నాకు నేనే సమాధానమిచ్చుకుంటా!
విమర్శలను పట్టించుకోను
ఫార్మాట్‌కు తగ్గట్లుగా ఆటతీరు మార్చుకుంటా
అశ్విన్ అభిప్రాయాలు
ఢాకా నుంచి బత్తినేని జయప్రకాష్
రవిచంద్రన్ అశ్విన్... తన స్పిన్ బౌలింగ్‌తో, క్యారమ్ బంతులతో ఎంత వేగంగా పేరు సంపాదించాడో... అంతే వేగంగా విమర్శకులనూ పెంచుకున్నాడు. వరుస వైఫల్యాలు, బౌలింగ్ యాక్షన్‌లో మార్పు... ఇలా ఇటీవల కాలంలో తనపై ఒత్తిడి బాగా పెరిగింది. అయితే తానెవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటున్నాడు ఈ ఆఫ్ స్పిన్నర్. ఏం చేస్తే తన బౌలింగ్ మెరుగుపడుతుందో తెలుసని చెబుతున్నాడు. తనకు తాను సమాధానం చెప్పుకుంటే చాలని, విమర్శకుల కోసం తాను ఆడటం లేదని అంటున్న అశ్విన్ వివిధ అంశాలపై చెప్పిన విశేషాలు అతడి మాటల్లోనే....
ఈసారి స్పిన్నర్ల పాత్ర: ఉపఖండంలో ఎక్కడ క్రికెట్ ఆడినా స్పిన్నర్లు కీలకం కావడం సహజం. ఈసారి బంగ్లాదేశ్ వికెట్లపై స్పిన్నర్ల రాణింపే కీలకం. దీనికి మేం సన్నద్ధంగా ఉన్నాం.
భారత పేసర్లలో అనుభవలేమి: ఇది పెద్ద సమస్య అని నేను అనుకోను. ధోని చెప్పినట్లు ఐపీఎల్ రూపంలో మేం కావలసినంత క్రికెట్ ఆడాం. కాబట్టి పేసర్లకూ అనుభవం ఉంది. ఐపీఎల్ వేరు, ప్రపంచకప్ వేరు. కానీ ప్రపంచవ్యాప్తంగా టి 20 ఎక్కడ ఆడినా, ఆ అనుభవం ఉపయోగపడుతుంది.
బౌలింగ్ శైలిలో మార్పు: మూడు ఫార్మాట్లలో ఆడటం ఎవరికైనా సవాలే. బ్యాట్స్‌మెన్ ఫార్మాట్‌కు తగ్గట్లుగా ఆట మార్చుకుంటున్నారు. కాబట్టి బౌలర్లు కూడా దీనికి అనుగుణంగా శైలి మార్చుకోవాలి. మేం ఏం చేయాలనేది చాలామంది నిపుణులు చెబుతూ ఉంటారు. నా వరకైతే వాటిని వింటూ కూర్చోవడం కంటే మైదానంలోకి వెళ్లి కొత్త పద్దతులను ప్రాక్టీస్ చేయడం మంచిదని భావిస్తాను. అలా చేయడం వల్ల కొత్త శైలిలో బౌలింగ్, కొత్త రకాల బంతులు ఇలా అన్నీ అభివృద్ధి చేసుకోవచ్చు. దీనివల్ల ఫార్మాట్‌కు తగ్గట్లుగా బౌలింగ్ శైలిని మార్చుకోగలుగుతున్నా.
మార్పులు చేసుకోవడం సులభమా..?: మేం చాలా ప్రాక్టీస్ సెషన్లకు వెళుతున్నాం. వెళ్లిన ప్రతిసారీ ఓ కొత్త విషయాన్ని నేర్చుకోవాలి. లేకపోతే బోర్ కొడుతుంది. మ్యాచ్‌లో ఓ నిర్ధిష్ట స్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి బంతులు వేయాలనే అంశంపై ప్రయోగాలు చేస్తాను. వాటినే ఆచరణలో పెడతాను. దీనివల్ల నాపై విమర్శలు వస్తాయి. కానీ వాటికి నేను సమాధానం చెప్పాల్సిన పని లేదు. నాకు నేను సమాధానం చెప్పుకుంటే చాలు.
ఉపఖండం ఆవల ఓటములు: ఫార్మాట్ ఏదైనా పరిస్థితులకు అలవాటు పడటం కీలకం. ఉపఖండం బయట భారత జట్టుకు ఇది ప్రతికూలం. అయితే ప్రస్తుతం జట్టులోని యువ క్రికెటర్లు నేర్చుకునే దశలో ఉన్నారు. ఇప్పటి కష్టానికి ఫలితం భవిష్యత్తులో ఉంటుంది.
దూకుడుగానే ఆడాలి: టి20 క్రికెట్‌లో దూకుడు అవసరం. బ్యాట్స్‌మెన్ ఎంత దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తారో... బౌలర్లు కూడా అంతే దూకుడు కనబరచాలి. ఇందులో ఎక్కువభాగం ఆటగాడి మైండ్‌సెట్‌పై ఆధారపడి ఉంటుంది.