హైదరాబాద్: ప్రేక్షకుల హాజరు, టీఆర్పీ రేటింగ్స్ పరంగా సన్‌రైజర్స్ హైదరాబాద్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్.. ఈ ఐపీఎల్ సీజన్‌లోకెల్లా ‘ది బెస్ట్’గా నిలిచింది. ఆఖరి బంతి దాకా ఉత్కంఠభరితంగా సాగిన పోరులో బెంగళూరు 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆడిన 10 మ్యాచ్‌ల్లో 7 పరాజయాలు మూటగట్టుకున్న ఆర్సీబీ.. ప్లేఆఫ్ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకుంది. మ్యాచ్ ఫలితంపై బెంగళూరు సారధి విరాట్ కోహ్లి అనూహ్య వ్యాఖ్యలు చేశాడు. ‘‘నిజానికి మ్యాచ్‌పై సన్‌రైజర్స్ పట్టుసాధించింది అనడంకంటే మేమే వాళ్లకా అవకాశం కల్పించాం..’’అన్నాడు.
ఇది మా దీనగాథ..: ‘‘చేతిలో నాలుగు వికెట్లు పెట్టుకుని 5 పరుగులు సాధించలేకపోయాం. ముమ్మాటికీ ఓటమికి అర్హులమే! మా బలాన్ని ప్రదర్శించడంలో దారుణంగా విఫలం చెందాం. స్లో వికెట్‌పై చెత్తషాట్లు ఆడాం. కొద్దిగా నిలదొక్కుకుని ఉంటే మంచి భాగస్వామ్యం నిర్మించొచ్చని ‘మన్‌దీప్-గ్రాండ్‌హోమ్’లు నిరూపించారు. కానీ అప్పటికే నష్టం జరిగిపోయింది. బౌలింగ్ పరంగానూ 10-15 పరుగుల్ని కట్టడిచేసి ఉండాల్సింది. వాస్తవానికి దీన్ని హైదరాబాద్ గెలుపు అనడంకంటే మా ఓటమి అనడమే సమంజసం. ఇదీ.. టోర్నీలో మా దీనగాథ..’’ అని కోహ్లి అన్నాడు.
కోహ్లి లెక్కలో బెస్ట్ టీమ్స్ ఏవంటే..: ‘తక్కువ స్కోర్లను కూడా డిఫెండ్ చేసుకుంటున్న సన్‌రైజర్స్‌ను బెస్ట్ టీమ్‌గా భావిస్తారా?’ అన్న కామెంటేటర్ ప్రశ్నకు కోహ్లి ఒకింత తెలివిగా సమాధానమిచ్చాడు. ‘‘అవును. బౌలింగ్ పరంగా సన్‌రైజర్స్ బెస్ట్ టీమే. వాళ్లకు(హైదరాబాద్ టీమ్‌కు) వాళ్ల బలం, పరిధులు పక్కాగా తెలుసు. ప్రదర్శన కూడా ఆ మేరకే ఉంటుంది. అది వారి విజయగాథ. అయితే ఆల్‌రౌండ్ ప్రతిభ పరంగా మాత్రం చెన్నై సూపర్ కింగ్సే బెస్ట్ టీమ్’’ అని విరాట్ ముగించాడు.
కేన్ కెప్టెన్ ఇన్నింగ్స్: సోమవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 5 పరుగుల తేడాతో బెంగళూరుపై గెలిచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (39 బంతుల్లో 56; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, షకీబ్ (32 బంతుల్లో 35; 5 ఫోర్లు) రాణించాడు. సిరాజ్, సౌతీ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం బెంగళూరు 20 ఓవర్లలో 141 పరుగులే చేసి ఓడిపోయింది. కోహ్లి (30 బంతుల్లో 39; 5 ఫోర్లు, 1 సిక్స్), గ్రాండ్‌హోమ్ (29 బంతుల్లో 33; 1 ఫోర్, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించారు. విలియమ్సన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
Comments
Please login to add a commentAdd a comment