లాంగర్, గిలెస్పీ, పాంటింగ్..!
సిడ్నీ:ముగ్గురు దిగ్గజ క్రికెటర్లు ఒక క్రికెట్ జట్టు పర్యవేక్షణ బాధ్యతలను చూస్తే ఎలా ఉంటుంది. అందులోనూ ఒకే తరం క్రికెటర్లు ఆ పర్యవేక్షణ బాధ్యత చూస్తే ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది కదూ. ఇప్పుడు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) అదే పని చేసింది. ఒకే తరంలో దిగ్గజ ఆటగాళ్లుగా పేరు గాంచిన జస్టిన్ లాంగర్, జాసన్ గిలెస్పీ, రికీ పాంటింగ్లను ఆసీస్ ట్వంటీ 20 జట్టు పర్యవేక్షణ బాధ్యతలు చూడనున్నారు. కొన్ని రోజుల క్రితం జస్టిన్ లాంగర్ను ఆసీస్ ట్వంటీ 20 జట్టుకు తాత్కాలిక ప్రధాన కోచ్గా నియమించిన సీఏ.. ఆ తరువాత జాసన్ గిలెస్పీ ను అసిస్టెంట్ బౌలింగ్ కోచ్గా నియమించింది. అయితే తాజాగా రికీ పాంటింగ్ను ఆసీస్ ట్వంటీ 20 జట్టుకు అసిస్టెంట్ కోచ్ నియమిస్తూ సీఏ నిర్ణయం తీసుకుంది.
వచ్చే నెల్లో స్వదేశంలో శ్రీలంకతో ట్వంటీ 20 సిరీస్ నేపథ్యంలో ఈ దిగ్గజ త్రయానికి క్రికెట్ ఆస్ట్రేలియా పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. ఫిబ్రవరి 17 వ తేదీన మెల్బోర్న్లో తొలి ట్వంటీ 20 జరుగనుండగా, ఫిబ్రవరి 20న గీలాంగ్లో రెండో టీ 20, ఫిబ్రవరి 23న అడిలైడ్లో మూడో ట్వంటీ 20 జరుగనుంది.
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు దాదాపు ఒకే సమయంలో రెండు సిరీస్లు ఆడుతున్న క్రమంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది. త్వరలో భారత్ లో ఆసీస్ జట్టు పర్యటించనుండగా, అదే సమయంలో శ్రీలంక జట్టు ఆసీస్ పర్యటనకు రానుంది. కొంతమంది ప్రధాన ఆటగాళ్లు భారత్ పర్యటనకు వస్తుండగా, మరికొంతమంది టీ 20 స్పెషలిస్టు ఆటగాళ్లు మాత్రం స్వదేశంలో శ్రీలంకతో జరిగే సిరీస్ లో పాల్గొనున్నారు. భారత్ లో పర్యటించే ఆసీస్ జట్టుకు డారెన్ లీమన్ పర్యవేక్షన బాధ్యతలు నిర్వర్తించనుండగా, లాంగర్, గిలెస్పీ, రికీ పాంటింగ్ లో ఆసీస్ 'జూనియర్' జట్టుకు కోచింగ్ బాధ్యతలు తీసుకోనున్నారు.
పాంటింగ్ తన అంతర్జాతీయ కెరీర్లో 27వేలకు పైగా పరుగులను సాధించాడు. దాంతో పాటు ఆస్ట్రేలియా సాధించిన వరుస మూడు వరల్డ్ కప్ల్లో(1999,2003, 07) పాంటింగ్ కీలక పాత్ర పోషించాడు. అందులో 2003, 07 వన్డే వరల్డ్ కప్లను సాధించిన ఆసీస్ జట్టుకు పాంటింగ్ కెప్టెన్గా ఉన్నాడు. ఆసీస్ క్రికెట్ చరిత్రలో పాంటింగ్ ఘనమైన రికార్డు కల్గి ఉండటమే అతనికి కొత్త బాధ్యతను అప్పజెప్పడానికి ప్రధాన కారణమైంది. గతంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ కు కోచింగ్ బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం పాంటింగ్ కు ఉన్న సంగతి తెలిసిందే.