
'అది నిజంగానే అవమానకరం'
కరాచీ:గత కొన్ని రోజుల క్రితం ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్లో భాగంగా రోజర్ ఫెడరర్-రఫెల్ నాదల్ మధ్య జరిగిన ఫైనల్ పోరును పాకిస్తాన్ లో ప్రసారం చేయకపోవడంపై ఆ దేశ దిగ్గజ క్రికెటర్ రమీజ్ రాజా మండిపడ్డాడు. తమ దేశ కేబుల్ నెట్ వర్క్ ఏ ఛానల్లో కూడా ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్ మ్యాచ్ రాకపోవడాన్ని రమీజ్ తీవ్రంగా తప్పుబట్టాడు. 'ఇది నిజంగా నమ్మశక్యంగా లేదు. రోజర్ ఫెడరర్-నాదల్ లైవ్ మ్యాచ్ పాక్ లో రాకపోవడం బాధాకరం. ఆ క్రీడ మనకు స్నేహ పూర్వక క్రీడ కాకపోవచ్చు. కానీ ఒక క్రీడా దేశంగా ఉన్న మనం మరొక క్రీడను కనీసం ఛానెల్ ద్వారా కూడా ప్రమోట్ చేయకపోవడం అవమానకరం' అని రమీజ్ రాజా ధ్వజమెత్తాడు.
రమీజ్ కు మరికొంతమంది పాక్ అభిమానులు మద్దతుగా నిలిచారు. పదే పదే సిరీస్లను కోల్పోయిన మ్యాచ్లను ప్రసారం చేసే పీటీవీ..టెన్నిస్ ను మాత్రం అసలు పట్టించుకోదని హుస్సేన్ అనే ఒక నెటిజన్ విమర్శించాడు. ఇక్కడ మన సొంత ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తున్నమనం ఎదుగుదలను కనీసం కోరుకోవడం లేదని హాసన్ అనే మరో నెటిజన్ ఎద్దేవా చేశాడు. హోరాహోరాగా సాగిన ఆ ఫైనల్ పోరులో నాదల్ ను ఫెడరర్ ఓడించి టైటిల్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.