సాయంత్రం సమయంలో వర్షం పడటంతో పిచ్ ను కవర్లతో కప్పి ఉంచారు. ఈ నేపథ్యంలో మ్యాచ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ రాత్రి 7.00 గం.లకు ఆరంభం కావాల్సి ఉంది. అయితే రాత్రి 7.30 ని.లకు పిచ్ ను అంపైర్లు పరీక్షించిన అనంతరం మ్యాచ్ పై నిర్ణయాన్ని వెలువరిస్తారు.
ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్ ల ను కోల్పోయి సిరీస్ ను చేజార్చుకున్న టీమిండియా.. ఈ మ్యాచ్ లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని పట్టుదలగా ఉండగా, దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్ లో కూడా గెలిచి ట్వంటీ 20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది.