
పంకజ్ ఖాతాలో 24వ టైటిల్
జాతీయ స్నూకర్ చాంపియన్‌షిప్
లక్నో: ప్రపంచ చాంపియన్ పంకజ్ అద్వానీ ఆరోసారి జాతీయ స్నూకర్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. పీఎస్‌పీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న అతను శుక్రవారం జరిగిన ఫైనల్లో 6-3తో కమల్ చావ్లా (రైల్వేస్)పై విజయం సాధించాడు. ఓవరాల్‌గా పంకజ్‌కు ఇది 24వ జాతీయ టైటిల్. పంకజ్ ధాటికి మ్యాచ్‌లో ఎక్కువ భాగం చావ్లా కుర్చికే పరిమితమయ్యాడు. తొమ్మిదో ప్రేమ్‌లో 139 పాయింట్లను సాధించడం పీఎస్‌పీబీ ఆటగాడికి టైటిల్‌ను తెచ్చిపెట్టింది. ఓ దశలో చావ్లా కూడా పోరాడినా స్వల్ప తేడాతో పాయింట్లు చేజార్చుకున్నాడు.
అంతకుముందు జరిగిన పోటీల్లో పంకజ్ 84, 69, 61, 64 పాయింట్లు సాధించాడు. ఈ టైటిల్‌ను మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు అంకితమిస్తున్నట్లు బెంగళూరుకు చెందిన అద్వానీ చెప్పాడు. ‘జాతీయ చాంపియన్‌షిప్‌లో పాల్గొనడం ఎప్పటికీ గర్వకారణమే. గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సమాజాన్ని నిజంగా తీర్చిదిద్దుతున్నది మహిళలే కాబట్టి వారికే ఈ టైటిల్ అంకితం’ అని పంకజ్ వ్యాఖ్యానించాడు.