మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సంజు
రాజస్తాన్ రాయల్స్ జూలు విదిల్చింది. సంజు శామ్సన్ సిక్సర్లతో చిన్నస్వామి స్టేడియం హోరెత్తగా... బెంగళూరు రాయల్ చాలెంజర్స్ బెంబేలెత్తిపోయింది. ఘనమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నా రికార్డు లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది.
బెంగళూరు: గత మ్యాచ్‌లో వరుణుడి దయతో ఢిల్లీపై గెలిచిన రాజస్తాన్ రాయల్స్... ఈసారి బెంగళూరును దాని సొంతగడ్డపైనే సాధికారికంగా ఓడించింది. ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు సంజు శామ్సన్ (45 బంతుల్లో 92 నాటౌట్; 2 ఫోర్లు, 10 సిక్స్‌లు) విధ్వంసక ఇన్నింగ్స్, కెప్టెన్ రహానే (20 బంతుల్లో 36; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. ఛేదనలో కెప్టెన్ విరాట్ కోహ్లి (30 బంతుల్లో 57; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), మన్‌దీప్ సింగ్ (25 బంతుల్లో 47; 6 ఫోర్లు, 1 సిక్స్), వాషింగ్టన్ సుందర్ (19 బంతుల్లో 35; 1 ఫోర్, 3 సిక్స్‌లు) మినహా మిగతావారు విఫలమవడంతో బెంగళూరు ఆరు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసి ఓటమి పాలైంది. శ్రేయస్ గోపాల్ (2/22) పొదుపైన బౌలింగ్‌తో పాటు కీలక వికెట్లు తీసి ప్రత్యర్థిని నిలువరించాడు. రాజస్తాన్ ఇన్నింగ్స్‌కు రహానే దూకుడైన ఆరంభాన్నిచ్చాడు. అయితే... మరో ఓపెనర్ షార్ట్ (11) త్వరగా వెనుదిరగడమే బెంగళూరుకు శాపమైంది. క్రీజులోకి వచ్చిన సంజు ఉప్పెనలా విరుచుకుపడ్డాడు. సిక్స్‌లతో స్కోరు బోర్డును పరుగెత్తించాడు. అర్ధ సెంచరీకి 34 బంతులు ఆడిన అతడు మిగతా 42 పరుగులను 11 బంతుల్లోనే చేశాడంటేనే ఎంత జోరుగా ఆడాడో తెలుస్తోంది. సంజు ఇన్నింగ్స్‌లో 71 పరుగుల వరకు ఒక్క ఫోర్ కూడా లేకపోవడం విశేషం. ఈ క్రమంలో అతడికి స్టోక్స్ (21 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్), బట్లర్ (14 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ త్రిపాఠి (5 బంతుల్లో 14; 1 ఫోర్, 1 సిక్స్) సహకారం అందించారు.
బాదలేకపోయారు...
హేమాహేమీలైన బ్యాట్స్‌మెన్‌కు తోడు చిన్న మైదానం కావడంతో ఛేదనపై బెంగళూరు ఆశలకు తొలి ఓవర్లోనే గండిపడింది. కె.గౌతమ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన మెకల్లమ్ (4)... స్టోక్స్ చక్కటి క్యాచ్‌కు వెనుదిరిగాడు. డికాక్ (26) తోడుగా కోహ్లి రన్‌రేట్ పడిపోకుండా చూశాడు. కానీ అతడితో పాటు డివిలియర్స్ (20; 1 ఫోర్, 1 సిక్స్) స్వల్ప వ్యవధిలో వెనుదిరగడంతో దెబ్బపడింది. ఈ దశలో మన్‌దీప్, సుందర్ 28 బంతుల్లోనే 56 పరుగులు జోడించారు. అప్పటికే పరిస్థితి చేజారిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment