
ఇంగ్లండ్ భారీ స్కోరు
చెన్నై: భారత్ తో జరుగుతున్న చివరిదైన ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 477 పరుగుల భారీ స్కోరు సాధించింది. 284/4 ఓవర్ నైట్ స్కోరుతో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ మరో 193 పరుగులు చేసింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా, టెయిలెండర్ల సాయంతో ఇంగ్లండ్ భారీ స్కోరును నమోదు చేసింది. భారత్ బౌలింగ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ మరోసారి నాలుగువందలకు పైగా స్కోరు సాధించింది. ఈ రోజు ఆటలో బెయిర్ స్టో(49), బట్లర్(5), మొయిన్ అలీ(146) స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరడంతో ఇంగ్లండ్ తడబడినట్లు కనిపించింది. కాగా, ఆ తరువాత ఇంగ్లండ్ టెయిలెండర్లు డాసన్, రషిద్లు హాఫ్ సెంచరీలు సాధించడంతో ఇంగ్లండ్ తిరిగి గాడిలో పడింది.
తొలి సెషన్లో భారత్ జోరు
ఈ రోజు ఆట తొలి సెషన్లో భారత్ జోరు కొనసాగింది. మూడు కీలక వికెట్లను తీసి భారత్ పై చేయి సాధించింది. తొలుత బెయిర్ స్టోను అవుట్ చేసిన భారత్, ఆ తరువాత బట్లర్ను అవుట్ చేసింది. ఆపై శతకం వీరుడు మొయిన్ అలీని కూడా అవుట్ చేసింది. దాంతో లంచ్ లోపే ఇంగ్లండ్ మూడు ప్రధాన వికెట్లను కోల్పోవడంతో భారత్ శిబిరంలో ఆనందం వెల్లివిరిసింది. ఈ మూడు వికెట్లలో అశ్విన్, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మలు తలో వికెట్ చొప్పున పంచుకున్నారు. దాంతో ఇంగ్లండ్ 321 పరుగులకే ఏడు వికెట్లను నష్టపోయింది.
రెండో సెషన్లో ఇంగ్లండ్ హవా
రెండో రోజు ఆటలో లంచ్కు ముందే ఇంగ్లండ్ మూడు వికెట్లను కోల్పోవడంతో మ్యాచ్పై భారత్ పట్టుసాధించినట్లు కనబడింది. మొయిన్ అలీ ఏడో వికెట్గా అవుటైన తరువాత భారత్కు అసలు పరీక్ష ఎదురైంది. ఇంగ్లండ్ టెయిలెండర్లు డాసన్, రషిద్లు సమయోచితంగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. ఈ జోడి ఎనిమిదో వికెట్ కు108 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించింది. ఈ క్రమంలోనే రషిద్(60;155 బంతుల్లో 8 ఫోర్లు) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇది రషిద్ టెస్టు కెరీర్లో రెండో హాప్ సెంచరీ. రషిద్ అవుటైన తరువాత డాసన్ హాఫ్ సెంచరీ సాధించాడు. 121 బంతులను ఎదుర్కొన్న డాసన్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. దీంతో రెండో సెషన్లో ఇంగ్లండ్ హవా పూర్తిగా కొనసాగింది. టీ విరామానికి ఇంగ్లండ్ ఎనిమిది వికెట్ల నష్టానికి 452 పరుగులు చేసింది. కాగా, టీ తరువాత మరో 25 పరుగులు చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ను ముగించింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు సాధించగా, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మలు తలో రెండు వికెట్లు తీశారు. అశ్విన్, మిశ్రాలకు చెరో వికెట్ దక్కింది.