అతడు భుజం గాయంతోనే ఆసీస్‌కు వచ్చాడు | Ravindra Jadeja is not a complete fit says coach Ravi Sastry | Sakshi
Sakshi News home page

80% అబద్ధం!

Published Mon, Dec 24 2018 5:29 AM | Last Updated on Mon, Dec 24 2018 12:02 PM

Ravindra Jadeja is not a complete fit says coach Ravi Sastry - Sakshi

ఏ మూడ్‌లో ఉన్నాడో... ఏ ఉద్దేశంతో అన్నాడో కాని... ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై తన మాటల ద్వారా టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి కొత్త వివాదానికి తెరలేపాడు. పెర్త్‌ టెస్టు ఓటమిపై విమర్శల నుంచి వ్యక్తిగతంగా తప్పించుకోలేకపోగా... కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి చెప్పిన దానికి భిన్నమైన వివరణ ఇచ్చి మరింత బోర్లాపడ్డాడు. అటువైపు బీసీసీఐనీ ఇరకాటంలోకి నెట్టాడు. అర్ధరాత్రి వివరణ ఇచ్చుకునేలా చేశాడు. ఇటువైపు ఈ మొత్తం చర్చకు కారణమైన ‘జడేజా 70–80 శాతం ఫిట్‌నెస్‌’... అసలు జట్టు సభ్యుల గాయాలు, వాటిపట్ల తీసుకోవాల్సిన చర్యలపై టీమిండియాకు  నిర్దిష్టమైన ప్రణాళిక ఏమీ లేదన్న విషయాన్ని మరోసారి చాటింది.  


మెల్‌బోర్న్‌:  ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా పూర్తి ఫిట్‌గా లేడని టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి ప్రకటించాడు. రెండో టెస్టు సమయానికి అతడు 70–80 శాతం ఫిట్‌నెస్‌తోనే ఉన్నాడని... అందుకనే తుది జట్టులో ఆడించలేదని పేర్కొన్నాడు. జడేజా 80 శాతం ఫిట్‌నెస్‌తో ఉన్నా మెల్‌బోర్న్‌లో జరిగే మూడో టెస్టులో ఆడిస్తామంటూ చిత్రమైన వివరణ ఇచ్చాడు. ‘స్వదేశంలో రంజీ ఆడుతున్నప్పుడే జడేజా భుజం నొప్పితో ఇబ్బందిపడ్డాడు. ఆస్ట్రేలియాకు వచ్చిన నాలుగు రోజులకు ఇంజెక్షన్లు తీసుకున్నాడు. అవి ప్రభావం చూపేందుకు కొంత సమయం పట్టింది’ అని ఆదివారం ఇక్కడ మీడియా సమావేశంలో వివరించాడు. పెర్త్‌ ఓటమిపై విమర్శలకు స్పందిస్తూ ‘జట్టుకు ఏది మేలనుకున్నామో అదే చేశాం. సుదూరాన ఉన్నవారు మాట్లాడటం సులువు. మేమిప్పుడు దక్షిణ ధ్రువాన ఉన్నాం’ అంటూ వ్యంగ్యంగా స్పందించాడు. ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌పై రెండు రోజుల్లో ఓ నిర్ణయానికి వస్తామని, బ్యాట్స్‌మన్‌ రోహిత్‌శర్మ పరిస్థితి మెరుగైందని తెలిపాడు. 

దక్షిణాఫ్రికాలో  వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా, ఇంగ్లండ్‌లో ఆఫ్‌ స్పిన్నర్‌ అశ్విన్, ఆస్ట్రేలియాలో రవీంద్ర జడేజా... వరుసగా మూడో విదేశీ పర్యటనలోనూ ఆటగాళ్ల గాయాలపై టీమిండియాలో దాగుడుమూతలు కొనసాగుతున్నాయి. జట్టు సభ్యుల వాస్తవ ఫిట్‌నెస్‌ను విస్మరించి చివరివరకు ఆడించడం... తీరా అది వికటించి విమర్శల పాలవడం కోహ్లి సేనకు సాధారణమైపోయింది. ఈ విషయంలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, కోచ్‌ రవిశాస్త్రితో పాటు బీసీసీఐదీ తప్పున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా ముగిసిన పెర్త్‌ టెస్టులో ‘జడేజా ఉదంతమే’ దీనంతటికీ బలమైన సాక్ష్యం. 

అసలేం జరిగింది? 
రెండో టెస్టుకు ముందు రోజే జడేజా, భువనేశ్వర్‌ సహా భారత్‌ 13 మందితో జట్టును ప్రకటించింది. అంతకుముందు బీసీసీఐ విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌ ప్రకారం అందరూ మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధమని తేలిపోయింది. అయితే, పిచ్‌ స్వభావం రీత్యా అంటూ నలుగురు పేసర్లతో దిగాడు కోహ్లి. కానీ, ఈ వ్యూహం వికటించింది. ఆసీస్‌ స్పిన్నర్‌ నాథన్‌ లయన్‌ టీమిండియాను దెబ్బకొట్టాడు. స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌ లేకుండా ఆడిన భారత ప్రణాళికను అందరూ తప్పుబట్టారు. అయితే రవీంద్ర జడేజాను ఆడించే ఆలోచన తమకు రాలేదని మ్యాచ్‌ ముగిశాక విరాట్‌  వివరణ ఇచ్చాడు. మరోవైపు వివిధ కార ణాలతో జడేజా ఐదుగురు ఆటగాళ్లకు సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలో సుదీర్ఘ సమయం ఫీల్డింగ్‌ చేశాడు. బంతిని బలంగా విసరాల్సి వచ్చే బౌండరీ లైన్‌ దగ్గరే ఎక్కువసేపు ఉన్నాడు. కోహ్లి వివరణ, ఫీల్డింగ్‌కు దింపిన తీరునుబట్టి చూస్తే జడేజా ఫిట్‌గా ఉన్నాడనే అనుకోవాల్సి ఉంటుంది. 

ఇప్పుడేం జరిగింది? 
టెస్టు ఓటమిపై విమర్శల పరంపర కొనసాగుతుండగానే, ఆదివారం మీడియాతో మాట్లాడిన రవిశాస్త్రి... జడేజా 70 నుంచి 80 శాతం ఫిట్‌నెస్‌తోనే ఉన్నాడని, లేనిపోని ఇబ్బంది ఎందుకనే పెర్త్‌ మ్యాచ్‌ ఆడించలేదని ప్రకటించాడు. ఇది పూర్తి అసంబద్ధంగా ఉండటంతో పెద్ద సంచలనమైంది. ఏ స్థాయి ఆటగాడినైనా వంద శాతం ఫిట్‌గా ఉంటేనే మైదానంలోకి దింపుతారు. మరి అలా లేని జడేజాను 13 మందిలో ఎలా చేర్చారు? ఎడమ భుజం గాయంతో ఇబ్బంది పడుతున్న అతడిని సబ్‌స్టిట్యూట్‌గా ఎలా పంపారు? తప్పని పరిస్థితుల్లో అనుకున్నా... బౌండరీల వద్ద ఎలా ఉంచుతారు? అనే ప్రశ్నలు వస్తున్నాయి. దీనర్థం చూస్తే... ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు కారణాలు చెప్పబోయిన రవిశాస్త్రి బయటకు తెలియని జడేజా గాయం గురించి చెప్పేశాడు. అతడు 80 శాతం ఫిట్‌నెస్‌తో ఉన్నా మెల్‌బోర్న్‌లో ఆడిస్తామంటూ మరో పూర్తి విరుద్ధ ప్రకటన చేశాడు. అంతేకాక, ‘మీరు జడేజా గురించి అడిగారు. నేను చెప్పాను. ఇక జట్టు ఎంపికపై ఎలాంటి సందేహాలు లేవనుకుంటా? ఉంటే... అది మీ సమస్య’ అని మీడియాకు చురకలేశాడు. 

ఇదేం తీరు? 
జడేజా విషయం తెలిశాక కూడా అతడిని 13 మందిలో చేర్చడం పొరపాటే. ఎలాగూ నలుగురు పేసర్ల వ్యూహమే సరి అంటూ, స్పిన్నర్‌ను ఆడించమని కోహ్లి చెప్పాడు కాబట్టి అతడి స్థానంలో కుల్దీప్‌ పేరు ఉంచితే సరిపోయేది. అలాకాకుండా జడేజాతో ఏకంగా ఫీల్డింగ్‌ కూడా చేయించారు. ఇప్పటికే అశ్విన్‌కు ఫిట్‌నెస్‌ ఇబ్బందులున్న నేపథ్యంలో ఒకవేళ గాయం పెద్దదై జడేజా సిరీస్‌కే దూరమైతే ఏం చేసేవారు? ఇదే విధంగా ఇంగ్లండ్‌లో గాయం ఉన్నా అశ్విన్‌ను సౌతాంప్టన్‌ టెస్టులో ఆడించారు. ప్రత్యర్థి స్పిన్నర్‌ మొయిన్‌ అలీ విజృంభించిన చోట అతడు విఫలమై విమర్శలు మూటగట్టుకున్నాడు. తద్వారా జట్టు నిర్ణయానికి వ్యక్తిగతంగా బలయ్యాడు. 
  
బీసీసీఐ నష్ట నివారణ 
రవిశాస్త్రి వ్యాఖ్యలకు దుమారం రేగడంతో బీసీసీఐ నష్ట నివారణకు దిగింది. జడేజా పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నందుకే ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేశామని ప్రకటించింది. ఈ మేరకు మెల్‌బోర్న్‌ సమయం ప్రకారం ఆదివారం అర్థరాత్రి దాటాక వివరణ ఇచ్చింది. ‘ఎడమ భుజం గాయం నుంచి జడేజా కోలుకుంటున్నాడు.  మెల్‌బోర్న్‌ టెస్టుకు అందుబాటులో ఉంటాడు. స్వదేశంలో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో అతడికీ ఇబ్బంది తలెత్తింది. నవంబరు 2న ముంబైలో ఇంజక్షన్‌ తీసుకున్నాడు. తర్వాత సౌరాష్ట్ర తరఫున రంజీ ఆడి... ఎలాంటి ఇబ్బంది లేకుండా 64 ఓవర్లు వేశాడు. ఫిట్‌గా ఉన్నట్లు తేలడంతోనే ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేశాం’ అని పేర్కొంది. నవంబరు 30న సీఏ ఎలెవెన్‌తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌ సందర్భంగా మరో ఇంజక్షన్‌ తీసుకున్నాడని వివరించింది. పెర్త్‌ టెస్టుకు ముందు నెట్స్‌లో జడేజా ప్రాక్టీస్‌ చేసినా... అది స్థాయికి తగినట్లు లేకపోవడంతో తుది జట్టులోకి తీసుకోలేదని పేర్కొంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement