నాలుగో టైటిల్‌పై గురి
చెన్నై ఓపెన్ ఫైనల్లో వావ్రింకా
చెన్నై: డిఫెండింగ్ చాంపియన్ స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్) చెన్నై ఓపెన్‌లో ‘హ్యాట్రిక్’ నమోదు చేయడానికి మరో విజయం దూరంలో ఉన్నాడు. భారత్‌లో జరిగే ఈ ఏకైక ఏటీపీ టోర్నీలో టాప్ సీడ్ వావ్రింకా ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ వావ్రింకా 6-4, 6-4తో మూడో సీడ్ బెనోయిట్ పెయిర్ (ఫ్రాన్స్)పై గెలిచాడు. 2011, 2014, 2015లలో చెన్నై ఓపెన్ టైటిల్‌ను సాధించిన వావ్రింకా...
ఆదివారం జరిగే టైటిల్ పోరులో ప్రపంచ 44వ ర్యాంకర్, ఎనిమిదో సీడ్ బోర్నా కోరిచ్ (క్రొయేషియా)తో అమీతుమీ తేల్చుకుంటాడు. సుమారు మూడు గంటలపాటు జరిగిన రెండో సెమీఫైనల్లో కోరిచ్ 7-6 (7/5), 6-7 (5/7), 6-3తో అల్‌జాజ్ బెడెన్ (బ్రిటన్)పై గెలుపొందాడు. 19 ఏళ్ల కోరిచ్ ఏకంగా 17 ఏస్‌లు సంధించడం విశేషం. వావ్రింకాతో ముఖాముఖి రికార్డులో కోరిచ్ 0-2తో వెనుకబడి ఉన్నాడు. గతేడాది సిన్సినాటి ఓపెన్‌లో, చెన్నై ఓపెన్‌లో వావ్రింకాతో ఆడిన మ్యాచ్‌ల్లో కోరిచ్‌కు ఓటమి ఎదురైంది.