చరిత్ర సృష్టించిన ఆంధ్ర
తొలిసారి ముంబైపై ఆధిక్యం
రంజీ మాజీ చాంపియన్‌తో మ్యాచ్ ‘డ్రా’
ఆరు వికెట్లతో రాణించిన అయ్యప్ప
విజయనగరం: మొహమ్మద్ కైఫ్ నేతృత్వంలోని ఆంధ్ర క్రికెట్ జట్టు అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంది. తమ రంజీ చరిత్రలో తొలిసారిగా పటిష్ట ముంబైపై తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని దక్కించుకుంది. గ్రూప్ ‘బి’లో జరిగిన ఈ మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా ఆంధ్రకు మూడు పాయింట్లు, మాజీ చాంపియన్ ముంబైకి ఓ పాయింట్ దక్కింది. చివరి రోజు ఆదివారం ఆంధ్ర పేసర్ బండారు అయ్యప్ప ఆరు వికెట్లతో హడలెత్తించడంతో ముంబై తమ తొలి ఇన్నింగ్స్‌లో 91.5 ఓవర్లలో 237 పరుగులకు ఆలౌటైంది. సిద్ధేశ్ లాడ్ (163 బంతుల్లో 86; 12 ఫోర్లు; 1 సిక్స్) టాప్ స్కోరర్. 37 పరుగుల వ్యవధిలో చివరి నాలుగు వికెట్లను అయ్యప్ప పడగొట్టడంతో ఆంధ్రకు 7 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఆ తర్వాత తమ రెండో ఇన్నింగ్స్‌లో ఆంధ్ర ఆట ముగిసే సమయానికి 65 ఓవర్లలో 3 వికెట్లకు 176 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రశాంత్ కుమార్ (106 బంతుల్లో 59; 10 ఫోర్లు; 1 సిక్స్), కైఫ్ (135 బంతుల్లో 49 నాటౌట్; 7 ఫోర్లు) రాణించారు. ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులు చేసింది.
గోవాకు మూడు పాయింట్లు
గోవా: హైదరాబాద్, గోవా జట్ల మధ్య జరిగిన రంజీ మ్యాచ్‌కు చివరి రోజు వర్షం అడ్డంకిగా మారింది. దీంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. అయితే 100 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా గోవా జట్టుకు మూడు పాయింట్లు లభించగా, హైదరాబాద్‌కు ఓ పాయింట్ దక్కింది. ఆదివారం చివరి రోజు 349/5 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన గోవా వర్షం కురిసే సమయానికి 140.4 ఓవర్లలో ఏడు వికెట్లకు 425 పరుగులు చేసింది. షగున్ కామత్ (286 బంతుల్లో 109; 11 ఫోర్లు; 1 సిక్స్) శతకం సాధించాడు. అంతకుముందు హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులు చేసింది.