రాజస్తాన్‌ గోపాల... గోపాల... బెంగళూరు గోవింద... గోవింద... | Rajasthan Royals beat Royal Challengers Bangalore by 30 runs | Sakshi
Sakshi News home page

రాజస్తాన్‌ గోపాల... గోపాల... బెంగళూరు గోవింద... గోవింద...

Published Sun, May 20 2018 4:57 AM | Last Updated on Sun, May 20 2018 4:44 PM

Rajasthan Royals beat Royal Challengers Bangalore by 30 runs - Sakshi

శ్రేయస్‌ గోపాల్‌ , రాహుల్‌ త్రిపాఠి

కనుచూపు మేరలో ప్లే ఆఫ్స్‌ బెర్త్‌... ఎదురుగా మరింత తేలికైన లక్ష్యం... ప్రత్యర్థి కూడా ప్రమాదకరమేమీ కాదు... పైగా జట్టు వరుస విజయాల ఊపులో ఉంది... అయినా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఓడింది! కాదుకాదు బ్యాట్స్‌మెన్‌ ‘ముందుకొచ్చి’ ఓడించారు! ఒకరా ఇద్దరా...? కెప్టెన్‌ కోహ్లి నుంచి మన్‌దీప్‌ సింగ్‌ వరకు ఏకంగా నలుగురు ఇలాగే ఆడి ముంచేశారు! తదుపరి దశకు వెళ్లే సువర్ణావకాశాన్ని కాలదన్నుకున్నారు! రాహుల్‌ త్రిపాఠి అజేయ బ్యాటింగ్, శ్రేయస్‌ గోపాల్‌ స్పిన్‌ కనికట్టు, క్లాసెన్‌ కీపింగ్‌ నైపుణ్యంతో రాజస్తాన్‌ రాయల్స్‌ చక్కటి విజయాన్ని నమోదు చేసుకొని ప్లే ఆఫ్‌ ఆశలు నిలబెట్టుకుంది
 
జైపూర్‌: విధ్వంసక ఇన్నింగ్స్‌లతో ఈ సీజన్‌లో జట్టును నిలబెట్టిన ఓపెనర్‌ జాస్‌ బట్లర్, అంతో ఇంతో ఆడిన ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ లేకున్నా రాజస్తాన్‌ రాయల్స్‌ అద్భుతం చేసింది. బ్యాటింగ్‌లో మోస్తరుగానే ఆడినా... ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ లెగ్‌ స్పిన్నర్‌ శ్రేయస్‌ గోపాల్‌ (4/16) బౌలింగ్‌ మాయాజాలంతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరును చుట్టేసింది. రెండు జట్ల మధ్య శనివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న రాజస్తాన్‌... ఓపెనర్‌ రాహుల్‌ త్రిపాఠి (58 బంతుల్లో 80 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ ఇన్నింగ్స్‌కు కెప్టెన్‌ అజింక్య రహానే (31 బంతుల్లో 33; 3 ఫోర్లు), హెన్రిచ్‌ క్లాసెన్‌ (21 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్‌) అండగా నిలవడంతో నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. పేసర్‌ ఉమేశ్‌ (3/25) చక్కటి ప్రదర్శన కనబరిచాడు. ఛేదనలో డివిలియర్స్‌ (35 బంతుల్లో 53; 7 ఫోర్లు), ఓపెనర్‌ పార్థివ్‌ (21 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మినహా మరే బ్యాట్స్‌మెన్‌ ప్రతిఘటన చూపకపోవడంతో బెంగ ళూరు 19.2 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటైంది. 30 పరుగులతో ఓడి లీగ్‌ నుంచి నిష్క్రమించింది.

త్రిపాఠినే ఘనాపాటి...
రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌కు రాహుల్‌ త్రిపాఠి ఆసాంతం ఇరుసులా నిలిచాడు. పరిస్థితుల రీత్యా అతడితో పాటు ఓపెనింగ్‌కు దిగిన జోఫ్రా ఆర్చర్‌ (0) ఉమేశ్‌ ధాటికి ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన రహానే... త్రిపాఠికి సహకారం అందించాడు. పవర్‌ ప్లే పూర్తయ్యేసరికి స్కోరు 45/1. చూడచక్కని షాట్లు కొట్టిన త్రిపాఠి 38 బంతుల్లో అర్ధశతకం అందుకున్నాడు. రెండో వికెట్‌కు 99 పరుగులు జోడించి సంయమనంతో సాగుతున్న ఈ జోడీని... రహానేను ఎల్బీగా అవుట్‌ చేయడం ద్వారా ఉమేశ్‌ విడదీశాడు. మరుసటి బంతికే సంజు శామ్సన్‌ (0)నూ ఔట్‌ చేశాడు. దీంతో రాయల్స్‌ ఒక్కసారిగా కష్టాల్లో పడి ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది.  

బ్యాట్స్‌మెన్‌ ముంచేశారు...
తక్కువ లక్ష్యాన్ని బెంగళూరు అలవోకగా ఛేదించేస్తుందని అందరు అనుకుంటుండగా... అందుకు భిన్నంగా ఆడిందా జట్టు. ఆర్చర్‌ బౌలింగ్‌లో అప్పర్‌ కట్‌లతో పార్థివ్‌ రెండు చక్కటి సిక్స్‌లు కొట్టడంతో ఆ జట్టు ఇన్నింగ్స్‌ ఆశావహంగానే ప్రారంభమైంది. అవతలి ఎండ్‌లో గౌతమ్‌ బౌలింగ్‌లో పలుసార్లు బీట్‌ అయిన కోహ్లి (4)... ముందుకొచ్చి ఆడబోయి బౌల్డయ్యాడు. పవర్‌ ప్లే అనంతరం ఆర్‌సీబీ 55/1తో గెలుపు దిశగా ఉన్నట్లు కనిపించింది. అయితే, గోపాల్‌ బంతిని పుల్‌ చేయబోయిన పార్థివ్‌... క్లాసెన్‌ మెరుపు కీపింగ్‌కు స్టంపౌటయ్యాడు. మొయిన్‌ అలీ (1) అతడికే రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చాడు. మన్‌దీప్‌ సింగ్‌ (3)నూ గోపాల్‌–క్లాసెన్‌ ద్వయమే స్టంపౌట్‌తో పెవిలియన్‌ పంపించింది. మరోవైపు ఏబీ 31 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకోగా, గ్రాండ్‌హోమ్‌ (2) స్లిప్‌లో రహానేకు క్యాచ్‌ ఇచ్చాడు. జట్టు ఒక్కసారిగా 96/5కు పడిపోయింది. ఆ తర్వాత డివిలియర్స్‌ కూడా క్రీజు వదిలి ముందుకురావడం... క్లాసెన్‌ వికెట్లను గిరాటేసేయడంతో ఆర్‌సీబీ పనైపోయింది.

మూడు జట్ల ‘రేసు’వత్తరం
హైదరాబాద్‌పై విజయంతో కోల్‌కతా ప్లే ఆఫ్స్‌ మూడో బెర్త్‌ ఎగరేసుకుపోయింది. మిగిలింది ఒక్క స్థానం. దీనికోసం ముంబై, రాజస్తాన్, పంజాబ్‌ పోటీపడుతున్నాయి. బెంగళూరుపై విజయంతో రాజస్తాన్‌ ఖాతాలో 14 పాయింట్లున్నాయి. ఆదివారం ఢిల్లీపై ముంబై, చెన్నై మీద పంజాబ్‌ నెగ్గితే మూడు జట్ల పాయింట్లు సమమవుతాయి. అయినా, రన్‌రేట్‌లో పైచేయిగా ఉన్నందున ముంబైనే ప్లే ఆఫ్స్‌ చేరుతుంది. ఢిల్లీ చేతిలో ఓడితే మాత్రం ఇంటి బాట పడుతుంది. అప్పుడు రాజస్తాన్‌ను వెనక్కు నెట్టేలా రన్‌రేట్‌ లెక్కలను సరిచూసుకుంటూ చెన్నైపై పంజాబ్‌ గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ పంజాబ్‌ ఓడితే రాయల్స్‌కు ప్లే ఆఫ్‌కు దారిచ్చినట్లవుతుంది.  

స్కోరు వివరాలు
రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ త్రిపాఠి నాటౌట్‌ 80; ఆర్చర్‌ (సి) పార్థివ్‌ (బి) ఉమేశ్‌ 0; రహానే ఎల్బీడబ్ల్యూ (బి) ఉమేశ్‌ 33; శామ్సన్‌ (సి) మొయిన్‌ అలీ (బి) ఉమేశ్‌ 0; క్లాసెన్‌ (సి) మొయిన్‌ అలీ (బి) సిరాజ్‌ 32; కృష్ణప్ప గౌతమ్‌ రనౌట్‌ 14; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 164.

వికెట్ల పతనం: 1–2, 2–101, 3–101, 4–149, 5–164.  బౌలింగ్‌: చహల్‌ 4–0–26–0, ఉమేశ్‌ 4–1–25–3, మొయిన్‌ అలీ 2–0–19–0, సౌతీ 4–0–37–0, సిరాజ్‌ 4–0–33–1, గ్రాండ్‌హోమ్‌ 2–0–23–0.

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి (బి) గౌతమ్‌ 4; పార్థివ్‌ (స్టంప్డ్‌) క్లాసెన్‌ (బి) శ్రేయస్‌ గోపాల్‌ 33; డివిలియర్స్‌ (స్టంప్డ్‌) క్లాసెన్‌ (బి) గోపాల్‌ 53; మొయిన్‌ అలీ (సి అండ్‌ బి) గోపాల్‌ 1; మన్‌దీప్‌ సింగ్‌ (స్టంప్డ్‌) క్లాసెన్‌ (బి) గోపాల్‌ 3; గ్రాండ్‌హోమ్‌ (సి) రహానే (బి) సోధి 2; సర్ఫరాజ్‌ (సి) క్లాసెన్‌ (బి) లాలిన్‌ 7; సౌతీ (సి) గౌతమ్‌ (బి) ఉనాద్కట్‌ 14; ఉమేశ్‌ (బి) లాలిన్‌ 0; సిరాజ్‌ (సి) గౌతమ్‌ (బి) ఉనాద్కట్‌ 14; చహల్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (19.2 ఓవర్లలో ఆలౌట్‌) 134.  

వికెట్ల పతనం: 1–20, 2–75, 3–77, 4–85, 5–96, 6–98, 7–108, 8–108, 9–128, 10–134. బౌలింగ్‌: గౌతమ్‌ 2–0–6–1, ఆర్చర్‌ 4–0–37–0, లాలిన్‌ 2–0–15–2, ఉనాద్కట్‌ 3.2–0–27–2, గోపాల్‌ 4–0–16–4, సోధి 4–0–31–1.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement