న్యూఢిల్లీ: టీమిండియా ప్రధాన కోచ్‌గా ఇటీవల నియమంచబడ్డ రవిశాస్త్రికి సరికొత్త తలనొప్పి వచ్చి పడింది. కపిల్‌దేవ్ నేతృత్వంలోని క్రికెట్ సలహా కమిటీ(సీఏసీ) రవిశాస్త్రిని కోచ్‌గా ఎంపిక చేయడమే ఇందుకు కారణం. వరుసగా రెండోసారి టీమిండియా హెడ్ కోచ్‌గా ఎంపికైన రవిశాస్త్రి పెద్దగా పోటీ లేకుండానే ఆ బాధ్యతను అందుకున్నాడు. ఇప్పటికే ‘పరస్పర విరుద్ధ ప్రయోజనాల’ నోటీసును సీఏసీ అందుకోవడంతో రవిశాస్త్రి మరోసారి వార్తల్లోకి వచ్చాడు. ఒకవేళ సీఏసీ సభ్యులు పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తే రవిశాస్త్రి నియామకం అనేది చెల్లదు. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి నియామకం మరోసారి చర్చనీయాంశమైంది. కపిల్, అన‍్షుమన్ గ్వైక్వాడ్, శాంత రంగస్వామిలు పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం కిందకు వస్తే మాత్రం రవిశాస్త్రి తన పదవిని కోల్పోవాల్సి వస్తుంది.
రవిశాస్త్రిని కోచ్‌గా నియమించడానికి వారం రోజుల ముందుగానే అన్షుమన్ గ్వైక్వాడ్ తన అభిప్రాయాన్ని బాహబాటంగానే వెల్లడించాడు. రవిశాస్త్రిని తిరిగి కోచ్‌గా నియమిస్తే తప్పేముందనే విషయాన్ని స్పష్టం చేశాడు. భారత క్రికెట్ విజయాల్లో రవిశాస్త్రి పాత్ర ఎంతో ఉందంటూ మీడియా ముఖంగా కొనియాడాడు. ఇది అప్పట్లో దుమారమే రేపినా అసలు ఏం జరగబోతుందో అనే దానిపై మాజీలు నిరీక్షించారు. అయితే రవిశాస్త్రినే ప్రధాన కోచ్‌గా నియమించడంతో అది మరొకసారి హాట్ టాపిక్ అయ్యింది. శనివారం ఎథిక్స్ ఆఫీసర్ డీకే జైన్.. సీఏసీకి నోటీసులు ఇవ్వడంతో రవిశాస్త్రి నియామకంపై విపరీతమైన చర్చ నడుస్తోంది.
అప్పట్లోనే భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌ను సీఏసీ ఎంపిక చేయడంపై పరిపాలన కమిటీ(సీఓఏ)లో భిన్న వాదనలు వినిపించాయి. సీఓఏ చీఫ్ వినోద్ రాయ్.. ప్రధాన కోచ్‌ను ఎంపిక చేసే అర్హత కపిల్ బృందానికి ఉందని చెప్పగా, ఆ కమిటిలోని సభ్యురాలు డానియా ఎడ్జుల్లీ మాత్రం దాంతో విభేదించారు. ఇది బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం చెల్లదని తేల్చిచెప్పారు. చివరకు అనేక ట్విస్టుల మధ్య సీఏసీనే ప్రధాన కోచ్ ఎంపికను చేపట్టింది. కాగా, డీకే జైన్ ఎథిక్స్ ఆఫీసర్‌గా నియామకం జరిగిన తర్వాత కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్‌లకు నోటీసులు అందుకున్నారు. ఇప్పుడు సీఏసీని టార్గెట్ చేయడంతో అది కాస్తా రవిశాస్త్రి నియామకంపై పడింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాలు నోటీసుతో అలిగిన సీఏసీ సభ్యురాలు శాంత రంగస్వామి ఇప్పటికే తన పదవికీ రాజీనామా చేయడం కూడా ఆసక్తిని రేపుతోంది. మరి భారత క్రికెట్‌లో కొత్త పరిణామాలు ఏమైనా చోటు చేసుకుంటాయా.. లేదా అనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. సీఏసీ సభ్యులు అక్టోబర్ 10లోగా తమ నివేదికను సమర్పించిన తర్వాత కానీ రవిశాస్త్రి నియామకం ఎంత పారదర్శకంగా జరిగిందనేది తెలియదు.
Comments
Please login to add a commentAdd a comment