నాగ్‌పూర్:భారత ప్రధాన స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో మూడొందల వికెట్లను వేగవంతంగా సాధించిన బౌలర్‌గా అశ్విన్ రికార్డు నెలకొల్పాడు. శ్రీలంకతో రెండో టెస్టులో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో లహిరు గామేగ్ అవుట్ చేసిన అశ్విన్ మూడొందల వికెట్ల క్లబ్‌లో చేరాడు. ఈ మ్యాచ్‌కు ముందు 292 వికెట్లతో ఉన్న అశ్విన్.. ఎనిమిది వికెట్లు సాధించి మూడొందల వికెట్ల మార్కును చేరాడు. ఫలితంగా వేగవంతంగా మూడొందల టెస్టు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 54 మ్యాచ్‌ల్లో అశ్విన్ ఈ మార్కును చేరాడు. ఈ క్రమంలోనే ఆసీస్ దిగ్గజం డెన్నిస్ లిల్లీ(56 మ్యాచ్‌లు) రికార్డును అశ్విన్ బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు సాధించిన అశ‍్విన్.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా నాలుగు వికెట్లతో ఆకట్టుకున్నాడు.
అంతకుముందు ఇదే మ్యాచ్ లో అశ్విన్ ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది 50వ టెస్టు వికెట్‌ను అశ్విన్ సాధించాడు. శ్రీలంకతో రెండో టెస్టులో భాగంగా రెండో ఇన్నింగ్స్ లో పెరీరా వికెట్ ను తీసిన అనంతరం అశ్విన్ ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. తద్వారా ఈ క్యాలండర్ ఇయర్‌లో అత్యధిక టెస్టు వికెట్లు సాధించిన రెండో స్పిన్నర్‌గా అశ్విన్ నిలిచాడు. అంతకుముందు వరుసలో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయన్ ఉన్నాడు. గతేడాది అత్యధిక వికెట్లు సాధించిన టెస్టు బౌలర్లో అశ్విన్ 72 వికెట్లతో అగ్రస్థానం దక్కించుకున్నాడు. కాగా, వరుసగా మూడేళ్ల నుంచి ఏడాదికి 50కిపైగా వికెట్లను అశ్విన్ సాధిస‍్తూ భారత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment