పర్యాటకులకు పండగే... | 'Ganesh Sagar' work on the creation | Sakshi
Sakshi News home page

పర్యాటకులకు పండగే...

Published Sat, Dec 6 2014 11:33 PM | Last Updated on Tue, Aug 14 2018 10:51 AM

పర్యాటకులకు పండగే... - Sakshi

పర్యాటకులకు పండగే...

‘వినాయకసాగర్ ’ ఏర్పాటుకు కసరత్తు
క్షేత్రస్థాయి పరిశీలనలో అధికారులు
ఈనెల 9న సీఎంకు సమగ్ర నివేదిక

 
వాటర్ స్పోర్ట్స్.. టాయ్‌ట్రైన్ ఇలా పర్యాటకులను ఆకట్టుకునేలా వినాయక్ సాగర్‌ను అధికారులు తీర్చిదిద్దనున్నారు. పది నెలల్లో ఇందిరాపార్కుకు సరికొత్త రూపు తీసుకురానున్నారు. 12 ఎకరాల స్థలంలో దీనిని నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికను అధికారులు రూపొందించారు. దీనిని ఈ నెల 9న ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌కు అందిచనున్నారు.
 
హైదరాబాద్: నగరంలోని ప్రధాన పార్కుల్లో ఒకటైన ఇందిరాపార్కు రానున్న పదినెలల్లోగా సరికొత్త రూపు సంతరించుకోనుంది. ఇందిరాపార్కులో వినాయక నిమజ్జనం నిర్వహించేలా వినాయకసాగర్ పేరుతో సరస్సును నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించడంతో ఆ మేరకు పార్కులో ఉన్న అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. దాదాపు 76 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఇందిరాపార్కుకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇందులో రాక్‌గార్డెన్‌తోపాటు ల్యాండ్‌స్కేప్ గార్డెన్ తదితర ఆకర్షణలున్నాయి. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ల్యాండ్‌స్కేప్‌లు, సహజసిద్ధ శిలలు, స్కేటింగ్ రింగ్, టెన్నిస్ కోర్టు, రోజ్ గార్డెన్‌లతో పాటు గంధపు చెట్లు, మామిడి, అల్ల నేరేడు తదితర పండ్ల చెట్లతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక్కడ వినాయక చెరువు నిర్మాణానికి సుమారు 12 ఎకరాల స్థలం సరిపోతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిసింది.

వినాయకసాగర్‌లో ఇలా..

హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం ఎన్టీఆర్ మార్గ్ వైపు, ట్యాంక్‌బండ్ వైపు దాదాపు 2.5 కిలోమీటర్ల దూరాన్ని వినియోగిస్తున్నట్లు అంచనా వేశారు. అంతకు తగ్గకుండా ఇందిరా పార్కులోనూ సరస్సును ఏర్పాటు చేసే దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. ఇంతే కాకుండా ఏడాదిలో దాదాపు నెల రోజులపాటు వినాయక నిమజ్జనం కార్యక్రమాలుంటాయి కనుక మిగతా 11 నెలల్లో పర్యాటకులను ఆకట్టుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగా వాటర్ స్పోర్ట్స్‌కు, పిల్లలను ఆకట్టుకునేలా టాయ్‌ట్రైన్ తదితర సదుపాయాలు కల్పించేందుకు అవకాశాలున్నాయని గుర్తించారు. టాయ్ ట్రైన్ బోగీలపైకి విగ్రహాలను చేర్చి.. అక్కడి నుంచి చెరువులోకి విగ్రహాలను వదిలేందుకు ఉన్న అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. వీటిని నిర్వహించడం ద్వారా ప్రభుత్వానికి ఎంతో కొంత ఆదాయం వస్తుందని అంచనా వేశారు. నిమజ్జనం సందర్భంగా ఇబ్బందుల్లేకుండా అవసరమైన రహదారుల్ని అదనంగా నిర్మించే యోచనలో ఉన్నారు.

ఇందిరాపార్కుకు ప్రవేశ రుసుము, పార్కింగ్ ఫీజు, సినిమా షూటింగ్‌లు తదితరమైన వాటిద్వారా ప్రస్తుతం ఏటా రూ. 25 లక్షల ఆదాయం లభిస్తోంది. కొత్తగా చేసే ఏర్పాట్లతో మరింత ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. సరస్సు ఏర్పాటుతోపాటు వివిధ అంశాలను పొందుపరుస్తూ ప్రభుత్వానికి సమర్పించే పూర్తి స్థాయి నివేదికను సిద్ధం చేసే పనిలో అధికారులు ఉన్నారు. ఈ నెల 9వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో జరుగనున్న అఖిలపక్ష సమావేశంలో రెండు మూడు రాకల ప్రతిపాదనలు, డిజైన్లు, ప్రత్యామ్నాయ మార్గాలతోపాటు ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement