
మాకొద్దీ ఐపీఎల్ టీమ్!
వెనక్కి తగ్గిన జిందాల్ గ్రూప్
ముంబై: ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును కొనాలని భావించిన జేఎస్‌డబ్ల్యూ (జిందాల్) గ్రూప్ తాజా పరిణామాలతో వెనక్కి తగ్గినట్లు తెలిసింది. లీగ్‌లో రెండు జట్లను రద్దు చేయాలంటూ జస్టిస్ లోధా కమిటీ సిఫారసు చేసిన నేపథ్యంలో లీగ్‌లో భాగం కావాలన్న ఆలోచనను ప్రస్తుతానికి పక్కన పెట్టింది. ‘ఈ సమయంలోనైతే ఐపీఎల్‌కు దూరంగా ఉండాలనేదే మా నిర్ణయం. చెడ్డ పేరు తెచ్చుకున్న లీగ్‌తో మా కంపెనీ పేరును జత చేర్చడం మాకిష్టం లేదు’ అని జిందాల్ గ్రూప్ సభ్యుడు పార్థ్ జిందాల్ స్పష్టం చేశారు.
రెండు ఫ్రాంచైజీలను తొలగించొచ్చు: లోధా
రెండేళ్ల నిషేధానికి గురైన చెన్నై, రాజస్తాన్ ఫ్రాంచైజీలను తొలగించే స్వేచ్ఛ బీసీసీఐకి ఉందని స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసును విచారించిన జస్టిస్ లోధా వెల్లడించారు. కమిటీ చేసిన ప్రతిపాదనలను ముందుకు ఎలా తీసుకెళ్లాలనే దానిపై బీసీసీఐలో కాస్త అయోమయం నెలకొన్న నేపథ్యంలో ఆయన ఈ స్పష్టతనిచ్చారు. ‘ఓ రకంగా ఈ రెండు ఫ్రాంచైజీలను తొలగించినట్లే. సుప్రీంకోర్టు తీర్పులో ఈ విషయం చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి బీసీసీఐ కూడా తొలగింపునే పరిగణనలోకి తీసుకోవాలి. బీసీసీఐ-ఐపీఎల్ ఫ్రాంచైజీల మధ్య ఒప్పందం ప్రకారం... ఏ ఫ్రాంచైజీ లేదా గ్రూప్ లేదా కంపెనీ లేదా యజమానులు లీగ్ ప్రతిష్టకు భంగం కలిగిస్తే... ఆ ఫ్రాంచైజీలను తొలగించొచ్చు’ అని లోధా వివరించారు. జస్టిస్ లోధా ఇచ్చిన వివరణ నేపథ్యంలో రెండు ఫ్రాంచైజీలను తొలగిస్తే ఎలా ఉంటుందనే దానిపై ఆదివారం జరిగే ఐపీఎల్ పాలక మండలి సమావేశంలో చర్చించనున్నారు.