బెంగళూరు: కచ‍్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సత్తా చాటింది. ముందుగా బ్యాటింగ్‌లో చెలరేగిన ఆర్సీబీ.. ఆ తర్వాత బౌలింగ్‌లో చెమటోడ్చి మ్యాచ్‌ను కాపాడుకుంది. దాంతో ప్లే ఆఫ్ ఆశల్ని ఆర్సీబీ సజీవంగా నిలుపుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 219 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సన్‌రైజర్స్ కడవరకూ పోరాడి ఓడింది. లక్ష్యం భారీగా ఉండటంతో సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 204 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. విలియమ్సన్(81; 42 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు), మనీష్ పాండే(62 నాటౌట్; 38 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు)లు మెరుపులు మెరిపించినా జట్టును గెలిపించలేకపోయారు.
భారీ లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌ను శిఖర్ ధావన్, అలెక్స్ హేల్స్‌లు ధాటిగా ఆరంభించారు. ఈ జోడి తొలి వికెట్‌కు 47 పరుగులు జోడించిన తర్వాత ధావన్(18;15 బంతుల్లో 2 సిక్సర్లు) ఔటయ్యాడు. ఆపై 17 పరుగుల వ్యవధిలో హేల్స్(37;24 బంతుల్లో 2 ఫోర్లు,3 సిక్సర్లు) సైతం పెవిలియన్ చేరడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 64 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో కేన్ విలియమ్సన్-మనీష్ పాండేలు ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యతను తీసుకున్నారు. ఒకవైపు విలియమ్సన్ తన సహజ శైలికి భిన్నంగా విరుచుకుపడి ఆడితే, మనీష్ పాండే సమయోచితంగా బ్యాట్ ఝుళిపించాడు. ఈ క్రమంలోనే వీరిద్దరూ 135 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆఖరి ఓవర్ మొదటి బంతికి విలియమ‍్సన్ ఔట్ కావడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది. చివరి ఓవర్‌లో సన్‌రైజర్స్ విజయానికి 20 పరుగులు కావాల్సి ఉండగా, 5 పరుగులు మాత్రమే వచ్చాయి. దాంతో ఆర్సీబీ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది.
అంతకుముందు ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఏబీ డివిలియర్స్(69;39 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్సర్), మొయిన్ అలీ(65;34బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లు)లు చెలరేగి ఆడగా, గ్రాండ్ హోమ్ (40; 17 బంతుల్లో1 ఫోర్, 4 సిక్సర్లు) ధాటిగా బ్యాటింగ్ చేసి జట్టు భారీ స్కోరులో సహకరించారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను పార్థీవ్ పటేల్, కోహ్లిలు ఆరంభించారు. వీరిద్దరూ స్వల్ప విరామాల్లో పెవిలియన్ చేరడంతో ఆర్సీబీ 39 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. పార్థీవ్ పటేల్(1) తొలి ఓవర్ ఆఖరి బంతికి పెవిలియన్ చేరగా, ఐదో ఓవర్ ఐదో బంతికి విరాట్ కోహ్లి(12) ఔటయ్యాడు. ఆ తరుణంలో ఏబీ డివిలియర్స్-మొయిన్ అలీల జోడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. సన్‌రైజర్స్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ బౌండరీల మోత మోగించారు. ఈ క్రమంలోనే మూడో వికెట్‌కు 107 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు. అయితే రషీద్ ఖాన్ వేసిన 15 ఓవర్‌లో డివిలియర్స్, మొయిన్ అలీలు పెవిలియన్ చేరడంతో ఆర్సీబీ 14.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. ఆపై గ్రాండ్ హోమ్ మెరుపులు మెరిపించగా, సర్ఫరాజ్ ఖాన్(22 నాటౌట్; 8 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్) తనవంతు పాత్రను సమర్ధవంతంగా పోషించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో రషీద్ ఖాన్ మూడు వికెట్లు సాధించగా, సిద్ధార్థ్ కౌల్ రెండు వికెట్లు తీశాడు. సందీప్ శర్మకు వికెట్ దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment