
అడిలైడ్: శ్రీలంక ఫాస్ట్ బౌలర్ కసున్ రజిత చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో రజిత నాలుగు ఓవర్లు బౌలింగ్ వేసి 75 పరుగులిచ్చాడు. ఒక్క నోబాల్ సాయంతో భారీ పరుగుల్ని ఇచ్చాడు. కనీసం వికెట్ కూడా తీయకుండానే చెత్త గణాంకాల్ని నమోదు చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఇదే అత్యంత చెత్త ప్రదర్శనగా లిఖించబడింది. ఇప్పటివరకూ అంతర్జాతీయ టీ20ల్లో ఏ ఒక్క బౌలర్ 70కు మించి పరుగులు ఇవ్వకపోగా రజిత మాత్రం 75 పరుగులతో అపప్రథను సొంతం చేసుకున్నాడు. 18.75 ఎకానమితో రజిత చెత్త రికార్డును నమోదు చేశాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో 11 పరుగులు ఇచ్చిన రజిత.. ఐదో ఓవర్‌లో 21 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక 10 ఓవర్‌లో 25 పరుగులు.. 18 ఓవర్‌లో 18 పరుగులు ఇచ్చుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. 56 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో శతకం పూర్తి చేసుకున్నాడు. ఆది నుంచి శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డ వార్నర్ చివరి వరకూ తన దూకుడు కొనసాగించాడు. కెప్టెన్ అరోన్ ఫించ్‌తో కలిసి భారీ భాగస్వామ్యం నమోదు చేశాడు. ఈ జోడి తొలి వికెట్‌కు 122 పరుగులు చేసిన తర్వాత ఫించ్ ఔటయ్యాడు. ఆపై మ్యాక్స్‌వెల్(62; 28 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. వీరిద్దరూ 107 పరుగుల భాగస్వామ్యం సాధించడంతో ఆసీస్ భారీ స్కోరు సాధించింది. ఈ ముగ్గురూ ధాటికి రజిత తన బౌలింగ్ లయను కోల్పోయి చెత్త ప్రదర్శనను తన ఖాతాలో వేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment