సౌరాష్ట్ర 206/5  | Ranji Trophy Final Bengal First Day Match At Rajkot | Sakshi
Sakshi News home page

సౌరాష్ట్ర 206/5 

Published Tue, Mar 10 2020 1:58 AM | Last Updated on Tue, Mar 10 2020 1:58 AM

Ranji Trophy Final Bengal First Day Match At Rajkot - Sakshi

రాజ్‌కోట్‌: తొలిసారి రంజీ ట్రోఫీ చాంపియన్‌గా అవతరించాలని ఆశిస్తున్న సౌరాష్ట్ర జట్టు శుభారంభాన్ని అనుకూలంగా మల్చుకోలేకపోయింది. మాజీ చాంపియన్‌ బెంగాల్‌తో సోమవారం మొదలైన రంజీ ట్రోఫీ ఫైనల్లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 80.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 206 పరుగులు సాధించింది. భారత స్టార్‌ క్రికెటర్, సౌరాష్ట్ర బ్యాట్స్‌మన్‌ చతేశ్వర్‌ పుజారా జ్వరంతో బాధపడుతుండటంతో... ఆరో నంబర్‌ స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. 24 బంతులు ఆడి ఐదు పరుగులు చేశాక అస్వస్థతతో రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. రెండో రోజు పుజారా బ్యాటింగ్‌కు వస్తాడని సౌరాష్ట్ర కెప్టెన్‌ జైదేవ్‌ ఉనాద్కట్‌ తెలిపాడు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సౌరాష్ట్రకు ఓపెనర్లు హార్విక్‌ దేశాయ్‌ (111 బంతుల్లో 38; 5 ఫోర్లు), అవీ బారోట్‌ (142 బంతుల్లో 54; 6 ఫోర్లు) శుభారంభం ఇచ్చారు.

బెంగాల్‌ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ క్రీజులో నిలదొక్కుకున్న ఈ జంట తొలి వికెట్‌కు 82 పరుగులు జోడించింది. హార్విక్‌ను అవుట్‌ చేసి స్పిన్నర్‌ షాబాజ్‌ అహ్మద్‌ ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న అవీ బారోట్‌ను ఆకాశ్‌దీప్‌ పెవిలియన్‌కు పంపించాడు. ఆ తర్వాత విశ్వరాజ్‌సింగ్‌ జడేజా (92 బంతుల్లో 54; 7 ఫోర్లు), అర్పిత్‌ (94 బంతుల్లో 29 బ్యాటింగ్‌; 3 ఫోర్లు) మూడో వికెట్‌కు 50 పరుగులు జత చేయడంతో సౌరాష్ట్ర స్కోరు 150 దాటింది. చివరి సెషన్‌లో బెంగాల్‌ పేస్‌ బౌలర్‌ ఆకాశ్‌దీప్‌ విజృంభించడంతో సౌరాష్ట్ర మూడు వికెట్లను కోల్పోయింది.

సంక్షిప్త స్కోర్లు 
సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌: 206/5 (80.5 ఓవర్లలో) (హార్విక్‌ దేశాయ్‌ 38, అవీ బారోట్‌ 54, విశ్వరాజ్‌సింగ్‌ జడేజా 54, అర్పిత్‌ 29 బ్యాటింగ్, షెల్డన్‌ జాక్సన్‌ 14, చేతన్‌ సకారియా 4, ఆకాశ్‌దీప్‌ 3/41); బెంగాల్‌తో మ్యాచ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement