
ఇక్కడా కాసుల వర్షం!
విదేశీ క్రీడాకారులకు భారీగా చెల్లిస్తున్న ఐఎస్‌ఎల్ ఫ్రాంఛైజీలు
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పుణ్యమాని భారత క్రికెటర్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేకమంది క్రికెటర్లు కోటీశ్వరులుగా మారారు. ఆ తర్వాత భారత్‌లో అనేక క్రీడల్లో లీగ్‌లు ప్రారంభమైనా ఏవీ ఐపీఎల్‌కు దరిదాపుల్లోకి కూడా రాలేదు. కానీ తాజాగా ప్రారంభమైన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్‌లో మాత్రం క్రీడాకారులకు చెప్పుకోదగ్గ స్థాయిలో డబ్బు లభిస్తోంది. వాస్తవానికి యూరోప్ లీగ్‌లలో క్లబ్‌లకు ఆడే ఆటగాళ్లకు కోట్లాది రూపాయలు దక్కుతాయి.
భారత్‌లో ఇప్పుడే ప్రారంభమై... విజయవంతం అవుతుందో లేదో తెలియని లీగ్ కోసం ఆ స్థాయిలో డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. అయితే స్టార్ ఆటగాళ్లు లేకపోతే లీగ్ హిట్ కాదు. అందుకే ఈ లీగ్‌ను సమతూకంతో నడపాలని భావించారు. ఓనర్లుగా క్రికెట్, సినిమాల సెలబ్రిటీలను తేవడం వల్ల లీగ్‌కు ప్రచారం తెచ్చారు. మెస్సీ, రొనాల్డో లాంటి ప్రపంచస్థాయి ఆటగాళ్లు ఆడితే లీగ్ ఆటోమేటిక్‌గా హిట్ అవుతుంది. కానీ వాళ్లకు డబ్బు చెల్లించే స్థాయి మన లీగ్‌లో ఫ్రాంఛైజీలకు లేదు. అందుకే మాజీ క్రీడాకారులను తీసుకొచ్చారు. అంతర్జాతీయ కెరీర్ నుంచి తప్పుకుని, ప్రపంచంలోని చిన్న దేశాల లీగ్‌లలో ఆడే స్టార్‌లను ఐఎస్‌ఎల్ వైపు తీసుకొచ్చారు.
డెల్‌పియరోనే ఉదాహరణగా తీసుకుంటే... 2006లో ప్రపంచకప్ గెలిచిన ఇటలీ జట్టులో తను స్టార్. గత సీజన్‌లో ఆస్ట్రేలియాలో లీగ్ ఆడాడు. యూరోపియన్ క్లబ్‌లలో ఆడే స్థాయిలో తను లేడు. కానీ ఆస్ట్రేలియాలో లీగ్‌లో తను పెద్ద ఆటగాడు. ఐఎస్‌ఎల్ నిర్వాహకులు, జట్లు ఇలాంటి ఆటగాళ్లనే టార్గెట్ చేసుకున్నాయి. డెల్ పియరోకు ఢిల్లీ జట్టు సుమారు 11 కోట్ల రూపాయలు చెల్లించి తీసుకొచ్చింది. భారత్‌లో ఫుట్‌బాల్ లీగ్ ద్వారా ఇంత డబ్బు వస్తుందనేది క్రీడాకారులు ఊహించలేదు.
అలాగే అనెల్కాకు ముంబై ఫ్రాంచైజీ రూ.5.4 కోట్లు చెల్లిస్తోంది. తొలుత అనెల్కాను పుణే, చెన్నై సంప్రదించాయి. ఈ రెండు జట్లు వరుసగా రూ. 4.8 కోట్లు, రూ.4.2 కోట్లు ఆఫర్ చేశాయి. కానీ అనెల్కా రాలేదు. ముంబై దీనిని కొంత పెంచి రూ.5.4 కోట్లు ఇవ్వడంతో లీగ్‌లోకి దిగాడు. ప్రస్తుత లీగ్‌లో పియరో, అనెల్కా బాగా ఖరీదైన ఆటగాళ్లు. బ్లుమెర్, ట్రెజెగ్వెట్, పైర్స్, జుంగ్‌బర్గ్... ఇలా ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులు మరచిపోయిన పాత ఆటగాళ్ల మీద ఐఎస్‌ఎల్ కాసుల వర్షం కురిపించింది.
స్టార్ హోటల్ కావాల్సిందే...
ఈ లీగ్‌లో ఆడుతున్న విదేశీ ఆటగాళ్లు భారీ మొత్తం డబ్బును సంపాదిస్తున్నారు. అంతే కాదు... భారత్‌లో తాము ఉన్నంతకాలం తమతో పాటు కుటుంబసభ్యులకు కూడా ఫైవ్‌స్టార్ హోటల్స్‌లోనే బస కావాలని డిమాండ్ చేశారు. అలాగే విమానాల్లో బిజినెస్ క్లాస్ టిక్కెట్లు అడిగారు. వీటిని కూడా కలిపి లెక్క వేస్తే ఒక్కో విదేశీ స్టార్ ఆటగాడి మీద సగటున రూ.50 లక్షల దాకా వెచ్చించాల్సి ఉంటుంది.
మనోళ్లకు తక్కువే
అయితే భారత దేశవాళీ ఆటగాళ్లు ఈ లీగ్ ద్వారా భారీగా సంపాదించుకోవడం లేదు. కానీ ఇప్పటివరకూ వాళ్లకు ఎన్నడూ లభించని మొత్తం మాత్రం ఐఎస్‌ఎల్ రూపంలో వచ్చింది. సుబ్రతాపాల్ (ముంబై), సయ్యద్ ర హీమ్ నబీ (ముంబై), గౌరమాంగి సింగ్ (చెన్నై) అత్యధికంగా రూ.80 లక్షల చొప్పున పొందుతున్నారు. సంజు ప్రధాన్ (కోల్‌కతా), నిర్మల్ చెత్రి (కేరళ)లకు రూ.70 లక్షల చొప్పున లభిస్తున్నాయి. రోడ్రిక్స్ (పుణే), ఫ్రాన్సిస్ ఫెర్నాండెజ్ (ఢిల్లీ)లకు రూ. 55 లక్షల చొప్పున వస్తున్నాయి.
ఎవరికెంత?
ఆటగాడు జట్టు మొత్తం (రూ.కోట్లలో)
డెల్ పియరో ఢిల్లీ 10.8
అనెల్కా ముంబై 5.4
బ్లుమెర్ చెన్నై 4.8
ట్రెజెగ్వెట్ పుణే 4.5
పైర్స్ గోవా 4.1
జుంగ్‌బర్గ్ ముంబై 4
సిల్వెస్టర్ చెన్నై 2.85
డేవిడ్ జేమ్స్ కేరళ 2.70
గార్షియా కోల్‌కతా 2.70