బెంగళూర్ పై రాజస్థాన్ రాయల్స్ విజయం
అబుదాబి: ఐపీఎల్ 7 టోర్నీ ఆరంభంలో ఆకట్టుకున్న బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ వరుస ఓటములతో సతమతమవుతోంది. ఈ రోజు రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో బెంగళూర్ రాయల్స్ ఛాలెంజర్స్ ఆరు వికెట్ల తేడాతో ఘోర ఓటమి మూటగట్టుకుంది. ఏమాత్రం పోరాడని బెంగళూర్ ఇటు బ్యాటింగ్ లోనూ, అటు బౌలింగ్ లోనూ విఫలమై ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసి బెంగళూర్ 71 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించి ముందుగానే ఓటమిని ఖాయం చేసుకుంది. ఈ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన రాజస్థాన్ నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లు అజాంకే రహానే(23) పరుగులు చేసి ఫర్వాలేదనిపించినా, కరుణ్ నాయర్ (8) పరుగులు మాత్రమే చేశాడు. అనంతరం శ్యాంసన్ (2) పరుగులకే పెవిలియన్ కు చేరడంతో రాజస్థాన్ కాస్త తడబడినట్టి కనిపించింది. కాగా మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లు వాట్సన్(24), అభిషేక్ నాయర్(11) పరుగులు చేసి జట్టుకు విజయాన్నందించారు. కేవలం 12.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ మరో గెలుపును తన ఖాతాలో వేసుకుంది.
మొన్న కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో తృటిలో విజయాన్ని చేజార్చుకున్న బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ ఇంకా ఆ షాక్ నుంచి తేరుకున్నట్టు లేదు.టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూర్ ఆటగాళ్లు 70 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ప్రత్యర్థికి నిర్దేశించింది. ఓపెనర్లు పార్థీవ్ పటేల్ (1), తకావాలే (0)కు పరిమితమై ఆదిలోనే బెంగళూర్ ను కష్టాల్లోకి నెట్టారు. అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లి(21)పరుగులు చేసి జట్టుకు మరమ్మత్తులు చేశాడు. కాగా యువరాజ్ సింగ్(3),డివిలియర్స్(0),రానా(3), మోర్కెల్ (7) ఇలా వరుసుగా క్యూకట్టడంతో బెంగళూర్ బ్యాటింగ్ లో చేతులెత్తేసింది. చివర్లో స్టార్క్(18), రాంపాల్ (13) పరుగులు చేయడంతో బెంగళూర్ 15 ఓవర్లలో 70 పరుగులకే పరిమితమైంది. బెంగళూర్ ఆటగాళ్లలో 8మంది సింగిల్ డిజిట్ కే పరిమితమవడం గమనార్హం. రాజస్థాన్ బౌలర్లలో టాంబే నాలుగు వికెట్లు తీసి బెంగళూర్ పతనాన్ని శాసించగా, రిచర్డ్ సన్ కు రెండు వికెట్లు దక్కాయి.