దూసుకుపోతున్న కౌశల్-గిరీశ్ జంట | Rapid Kaushal - girish Team | Sakshi
Sakshi News home page

దూసుకుపోతున్న కౌశల్-గిరీశ్ జంట

Published Wed, Aug 7 2013 1:27 AM | Last Updated on Fri, Sep 1 2017 9:41 PM

Rapid Kaushal - girish Team

సాక్షి, హైదరాబాద్: ఇన్‌లాండ్ జాతీయ హోబి సెయిలింగ్ చాంపియన్‌షిప్‌లో ఆర్టిలరీ వాటర్ స్పోర్ట్స్ అసోసియేషన్ (ఏడబ్ల్యూఎస్‌ఏ) జోడి కౌశల్ కుమార్ యాదవ్-ఎం. గిరీశ్ దూసుకుపోతోంది. ఈవెంట్ రెండో రోజు మంగళవారం మొత్తం ఆరు రేస్‌లు జరిగాయి. ఇందులో ఈ జంట రెండింటిలో విజేతగా నిలిచింది.
 
 మరో రెండు రేస్‌లలో కౌశల్-గిరీశ్ రెండో స్థానంలో నిలిచారు. ఓవరాల్‌గా పది రేస్‌లు ముగిసే సరికి 14 పాయింట్లతో ఈ జంట ఆధిక్యంలో కొనసాగుతోంది. ఏడబ్ల్యూఎస్‌ఏకే చెందిన కె. యాకోబు-రాజీవ్ కుమార్ జంట మొత్తం 21 పాయింట్లతో రెండో స్థానంలో నిలబడింది. ఐదో రేస్‌ను గెలుచుకున్న ఈ జోడి ఆరు, ఏడు రేసుల్లో రెండో స్థానం సాధించింది. చాంపియన్‌షిప్‌లో రెండో రోజు ఎక్కువ భాగం 6-8 నాట్స్ వేగంతో గాలి వీచింది. కొన్ని సార్లు మాత్రం ఇది 8-10 నాట్స్‌కు పెరిగింది.
 
 చాంపియన్‌షిప్ రెండో రోజు ఫలితాలు:
 రేస్ 5: ఆరంభంనుంచి యాకోబు-రాజీవ్ ముందంజలో ఉన్నారు. ఏ దశలోనూ పోటీని ఎదుర్కోకుండా రేస్‌ను గెలుచుకున్నారు. కౌశల్-గిరీశ్‌కు రెండో స్థానం దక్కింది.
  రేస్ 6: ఈ రేస్‌లో మొదటి మూడు లెగ్‌ల పాటు పీపీ ముత్తు-నరేంద్ర సింగ్ జోడి ఆధిక్యంలోకి దూసుకుపోయింది. ఆ సమయంలో ఏడో స్థానంలో ఉన్న కౌశల్ టీమ్ ఒక్కసారిగా దూసుకొచ్చింది. నాలుగు లెగ్‌లు ముగిసే సరికి రెండో స్థానంలోకి వచ్చిన ఈ జంట చివరకు విజేతగా నిలిచింది.
 
 రేస్ 7: సమల్ ప్రధాన్-రాహుల్ రాయ్ (ఐఎన్‌డబ్ల్యూటీసీ)కి విజయం దక్కింది. రెండో లెగ్‌లో మినహా రేస్ మొత్తం ఈ జంట ముందంజలోనే ఉంది. రెండో స్థానంలో నిలిచిన యాకోబు జోడికంటే నిమిషం ముందుగా సమల్ టీమ్ లక్ష్యం చేరింది.
 
 రేస్ 8: తొలి రెండు లెగ్‌ల వరకు మూడో స్థానంలో ఉన్న కౌశల్-గిరీశ్ తర్వాత దూసుకుపోయి విజేతగా నిలిచారు. చివరి లెగ్‌కంటే ముందు వరకు ఆధిక్యంలో ఉన్న సమల్-రాహుల్ జంట అనూహ్యంగా ఓటమిపాలైంది. యాకోబు జట్టు ఆరో స్థానంతో సరిపెట్టుకుంది.
 రేస్ 9: ఈ రేస్‌ను ఇమోలెమ్‌నాక్-శేఖర్ యాదవ్ (ఐఎన్‌డబ్ల్యూటీసీ) గెలుచుకున్నారు. తొలి లెగ్‌నుంచి రేస్ ముగిసే వరకు వీరు ముందంజలోనే ఉన్నారు.
 
 రేస్ 10: ఐదో లెగ్ వరకు కౌశల్-గిరీశ్ ఆధిక్యంలోనే ఉన్నారు. అయితే కమలేశ్ పటేల్-యూబీ రావన్‌కర్ (ఏవైఎన్) ఆఖరి లెగ్‌లో దూసుకుపోయి విజేతగా నిలవడం విశేషం. కౌశల్-గిరీశ్‌కు రెండో స్థానం దక్కింది. మరో వైపు యాకోబు-రాజీవ్ ‘ఫౌల్’ స్టార్ట్ చేయడంతో వారు రేస్‌లను మళ్లీ ఆరంభంనుంచి మొదలు పెట్టాల్సి వచ్చింది. ఫలితంగా ఈ జంట 13వ స్థానానికి దిగజారింది.
 

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement