కర్ణాటక చేతుల్లోనే...
సాక్షి, హైదరాబాద్: తొలి ఇన్నింగ్స్‌లో పేలవంగా ఆడిన మహారాష్ట్ర రంజీ ట్రోఫీ ఫైనల్లో అందుకు తగిన మూల్యం చెల్లించుకుంటోంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు మెరుగైన ఆటతీరు కనబర్చినా ఇప్పటికీ ప్రత్యర్థి కర్ణాటక జట్టే టైటిల్ నెగ్గే అవకాశాలు ఉన్నాయి. రాజీవ్‌గాంధీ స్టేడియంలో కర్ణాటకతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో నాలుగో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి మహారాష్ట్ర తమ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. కేదార్ జాదవ్ (135 బంతుల్లో 112; 10 ఫోర్లు) చక్కటి సెంచరీ సాధించగా...అంకిత్ బావ్నే (115 బంతుల్లో 61; 4 ఫోర్లు) రాణించాడు.
జాదవ్ ధాటిగా బ్యాటింగ్ చేయడంతో పాటు బావ్నే, ఖురానా (37; 1 ఫోర్) సమయోచిత ఆటతో ఒక దశలో మహారాష్ట్ర మెరుగైన స్థితిలోనే ఉంది. అయితే చివర్లో ఆరు పరుగుల వ్యవధిలో ఆ జట్టు రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ప్రస్తు తం మహారాష్ట్ర చేతిలో 4 వికెట్లు ఉన్నాయి. 62 పరుగులు మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఆ జట్టు ఆదివారం మరికొన్ని పరుగులు జత చేసినా... చివరి రోజు కర్ణాటకకు ఈ లక్ష్యాన్ని ఛేదించడం కష్టం కాబోదు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 474/7తో ఆట ప్రారంభించిన కర్ణాటక 515 పరుగులకు ఆలౌటైంది.
కీలక భాగస్వామ్యాలు...
తొలి ఇన్నింగ్స్‌లో మాదిరిగానే రెండో ఇన్నింగ్స్‌లోనూ మహారాష్ట్రకు శుభారంభం లభించలేదు. ఆ జట్టు మొదట్లోనే ఖడీవాలే (9) వికెట్ కోల్పోయింది. అయినా సరే ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా జట్టు ఆసాంతం వేగంగా ఆడే ప్రయత్నం చేసింది. విజయ్ జోల్ (51 బంతుల్లో 31; 4 ఫోర్లు) కొద్దిసేపు షాట్లు ఆడగా, బావ్నే నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. వినయ్ బౌలింగ్‌లో జోల్ వెనుదిరిగిన అనంతరం జాదవ్ క్రీజ్‌లోకి వచ్చాడు. ఈ దశలో బావ్నే, జాదవ్ కలిసి చక్కటి భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 118 పరుగులు జత చేశారు. అయితే లెగ్‌స్పిన్నర్ గోపాల్ తన వరుస ఓవర్లలో బావ్నే, అతీత్కర్ (0)లను అవుట్ చేసి మహారాష్ట్రను దెబ్బ తీశాడు.
ఈ దశలో జాదవ్, ఖురానాతో కలిసి ఐదో వికెట్‌కు 88 పరుగులు జత చేశాడు. ఇదే క్రమంలో 118 బంతుల్లో జాదవ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరి కొద్ది సేపట్లో ఆట ముగుస్తుందనగా వినయ్ కుమార్ తన వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీసి మహారాష్ట్రను దెబ్బ తీశా డు. జాదవ్‌ను అవుట్ చేసి వినయ్ కుమార్ తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 300వ వికెట్‌ను సొంతం చేసుకున్నాడు.
స్కోరు వివరాలు
మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్: 305; కర్ణాటక తొలి ఇన్నిం గ్స్: 515; మహారాష్ట్ర రెండో ఇన్నింగ్స్: ఖడీవాలే (సి) సతీశ్ (బి) వినయ్ 9; జోల్ (సి) గౌతమ్ (బి) వినయ్ 31; బావ్నే (స్టంప్డ్) గౌతమ్ (బి) గోపాల్ 61; జాదవ్ (సి) ఉతప్ప (బి) వినయ్ 112; అతీత్కర్ (సి) వర్మ (బి) గోపాల్ 0; ఖురానా (సి) ఉతప్ప (బి) వినయ్ 37; మొత్వాని (బ్యాటింగ్) 3; ముండే (బ్యాటింగ్) 3; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (68 ఓవర్లలో 6 వికెట్లకు) 272
వికెట్ల పతనం: 1-18; 2-54; 3-172; 4-174; 5-262; 6-268
బౌలింగ్: వినయ్ 21-1-84-4; మిథున్ 16-1-47-0; అరవింద్ 15-0-49-0; ఉతప్ప 2-0-15-0; పాండే 2-0-14-0; గోపాల్ 10-0-37-2; వర్మ 2-0-20-0.