
రవిశాస్త్రితో బాగుంది.. బాగుంటుంది!
గాలే:ఇటీవల భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా ఎంపికైన రవిశాస్త్రితో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నట్లు ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పష్టం చేశాడు. ఈ మేరకు గతంలో రవిశాస్త్రితో పని చేసిన అనుభవాన్ని అశ్విన్ పంచుకున్నాడు. బుధవారం శ్రీలంకతో తొలి టెస్టు మ్యాచ్ ద్వారా 50 వ టెస్టును ఆడబోతున్న అశ్విన్.. రవిశాస్త్రితో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు.
'డ్రెస్సింగ్ రూమ్ లో రవిశాస్త్రితో అనుభవాలు పంచుకోవడం బాగుంటుంది. రవిశాస్త్రి సానుకూల వాతావరణంలో ఆటగాళ్లలో ఉత్తేజాన్ని నింపుతాడు. గతంలో అతను కలిసి పనిచేయడాన్ని చాలా ఆస్వాదించాం. ఇప్పుడు కూడా అదే ఆశిస్తున్నాం.గతంలో గాలేలో శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్ ఓడిపోయినప్పుడు రవిశాస్త్రి మాతోనే ఉన్నాడు. ఆ సమయంలో జట్టులోని సభ్యుల్లో తిరిగి ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. పాజిటివ్ ధోరణితో ముందుకెళ్లే వ్యక్తుల్లో రవిశాస్త్రి ఒకడు'అని అశ్విన్ తెలిపాడు.