
ఐసీసీ ఆంతర్యమేమిటో?
కరాచీ: దక్షిణాఫ్రికా-టీమిండియాల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ లో్ భాగంగా చివరి రెండు వన్డేలకు పాకిస్థాన్ అంపైర్ అలీమ్ దార్ ను ఐసీసీ వెనక్కి పిలవడంపై ఆ దేశ మాజీ క్రికెట్ కెప్టెన్ రమీజ్ రాజా ఆశ్యర్యం వ్యక్తం చేశాడు. అసలు అలీమ్ దార్ ను ఎందుకు తప్పించారో తనకు తెలియడం లేదన్నాడు. ఒకవేళ భద్రతాపరమైన కారణాలు ఉంటే భారత్ క్రికెట్ బోర్డును అదనపు సెక్యూరిటీ అడిగితే సరిపోయేదని రమీజ్ తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి ఆంతర్యం ఏమిటన్నది గందరగోళంగానే ఉందన్నాడు.
గత సోమవారం ముంబైలోని బీసీసీఐ కార్యాలయాన్ని శివసేన కార్యకర్తలు ముట్టడించిన నేపథ్యంలో ఆ దేశ అంపైర్ అలీమ్ దార్ ను ఐసీసీ వెనక్క పిలిచిన సంగతి తెలిసిందే. భద్రతా కారణాల దృష్ట్యా అంపైర్ అలీమ్ ను తప్పించడం.. ఆపై వసీం అక్రమ్ , షోయబ్ అక్తర్ లు కూడా ఇంటిముఖం పట్టారు. దీనిలో భాగంగా అలీమ్ దార్ స్థానంలో భారత్ కు చెందిన సుందరన్ రవిని చివరి రెండు వన్డేలకు అంపైర్ గా నియమించారు.