న్యూఢిల్లీ:టీమిండియ ప్రధాన కోచ్‌గా అనిల్ కుంబ్లే నిష్క్రమణతో కొత్త కోచ్ ఎంపికకు వేట ప్రారంభమైంది. కోచ్ పదవికి కోసం ఒకసారి దరఖాస్తులు కోరిన బీసీసీఐ..రెండో సారి కూడా ఆప్లికేషన్స్ కోరుతూ ప్రకటన చేసింది. దీనిపై కొంతమంది నేరుగానే అసహనం వ్యక్తం చేశారు. ప్రధానంగా రెండోసారి బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించడాన్ని కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసిన లాల్ చంద్ రాజ్పుత్ తీవ్రంగా తప్పుబట్టాడు అసలు కోచ్ పదవి కోసం ముందుగా దరఖాస్తు చేసిన అభ్యర్ధులు సరిపోలేదా అంటూ నేరుగా విమర్శలకు దిగారు.
పనిలో పనిగా కోచ్ పదవిని ఎవరికి కట్టబెట్టేందుకు మళ్లీ ఆప్లికేషన్స్ ను ఆహ్వానించాల్సి వచ్చిందంటూ మండిపడ్డాడు. ముందుగా టామ్ మూడీ, సెహ్వాగ్, రిచర్డ్ పైబస్, లాల్‌చంద్ రాజ్‌పుత్‌లు రేసులో ఉన్నా ఇప్పుడు రవిశాస్త్రి తెరమీదికొచ్చారు. ఉన్నపళంగా ఆయన దరఖాస్తు చేయడం ఆశ్చర్యపరిచినా... సచిన్ సూచనతోనే లండన్‌లో ఉన్న ఆయన కోచ్ పదవిపై ఆసక్తి కనబరిచినట్లు తెలిసింది. కెప్టెన్ కోహ్లి కూడా శాస్త్రిపైనే మొగ్గుచూపుతుండటంతో కోచ్ ఎంపిక ఆసక్తికరంగా మారింది.
ఇప్పుడు దీనిపై సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చనడుస్తోంది. ముఖ్యంగా రవిశాస్త్రిని టార్గెట్ చేస్తూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ క్రమంలోనే కోహ్లి-రవిశాస్త్రిల విడదీరయరాని బంధంపై సెటైర్లు వేస్తున్నారు. వాటిలో కొన్నింటిని చూద్దాం.
*దరఖాస్తు చేసిన వారిని ఇంటర్య్యూ చేసే వారి ప్యానల్ లో సౌరవ్ గంగూలీ ఉన్నాడు జాగ్రత్త. రవిశాస్త్రికి కోచ్ పదవి దక్కడం కష్టమే.
*కుంబ్లే తరువాత రవిశాస్త్రి.. ఆడీ కారు తర్వాత మారుతిని వాడినట్లు ఉంటుంది.
*లెజెండ్స్ అనేవారు ఉద్యోగం ఖరారు అయిన తరువాత దరఖాస్తు చేస్తారు. రవిశాస్త్రి లెజెండ్ కాబట్టి ఉద్యోగం ఖాయం చేసుకుని దరఖాస్తు చేసుకున్నాడు.
*కోహ్లి-రవిశాస్త్రిల ప్రేమ కథ.. ట్విలైట్ సినిమా కంటే బాగుంది
*అప్పుడు గ్రెగ్ చాపల్ ను తీసుకుని గంగూలీ ఇబ్బంది పడ్డాడు.. ఇప్పుడు రవిశాస్త్రిని తీసుకువస్తే కోహ్లికి అదే పరిస్థితి వస్తుంది.
కుంబ్లే వైదొలగడానికి రవిశాస్త్రి తెరవెనుకాల ముఖ్య పాత్ర పోషించాడు. ఈ విషయంలో బీసీసీఐ వైఫల్యం చెందింది.
*ప్రతీరోజు మ్యాచ్ అయిన తరువాత రవిశాస్త్రి-కోహ్లిలు దబాంగ్ సినిమాలో ఐటమ్ సాంగ్ ను పాడుకోవచ్చు. అది వారికి మంచి స్ఫూర్తిగా ఉంటుంది.
*టీమిండియా డైరెక్టర్ గా రవిశాస్త్రి పని చేసిన కాలంలో మంచి విజయాలు సాధించాడు. కోచ్ గా అతని ఎంపిక తప్పుకాకపోవచ్చు.