ఐసీసీ ప్యానెల్ లో రిచర్డ్ సన్
దుబాయ్: ఈ ఏడాది చివర్లో శ్రీలంక మాజీ క్రికెటర్ రోషన్ మహనామా ఐసీసీ ఎలైట్ ప్యానెల్ నుంచి రిఫరీగా తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో అతని స్థానంలో వెస్టిండీస్ మాజీ క్రికెటర్ రిచీ రిచర్డ్ సన్(53) ను నియమించారు. ఈ విషయాన్ని ఐసీసీ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం వెస్టిండీస్ క్రికెట్ టీమ్ మేనేజర్ గా కొనసాగుతున్నరిచర్డ్ సన్ పదవీ కాలం ముగిసిన వెంటనే రిఫరీగా బాధ్యతలు చేపడతారని ఐసీసీ తెలిపింది. వెస్టిండీస్ బోర్డుతో రిచర్డ్ సన్ మేనేజర్ గా చేసుకున్న ఒప్పందం వచ్చే సంవత్సరం ఆస్ట్రేలియాతో జరుగనున్న సిడ్నీ టెస్టు అనంతరం ముగియనుంది.
ఐసీసీ రిఫరీల ప్యానెల్లో చోటు దక్కడం పట్ల రిచర్డ్ సన్ ఆనందం వ్యక్తం చేశాడు. ఇప్పటికే క్రికెట్ లో ఎన్నో పదవులు చేసిన తనకు ఐసీసీ రిఫరీల ప్యానెల్లో చోటు దక్కడం గొప్ప గౌరవమని పేర్కొన్నాడు. తొలుత ఆటగాడిగా, తరువాత క్రికెట్ వ్యవహారాల విభాగంలో పని చేసిన తన అనుభవం రిఫరీగా కూడా ఉపయోగపడుతుందన్నాడు. ప్రస్తుతం తన ముందు మేనేజర్ గా బాధ్యతలున్నాయని.. అది పూర్తయ్యేంతవరకూ దానికే కట్టుబడి ఉంటానని రిచర్డ్ సన్ తెలిపాడు. 1983 నుంచి 1996 మధ్య కాలంలో రిచర్డసన్ 86 టెస్టులతో పాటు, 224 వన్డేలు ఆడాడు. ఇందులో 24 టెస్టులకు కెప్టెన్ గా, 87 వన్డేలకు కెప్టెన్ గా సేవలందించారు. రిచర్డసన్ టెస్టుల్లో 5,949 పరుగులు చేయగా, వన్డేల్లో 6, 248 పరుగులు చేశారు. రిచర్డసన్ మూడు వరల్డ్ కప్ లలో (1987,92, 96) లో సభ్యుడిగా కొనసాగారు.