Shimla Toy Train's Hanging Tracks Capture Himachal Devastation - Sakshi
Sakshi News home page

వర్షాలకు భూభాగం కొట్టుకుపోయింది.. రైల్వే ట్రాక్ గాల్లో వేలాడుతుంది

Published Thu, Aug 17 2023 3:04 PM | Last Updated on Thu, Aug 17 2023 5:46 PM

Shimla Toy Trains Hanging Tracks Capture Himachal Devastation - Sakshi

షిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు షిమ్లా సమ్మర్ హిల్‌లో ఒక చోట రైల్వే ట్రాక్ కింద ఉన్న భూభాగం తుడిచిపెట్టుకు పోయింది. దీంతో ఆ రైల్వే ట్రాక్ గాల్లో వేలాడుతూ ఉంది. కాకపోతే ఇది సాధారణ రైల్వే ట్రాక్ కాదు. యునెస్కో వారు పర్యాటకం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. దీనిపై టాయ్ ట్రైన్ ప్రయాణిస్తుంటుంది.  

షిమ్లా సమ్మర్ హిల్ హిమాచల్ ప్రదేశ్ పర్యాటకంలో ఒక భాగం. ఈ ట్రాక్ పైన వెళ్లే టాయ్ ట్రైన్ ప్రయాణం చాలా మందికి బాల్య జ్ఞాపకాలను గుర్తు చేసే  యునెస్కో వారి ప్రత్యేక ఆకర్షణ. ఈ ట్రాక్ కక్ల నుండి షిమ్లా వైపుగా 96 కి.మీ. ప్రయాణిస్తుంటుంది. ఐదు గంటల పాటు సాగే ఈ ప్రయాణంలో హిమాచల్ ప్రదేశ్‌లోని అందమైన హిమాలయాల సొగసులు, ఆహ్లాదకరమైన ప్రకృతి అందాలు దర్శనమిస్తాయి. 

కానీ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఈ ట్రాక్ కింద భూభాగం కొట్టుకుపోవడంతో ఈ ట్రాక్ గాలిలో వేలాడుతోంది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే టాయ్ ట్రైన్ రాకపోకలు ప్రస్తుతానికైతే నిలిచిపోయాయి. దీని మరమ్మత్తులకు కనీసం రూ.15 కోట్లు వ్యయం అవుతుందని దాని కోసం సుమారు నెలరోజుల సమయం పడుతుందని రైల్వే అధికారలు చెబుతున్నారు.      

ఇదే షిమ్లా సమ్మర్ హిల్ సమీపంలో మరొక దేవాలయం కూడా భారీ వర్షాలకు నేలకొరిగింది. భారీ సంఖ్యలో భక్తులు సావాన్ ప్రార్ధనలు నిర్వహిస్తుండగా ఈ దేవాలయం కుప్పకూలింది. విపత్తు నిర్వహణ బృందం సహాయక చర్యలు చేపడుతుండగా శిథిలాల్లో 13 మృతదేహాలు లభ్యమయ్యాయి.

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రమంతా అతలాకుతలమైంది. ఎక్కడికక్కడ వాన నీరు నిలిచిపోయి రహదారులు నదులను తలపిస్తుంటే నదులు మాత్రం నీటిప్రవాహానికి పోటెత్తుతూ ఉన్నాయి. ఇదిలా ఉండగా కొండ ప్రాంతాల్లో మాత్రం ఘాట్ రోడ్డు పొడవునా కొండచరియలు విరిగిపడటంతో వాహనదారులకు తీవ్ర అంతరాయం కలిగిస్తూ ఉన్నాయి. 

హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ మాట్లాడుతూ వర్షాలకు హిమాచల్ ప్రదేశ్‌లో భారీ నష్టం వాటిల్లిందని 60 మంది ప్రాణాలు కోల్పోగా ప్రభావిత ప్రాంతాలను పునరుద్ధరించేందుకు కనీసం రూ.10,000 కోట్లు ఖర్చవుతుందని దానికి ఏడాదికి పైగా సమయం పడుతుందని అన్నారు. 

ఇది కూడా చదవండి: చంద్రయాన్‌-3లో కీలక ఘట్టం..మాడ్యూలర్‌ నుంచి విడిపోయిన ల్యాండర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement