కోహ్లీ సేన వైఫల్యానికి కారణం? | Report Card, RCB: What Went Wrong For Bangalore | Sakshi
Sakshi News home page

కోహ్లీ సేన వైఫల్యానికి కారణం?

Published Tue, May 2 2017 7:41 PM | Last Updated on Tue, Sep 5 2017 10:13 AM

కోహ్లీ సేన వైఫల్యానికి కారణం?

కోహ్లీ సేన వైఫల్యానికి కారణం?

హైదరాబాద్: ఐపీఎల్ లో పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వరుస వైఫల్యాలతో ప్లే ఆఫ్ అవకాశాన్ని కోల్పోయింది. గత సీజన్ లో సమిష్టంగా రాణించి ఫైనల్లో వరకూ వెళ్లిన ఆర్సీబీ.. ఈ సీజన్ లో అత్యంత చెత్త ప్రదర్శనతో అభిమానులను నిరాశ పరిచింది. భయంకరమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న బెంగళూరు బ్యాట్స్ మెన్ లు బ్యాట్ జులిపించక పోవడంతో వరుస వైఫల్యాలను మూటగట్టుకుంది. జట్టులోని ప్రధానమైన బ్యాట్స్ మెన్ లో ఏ ఒక్కరు టాప్-10 లిస్టులో లేకపోవడం గమనార్హం. ఇక కోల్ కతా పై 49 పరుగులకు కుప్పకూలి సగటు క్రికెట్ అభిమానిని ఆశ్చర్య పరిచింది. ఇది బెంగళూరు జట్టే నా అనే అనుమానం కలిగింది.

ఇక బౌలింగ్ లో కూడా ప్రత్యర్ధులను కట్టడి చేయడంలో విఫలమైంది.  జట్టులోని ప్రధాన ఆటగాళ్ల ప్రదర్శన పరిశీలిస్తే బ్యాటింగ్ లో కెప్టెన్ కోహ్లీ, బౌలింగ్ విభాగంలో చాహాల్ తప్ప ఎవరూ వారి స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయారు. మరోవైపు ఆటగాళ్ల గాయాలు కూడా బెంగళూరును వెంటాడాయి. ఓపెనర్ కే ఎల్ రాహుల్, యువ బ్యాట్స్ మన్ సర్ఫరాజ్ ఖాన్ లు ఈ సీజన్ మొత్తానికి దూరం కాగా, కెప్టెన్ కోహ్లీ, విధ్వంసకర ఆటగాడు డివిలియర్స్ తొలి మ్యాచులకు దూరమయ్యారు. దీంతో జట్టు తగిన మూల్యం చెల్లించుకోంది. ఇక ప్రధానమైన ఆటగాళ్ల ఆటను పరిశీలిస్తే..

విరాట్ కోహ్లీ: ఈ సీజన్ తొలి మ్యాచుల్లో గాయం కారణంగా దూరమైన కోహ్లీ, వచ్చిరావడంతో తన బ్యాటింగ్ తో ఆకట్టుకున్న జట్టును గెలిపించలేకపోయాడు. ఏడు ఇన్నింగ్స్ ల్లో 124.47 స్ట్రైక్ రేట్ తో కోహ్లీ 239 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధసెంచరీలున్నాయి.  గత సీజన్ లో 4 సెంచరీలు, 7 అర్ధ సెంచరీలతో దూకుడుగా ఆడిన కోహ్లీ 973 పరుగులతో టాప్ లో నిలిచాడు. ఒంటి చేత్తో మ్యాచ్ లు గెలిపించి జట్టును ఫైనల్ కు చేర్చాడు. ఈ సీజన్ లో మాత్రం అతని స్ధాయికి తగిన ప్రదర్శన కనబర్ఛకపోవడంతో  బెంగళూరు వరుస వైఫల్యాలను మూటగట్టుకుంది.

ఏబీ డివిలియర్స్: విధ్వంసకర బ్యాటింగ్ కు నిర్వచనంగా చెప్పుకునే మిస్టర్ 360  ఒకే ఒక మ్యాచ్ తప్ప అన్ని మ్యాచ్ ల్లో విఫలమయ్యాడు. 7 ఎన్నింగ్స్ లు ఆడిన డివిలియర్స్ 131.54 స్ట్రైక్ రేట్ తో కేవలం 196 పరుగులు మాత్రమే చేశాడు. గత సీజన్ లో ఒక సెంచరీ 6 హాఫ్ సెంచరీలతో 687 పరుగులతో టాప్-3 లో నిలిచాడు. ఈ సీజన్ లో మాత్రం కేవలం ఒకే ఒక అర్ధసెంచరీతో బెంగళూరు అభిమానులను తీవ్రంగా నిరాశపర్చాడు. డివి ఆడిన ఏ ఒక్క మ్యచ్ బెంగళూరు గెలవకపోవడం విశేషం.

క్రిస్ గేల్: బిగ్ వెస్టీండియన్ ఈజ్ బిగ్ డిజాప్పాయింట్ మెంట్ ఫర్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. అవును బెంగళూరును తీవ్రంగా నిరాశపరిచింది క్రిస్ గేల్. హిట్టింగ్ అంటనే గేల్, గేల్ అంటేనే హిట్టింగ్ అన్నట్లు ఉండే అతని బ్యాటింగ్. ఈ సీజన్ లో మాత్రం అతని బ్యాట్ మూగబోయింది. జట్టులో ఎప్పుడు కీలక ఆటగాడిగా ఉండే గేల్ ఈ సీజన్ లో జట్టులో చోటుకోసం పోటి పడాల్సి వచ్చింది. ఒకే ఒక మ్యాచ్ లో 77 పరుగులతో ఆకట్టుకున్న గేల్ 6 ఇన్నింగ్స్ ల్లో 124.59 స్ట్రైక్ రేట్ తో కేవలం 152 పరుగులు మాత్రం చేశాడు.

యజువేంద్ర చాహల్: ఐపీఎల్-10 లో  అంతో ఇంతో రాణించిన ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది చాహలే. 10 మ్యాచ్ లు ఆడిన చాహాల్ 7.66 ఎకానమితో 11 వికెట్లు పడగొట్టాడు. గత సీజన్ లో 21 వికెట్లు పడగొట్టి టాప్-2 లో నిలిచాడు.

తైమల్ మిల్స్: ఐపీఎల్-10 వేలంలో అత్యంత ధర పలికిన రెండో ఆటగాడు ఈ ఇంగ్లండ్ బౌలర్. కానీ అతను పలికిన ధరకు తగిన న్యాయం చేయలేకపోయాడు. 5 మ్యాచ్ లు ఆడిన మిల్స్ 8.50 ఎకానమితో 5 వికెట్లు పడగొట్టాడు. ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ పరుగులు చేయకుండా కట్టడి చేయడంలో విఫలమయ్యాడు. గత భారత్-ఇంగ్లండ్ టీ20 సిరీస్ లో వైవిధ్యమైన బంతులతో ఆకట్టుకున్న మిల్స్ పై ప్రాంచైజీలు ఆసక్తి చూపాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు రూ.12 కోట్లకు దక్కించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement