అశ్విన్ మరో ఘనత
టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో ఘనత సాధించాడు. ఓ కేలండరియర్‌లో టెస్టు క్రికెట్లో 50కి పైగా వికెట్లు, 500కు పైగా పరుగులు సాధించిన భారత మూడో క్రికెటర్‌గా, ప్రపంచంలో ఓవరాల్‌గా ఏడో ఆటగాడిగా అశ్విన్ రికార్డు నెలకొల్పాడు. గతంలో 1952లో వినూ మన్కడ్, 1979, 1983లలో కపిల్ దేవ్ ఈ ఘనత సాధించారు.
ఈ ఏడాది 10 టెస్టులాడిన అశ్విన్ 56 వికెట్లు తీసి, 530 పరుగులు చేశాడు. తాజాగా ఇంగ్లండ్‌తో మొహాలీలో జరుగుతున్న మూడో టెస్టులో రాణించడం ద్వారా అశ్విన్ రికార్డు నమోదు చేశాడు. తద్వారా వినూ మన్కడ్, కపిల్ దేవ్ సరసన నిలిచాడు. మొహాలీ టెస్టులో అశ్విన్ 57 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. టెస్టు ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం నెంబర్ వన్ బౌలర్‌గా, నెంబర్ వన్ ఆల్ రౌండర్‌గా కొనసాగుతున్నాడు. టెస్టుల్లో వేగంగా 200 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా, ప్రపంచంలో రెండో క్రికెటర్‌గా అశ్విన్ ఇదివరకు రికార్డు నెలకొల్పాడు.