చాంపియన్స్ లీగ్ ఫైనల్లో రాజస్థాన్
సొంతగడ్డపై అజేయ రికార్డును కొనసాగిస్తూ... ఎంత పటిష్ట జట్టైనా జైపూర్‌లో రాయల్స్‌ను ఓడించలేదని నిరూపిస్తూ... రాజస్థాన్ జట్టు చాంపియన్స్ లీగ్ ఫైనల్‌కు చేరింది. చెన్నై సూపర్ కింగ్స్ లాంటి బలమైన జట్టుపై గెలిచి తుది సమరానికి సిద్ధమైంది.
జైపూర్: ఇన్నాళ్లూ రాజస్థాన్ రాయల్స్ సొంతగడ్డపై గెలిచిన మ్యాచ్‌లన్నీ ఒకెత్తు... ఈ ఒక్క మ్యాచ్ ఒకెత్తు. వరుసగా 12 మ్యాచ్‌లు గెలిచినా... అన్నీ లీగ్ మ్యాచ్‌లే. ఈసారి నాకౌట్ సమరంలో... అది కూడా టి20ల్లో అత్యంత పటిష్టమైన చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి... సొంతగడ్డపై తమ జైత్రయాత్రను (వరుసగా 13 విజయాలు) కొనసాగించింది. సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ద్రవిడ్ సేన 14 పరుగుల తేడాతో ధోని బృందాన్ని ఓడించి ఇంటికి పంపించింది.
లీగ్ దశలో చెలరేగిపోయిన కింగ్స్... తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లోని పేలవ ప్రదర్శననే సెమీస్‌లోనూ కొనసాగించి మూల్యం చెల్లించుకుంది. టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకోగా... రాజస్థాన్ రాయల్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఓపెనర్ రహానే (56 బంతుల్లో 70; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టుకు వెన్నెముకలా నిలిచి అర్ధసెంచరీ చేశాడు. వాట్సన్ (23 బంతుల్లో 32; 4 ఫోర్లు) రహానేకు అండగా నాణ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 39 బంతుల్లో 59 పరుగులు జోడించారు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో బ్రేవో మూడు వికెట్లు తీసి రాజస్థాన్‌ను నియంత్రించాడు.
సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 145 పరుగులు మాత్రమే చేసి ఓడింది. రైనా (23 బంతుల్లో 29; 4 ఫోర్లు) మినహా ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా విఫలం కావడంతో... చెన్నై 72 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. బౌలర్లు మోరిస్ (17 బంతుల్లో 26 నాటౌట్; 3 ఫోర్లు), అశ్విన్ (28 బంతుల్లో 46; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) చివర్లో పోరాడి ఎనిమిదో వికెట్‌కు 43 బంతుల్లోనే 73 పరుగులు జోడించినా ఫలితం లేకపోయింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ప్రవీణ్ తాంబె (3/10) చెన్నై స్టార్ లైనప్‌ను కట్టడి చేశాడు.
వారెవ్వా తాంబె
రాజస్థాన్ విజయంలో యువ రహానేది ఎంత కీలక పాత్రో... 42 సంవత్సరాల ప్రవీణ్ తాంబెది కూడా అంతే కీలక పాత్ర. చాంపియన్స్ లీగ్ సెమీఫైనల్లో చెన్నైలాంటి బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టు మీద నాలుగు ఓవర్లలో కేవలం 10 పరుగులు ఇచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు. ఏనాడూ రంజీ క్రికెట్ కూడా ఆడని తాంబె... ముంబైలోని కంగా లీగ్‌లో ప్రఖ్యాత స్పిన్నర్. అయినా ఏనాడు ఫస్ట్‌కాస్ల్ క్రికెట్ కూడా ఆడకుండానే రిటైర్‌మెంట్ దశకు వచ్చాడు. అలాంటి సమయంలో రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్‌లో ఆడే అవకాశం ఇచ్చింది.
స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారం తర్వాత రాజస్థాన్ జట్టులోని ప్రధాన స్పిన్నర్లు అజిత్ చండిలా, అంకిత్ చవాన్‌లపై నిషేధం పడింది. దీంతో చాంపియన్స్ లీగ్‌లో తాంబె మినహా ఆ జట్టుకు మరో స్పిన్నర్ లేడు. దీంతో అన్ని మ్యాచ్‌ల్లోనూ ఆడే అవకాశం లభించింది. దీనిని సద్వినియోగం చేసుకున్న ఈ వెటరన్ చెలరేగిపోయాడు. పేసర్లకు సహకారం లభించిన వికెట్‌పై కూడా మాయాజాలం చేశాడు. తనపై కెప్టెన్ ద్రవిడ్ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.
స్కోరు వివరాలు : రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్: ద్రవిడ్ (బి) మోరిస్ 5; రహానే (సి) మోహిత్ (బి) బ్రేవో 70; కూపర్ (సి) బద్రీనాథ్ (బి) మోహిత్ 14; సామ్సన్ (సి) అశ్విన్ (బి) హోల్డర్ 11; వాట్సన్ (సి) హోల్డర్ (బి) మోరిస్ 32; హాడ్జ్ (బి) హోల్డర్ 11; స్టువర్ట్ బిన్నీ (సి) జడేజా (బి) బ్రేవో 5; యాజ్ఞిక్ (సి) హోల్డర్ (బి) బ్రేవో 0; ఫాల్కనర్ నాటౌట్ 1; శుక్లా నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి) 159 వికెట్ల పతనం: 1-14; 2-29; 3-62; 4-121; 5-149; 6-155; 7-157; 8-157. బౌలింగ్: జడేజా 3-0-19-0; మోహిత్ 4-0-37-1; మోరిస్ 4-0-25-2; హోల్డర్ 4-0-35-2; బ్రేవో 4-0-26-3; అశ్విన్ 1-0-16-0.
చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: హస్సీ రనౌట్ 9; విజయ్ రనౌట్ 14; రైనా (సి) మేనరియా (సబ్) (బి) తాంబె 29; బద్రీనాథ్ (స్టం) యాజ్ఞిక్ (బి) తాంబె 8; ధోని ఎల్బీడబ్ల్యు (బి) శుక్లా 3; డ్వేన్ బ్రేవో ఎల్బీడబ్ల్యు (బి) తాంబె 3; జడేజా (సి) యాజ్ఞిక్ (బి) వాట్సన్ 2; మోరిస్ నాటౌట్ 26; అశ్విన్ (సి) బిన్నీ (బి) ఫాల్కనర్ 46; హోల్డర్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి) 145 వికెట్ల పతనం: 1-13; 2-33; 3-51; 4-54; 5-61; 6-70; 7-72; 8-145. బౌలింగ్: బిన్నీ 1-0-2-0; ఫాల్కనర్ 4-0-36-1; వాట్సన్ 4-0-34-1; రాహుల్ శుక్లా 3-0-21-1; కూపర్ 4-0-41-0; తాంబె 4-0-10-3.